Pushpa The Rise: సీనియర్ నటుడు భానుచందర్ పై.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైర్

Updated on May 26, 2022 12:48 PM IST
సీనియ‌ర్ హీరో భానుచంద‌ర్ (Bhanu Chander)  కూడా ఓ ఇంట‌ర్వ్యూలో పుష్ప చిత్రం గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు.
సీనియ‌ర్ హీరో భానుచంద‌ర్ (Bhanu Chander)  కూడా ఓ ఇంట‌ర్వ్యూలో పుష్ప చిత్రం గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్  (Allu Arjun) కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శనగా కితాబునందుకున్న చిత్రం ‘పుష్ప’. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ కూడా వస్తోంది. మొదటి భాగం ‘పుష్ప ది రైజ్’ గత ఏడాది డిసెంబర్ 17 న విడుదలైన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఉత్తరాది ప్రేక్షకులను కూడా ఇదే చిత్రం అమితంగా ఆకట్టుకుంది. 

సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ వ్యయంతో ‘పుష్ప ది రైజ్’ సినిమాను ప్రొడ్యూస్ చేసింది. రష్మిక మందాన కథానాయికగా ఈ చిత్రంలో నటించింది. అలాగే సమంత ఈ చిత్రంలో ఓ ఐటమ్ సాంగ్ ద్వారా కనువిందు చేయగా.. సునీల్, అనసూయ మొదలైనవారు ఇతర పాత్రలలో నటించారు.  ప్రస్తుతం ‘పుష్ప ది రూల్‌’ కోసం బన్నీ అభిమానులు ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు.

‘పుష్ప ది రైజ్’ సినిమా పై ఎందరో సినీ ప్రముఖులు, ఎన్నో రకాలుగా తమ ఆలోచనలను పంచుకున్నారు. ఇదే క్రమంలో సీనియ‌ర్ హీరో భానుచంద‌ర్ (Bhanu Chander)  కూడా ఓ ఇంట‌ర్వ్యూలో ఈ చిత్రం గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు.  ‘హిందీ సినిమాలను మన తెలుగు, కన్నడ, తమిళ సినిమాలు డామినేట్ చేస్తున్నాయి. ఇది వాస్తవం. దక్షిణాది నుంచి పాన్ ఇండియాలో విడుదలవుతున్న సినిమాలు అక్కడ కనీవినీ ఎరుగని విజయాలను నమోదు చేస్తున్నాయి.

అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో మనకు తెలుసు. కానీ అదే సినిమా సక్సెస్ అవ్వడం వెనుక కూడా ఓ ప్రధానమైన కారణం ఉంది. ఈ క్రెడిట్ నటి స‌మంతకు ఇవ్వాలి. ఆమె డ్యాన్సర్‌గా నటించిన  "ఊ అంటావా మావ‌...సాంగ్" వ‌ల్ల‌నే సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ పాట అన్ని భాషల ఆడియెన్స్‌నూ ఆకట్టుకుంది’ అని చెప్పారు.

అయితే భానుచందర్ వ్యాఖ్యలపై పలువురు బన్నీ ఫ్యాన్స్ మండిపడితున్నారు. అల్లు అర్జున్ నటనకు దేశమంతా ఫిదా అవుతుంటే, సీనియర్ నటుడు భానుచందర్ ఆ క్రెడిట్ సమంతకు ఇవ్వడం సముచితం కాదన్నారు. ఈ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 
 

Advertisement
Credits: Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!