'బోయపాటి శ్రీను' (Boyapati Srinu) : యాక్షన్‌ ఎపిసోడ్స్‌కి కేరాఫ్‌ అడ్రెస్

Updated on Apr 26, 2022 11:05 AM IST
డైరెక్టర్ బోయపాటి శ్రీను  (Boyapati Srinu)
డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu)

ప్రస్తుతం టాలీవుడ్‌లో మాస్‌ డైరెక్టర్‌‌ ఎవరు అంటే వెంటనే గుర్తొచ్చే పేరు బోయపాటి శ్రీను (Boyapati Srinu). ఆయన డైరెక్ట్‌ చేసిన ప్రతి సినిమాలోనూ యాక్షన్ సీన్స్‌ ప్రేక్షకులను తప్పక ఆకట్టుకుంటాయి. బాలకృష్ణ హీరోగా బోయపాటి తీసిన మూడు సినిమాలు భారీ విజయం సాధించాయి. బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. లెజెండ్ సినిమాకు గాను ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు అందుకున్నారు బోయపాటి. ఈరోజు బోయపాటి పుట్టినరోజు. పింక్‌విల్లా తరఫున ఆయనకు బర్త్​డే విషెస్‌ చెబుతూ.. బోయపాటి సినిమాలతోపాటు వ్యక్తిగత విషయాలపైనా ఒక లుక్‌ వేద్దాం.

గుంటూరు జిల్లా పెదకాకాని బోయపాటి సొంత ఊరు. ఆ ఊరిలో వాళ్లకు ఫోటో స్టూడియో ఉండేది. దాంతో బోయపాటికి ఫోటోగ్రఫీపై ఆసక్తి కలిగింది. ఈనాడు దినపత్రికకు కొంతకాలం ఫోటోగ్రాఫర్‌‌గా కూడా పనిచేశాడు. కొన్నాళ్ల తర్వాత బోయపాటి దృష్టి సినిమాలపై పడింది. రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి బోయపాటికి బంధువు. ఆయన సహాయంతో ఇండస్ట్రీలోకి వచ్చిన బోయపాటి.. ముత్యాల సుబ్బయ్య వద్ద అసిస్టెంట్​గా చేరాడు. గోకులంలో సీత, పెళ్లి చేసుకుందాం, అన్నయ్య, పవిత్ర ప్రేమ, మనసున్న మారాజు సినిమాలకు అసోసియేట్‌గా పనిచేశాడు. అనంతరం సొంతంగా కథ రాసుకున్న బోయపాటి, ఆ కథను దిల్‌ రాజుకు వినిపించాడు. దిల్‌ రాజుకు కథ నచ్చడంతో వారిద్దరి కాంబినేషన్‌లో ‘భద్ర’ సినిమా వచ్చింది. భద్ర సినిమా బోయపాటికి మంచిపేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్‌తో తులసి’ సినిమా తీసి హిట్‌ కొట్టారు. ఆ సమయంలోనే నందమూరి నటసింహం బాలకృష్ణతో ‘సింహా’ సినిమా తీసి ఇండస్ట్రీ హిట్‌ కొట్టి మాస్‌కు కొత్త నిర్వచనం తెచ్చాడు. ఈ సినిమా విజయంతో బోయపాటి పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. ఇక, ఎన్టీఆర్‌‌తో దమ్ము. అల్లు అర్జున్‌తో సరైనోడు సినిమాలు తీసి మాస్ ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. బెల్లంకొండ శ్రీనివాస్‌తో ‘జయ జానకి నాయక’, రాంచరణ్‌తో ‘వినయ విధేయ రామ’ సినిమాలు తీసి పర్వాలేదనిపించుకున్నాడు.

మాస్‌, ఫ్యాక్షన్ సినిమాలకు కేరాఫ్‌గా ఉండే బాలకృష్ణతో బోయపాటి సింహా సినిమా తర్వాత ‘లెజెండ్’, రీసెంట్‌గా ‘అఖండ’ చిత్రాలు తీసి భారీ విజయాలు అందుకున్నాడు బోయపాటి. బాలయ్యతో హ్యాట్రిక్‌ హిట్లు అందుకున్న ఈ మాస్‌ డైరెక్టర్.. అఖండకు సీక్వెల్‌ తీయబోతున్నట్టు ప్రకటించి బాలకృష్ణ ఫ్యాన్స్​కు గుడ్‌న్యూస్‌ చెప్పాడు. అఖండ సినిమా విడుదలై వంద రోజులు దాటినా.. ఓటీటీలో విడుదలైనా సినిమా సందడి మాత్రం కొనసాగుతూనే ఉంది.

ప్రస్తుతం హీరో రామ్‌తో బోయపాటి (Boyapati Srinu) ఒక సినిమా తెరకెక్కిస్తున్నారు. బాలకృష్ణతో అఖండ సీక్వెల్‌ దీని తర్వాత ఉండే చాన్స్ ఉంది. ఇక, రాబోయే సినిమాలతో బోయపాటి ప్రేక్షకులకు మరింత చేరువ కావాలని కోరుకుంటూ.. హ్యాపీ బర్త్​డే బోయపాటి

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!