ఇండియన్ ఐడల్ (Telugu Indian Idol) షోలో డబుల్ ధమాకా ఎపిసోడ్.. అదరగొట్టిన ప్లే బ్యాక్ సింగర్స్
ఇటీవల ఆహా ఓటీటీలో మొదలైన తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ షో ప్రేక్షకుల కోసం సరికొత్త ఎపిసోడ్ లను ప్రిపేర్ చేస్తోంది. షో లోని 19, 20 ఎపిసోడ్స్ లో తన వ్యూవర్స్ కు డబుల్ ధమాకా ఇస్తోంది. షో చివరికి రావడంతో ప్రస్తుతం బరిలో పది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలో వారితో గొంతు కలిపేందుకు 5మంది స్టార్ ప్లేబ్యాక్ సింగర్స్ రంగంలోకి దిగారు. ఫేమస్ సింగర్స్ హేమచంద్ర, పృథ్వీచంద్ర, శ్రావణ భార్గవి, దామిని, మోహన భోగరాజు ఈ శుక్రవారం 5 మంది కంటెస్టెంట్స్ తో కలిసి గొంతు కలపి అద్భుతమైన పాటలు పాడారు. అయితే, ఈ వారం ఎలిమినేషన్ కూడా ఉండటంతో జడ్జెస్ థమన్, నిత్యామీనన్, కార్తీక్ చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరించారు.
శుక్రవారం జరిగిన తెలుగు ఇండియన్ ఐడిల్ ఎపిసోడ్ ప్రతిసారి లాగానే హోస్ట్ శ్రీరామచంద్ర కవితతో మొదలయింది. కానీ, ఈ ఎపిసోడ్ లో అతనికి బదులుగా సింగర్ హేమచంద్ర శ్రీరామచంద్ర మీదనే కవిత చదివి వినిపించాడు. ఈ కవితతో ప్రోగ్రాం షురూ అయ్యింది. అనంతరం కంటెస్టెంట్ మారుతి వేదిక మీదకు వచ్చి తన మేకోవర్ తో సర్ ప్రైజ్ చేశాడు. హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ తో సహా అన్నీ మార్చేసిన మారుతిని జడ్జి నిత్యా మీనన్ కూడా గుర్తే పట్టలేక పోయింది. మారుతి స్టేజ్ మీద తన సిగ్నేచర్ స్టైల్ లో నిలబడ్డ తర్వాతే పాడబోయేది మారుతినే అనే నిర్థారణకు వచ్చారు. మరో సింగర్ శ్రావణ భార్గవి తో కలసి నాచురల్ స్టార్ నాని నటించిన ‘ఎంసీఏ’ మూవీలోని ఏవండోయ్ నాని గారు అనే పాటను మారుతి ఆలపించాడు. సినిమాలో ఆ పాటను పాడిన శ్రావణ భార్గవినే ఇప్పుడు వేదిక మీద కూడా మారుతితో కలిసి పాడటం విశేషం.
అనంతరం సెకండ్ కంటెస్టెంట్స్ శ్రీనివాస్ ధరిమిశెట్టి ‘మిరపకాయ్’ మూవీలోని పాటను సింగర్ దామినితో కలిసి పాడాడు. ఈ సారీ కూడా… న్యాయనిర్ణేతలు ఏదో జోష్ మిస్సయ్యిందని, శ్రీనివాస్ పూర్తిగా ఎందుకో ఓపెన్ కాలేకపోయాడని అభిప్రాయపడ్డారు. జస్ట్ ఓకేగా ఉందని అనేశారు. ఆ తర్వాత సింగర్ లాలస, పృథ్వీరాజ్ తో కలిసి ‘ఏ మాయ చేసావే’ మూవీలోని ‘ప్రేమే వరమా’ సాంగ్ ను అద్భుతంగా ఆలపించింది. దీంతో ఆమె గాత్రానికి ఫిదా అయిపోయిన థమన్ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చి మరీ... ఆమెను అభినందించారు. అనంతరం నిత్యా మీనన్, కార్తీక్ కూడా ఆ సింగర్ ను అభినందించారు. ఆ సినిమాలో ఒరిజినల్ గా జడ్జి కార్తీక్ పాడటంతో అతనితో కలిసి పాడాలని ఉందని లాలస కోరింది. దీంతో కార్తీక్ వెంటనే ఆమె కోరికను తీర్చేశాడు.
అనంతరం సింగర్ హేమచంద్రతో కలిసి కంటెస్టెంట్ అదితి.. ‘బిల్లా’ సినిమాలోని ‘వేరీజ్ ద పార్టీ’ పాట పాడగా.. ఎపిసోడ్ చివరలో సింగర్ మాన్య ‘అఖండ’ సినిమాలోని అమ్మ పాటను మోహన భోగరాజు కలిసి పాడింది. అయితే, సినిమాలో ఆ పాటను పాడిన మోహన గానం ముందు మాన్య తేలిపోయింది. కంటెస్టెంట్ మాన్య తన వంతు కృషి చేసినా… తేడా స్పష్టంగా కనిపించినట్లు థమన్ చెప్పాడు. మరోవైపు నిత్యా మీనన్ ఇద్దరూ కలిసి ఆ పాటకు ప్రాణం పోశారంటూ తెగ మెచ్చుకుంది.