సింగిల్ టేక్ యాక్టర్‌గా ఉండడమే ఇష్టం.. టాక్ షో హోస్టింగ్‌లకు సెట్ అవ్వను అంటున్న విక్టరీ వెంకటేష్ (Venkatesh)
విక్టరీనే తన ఇంటి పేరుగా పెట్టుకుని, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఇష్టమైన హీరోగా, ఏ రకమైన క్యారెక్టర్ చేసినా అందులో ఒదిగిపోయే, ముప్పై సంవత్సరాలకుపైగా ఉన్న సినిమా కెరీర్‌లో వివాదాలు లేని హీరో దగ్గుబాటి వెంకటేష్.స్టార్ హీరోగా ఉన్నా మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, లోకనాయకుడు కమల్ హాసన్‌తో ఈనాడు, మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌తో ఎఫ్2 సినిమాలు చేసి హిట్లు అందుకున్నాడు వెంకటేష్. వరుణ్‌తేజ్‌తో కలిసి మరోసారి నటించిన ఎఫ్3 ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా వెంకటేష్ (Venkatesh) మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
ప్రతి సినిమాను ఫస్ట్ సినిమాలాగానే అనుకుని నటిస్తాను. హీరో పాత్ర ఇలాగే ఉండాలి అని అనుకోను. ప్రతి సినిమాలోనూ ఎంజాయ్ చేస్తూనే నటిస్తా.. అలాగే ఎఫ్3 కూడా చేశాను. కామెడీ సినిమాలు అంటే చాలా ఇష్టం. అనుకోకుండా గత రెండు చిత్రాలు నారప్ప, దృశ్యం-2 ఓటీటీలో వచ్చాయి. రెండు సంవత్సరాల తర్వాత థియేటర్ల ద్వారా ప్రేక్షకులను పలకరించబోతున్నాను. థియేటర్లలో సినిమా చూస్తే వచ్చే కిక్కే వేరు. ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు బిగ్‌స్క్రీన్‌పై చూస్తేనే బాగుంటాయి. ఎఫ్-3 థియేటర్లో చూడాల్సిన సినిమా. అందరికీ తప్పకుండా నచ్చుతుంది.
కామెడీ అంటే చాలా ఇష్టం. స్నేహితులతో కానీ, ఇంట్లో కానీ జోకర్‌లాగానే ఉంటాను. అనిల్ రావిపూడి రైటింగ్ ఇష్టం. సినిమాలో క్యారెక్టర్లను అనిల్ నేచురల్‌గా తీర్చిదిద్దుతాడు. మేమిద్దరం క్లోజ్‌గా ఉంటాం. ఈవీవీ గారి లాగానే అనిల్ కామెడీ బాగా పండిస్తాడు. అనిల్ నుంచి చాలా నేర్చుకున్నా. మన చుట్టూ ఉన్న జనాలను చూసే అన్ని విషయాలు నేర్చుకుంటా. ఎఫ్-3లో కామెడీ బాగుంటుంది. సినిమాలో డిఫరెంట్ వాయిస్ యూజ్ చేశాను. ఈ సినిమాలో రేచీకటి పాత్ర పోషించాను. అలాంటి పాత్రలో నటించడం ఇదే ఫస్ట్ టైమ్.
ఎఫ్3 ఏ స్థాయిలో హిట్ అవుతుందో చెప్పలేను కానీ..ఎఫ్2 కంటే హిలేరియస్‌గా ఉంటుందని మాత్రం చెప్పగలను. ఈ జానర్ సినిమాలే చేయాలని అనుకోలేదు. ఆడియన్స్‌కు ఏది ఇష్టమో అది ఇస్తే సరిపోతుంది. వచ్చిన సినిమాలను చేసుకుంటూ పోవాలి అంతే. దేని గురించీ ఎక్కువగా ఆలోచించకూడదు. పని చేసుకుంటూ వెళ్లాలి. కొవిడ్ తర్వాత ఓటీటీ ప్రాధాన్యత పెరిగింది. రానాతో కలిసి ఓ వెబ్ సిరీస్ చేశా. కొవిడ్ టైంలో ఖాలీగా ఉండడంతో.. ఓటీటీ కోసం వెబ్ సిరీస్ చేశా. ఛాలెంజింగ్‌గా అనిపించింది. త్వరలోనే ఆ వెబ్ సిరీస్‌లో నా లుక్ విడుదల కాబోతోంది.
ఇక, సల్మాన్‌ఖాన్‌తో తీయబోయే చిత్రంలో బ్రదర్ క్యారెక్టర్ చేస్తున్నాను. మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి నేను ఎప్పుడూ రెడీగానే ఉంటాను. మంచి కథ సెట్ అయితే ఏ హీరోతోనైనా కలిసి నటిస్తా. బాక్సాఫీస్ నంబర్లను నమ్మను. కానీ నిర్మాతలకు మాత్రం లాభాలు రావాలని ఎప్పటికీ ఆశిస్తాను. అలాగే ఫ్యాన్స్‌ని, ఆడియన్స్‌ని అలరిస్తే చాలన, ప్రతి సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటాను.
సెట్‌లో నేను నిర్మాత లాగానే ఆలోచిస్తాను. ఏదైనా వృథా అయితే బాధ కలుగుతుంది. సినిమా షూటింగ్‌కు ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటంది. కానీ మూవీ హిట్ అయితే అవన్నీ మర్చిపోతారు. పాన్ ఇండియా సినిమాలు అనేది కేవలం బిజినెస్ మాత్రమే. నా సినిమాకు పాన్ ఇండియా స్థాయి మార్కెట్ ఉందనుకుంటే..అంతటా విడుదల చేస్తారు. లేదంటే ఇక్కడే రిలీజ్ చేస్తారు. పాన్ ఇండియా స్థాయి కథలు వస్తే.. చేయడానికి సిద్దంగానే ఉంటాను.
టాక్ షోలకు హోస్టింగ్ చేయాలని చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ అది నాకు సెట్ కాదు. ఒకే సీన్‌ను మళ్లీ మళ్లీ చేయడం నాకు కష్టం. సింగిల్ టేక్ యాక్టర్‌గా ఉండడమే ఇష్టం. కోవిడ్ టైమ్‌లో షూటింగ్స్ చాలా కష్టంగా జరిగాయి. మన ముందు ఉన్న ఆర్టిస్ట్‌కు కరోనా ఉందో లేదో తెలియదు. మేము ఏమో మాస్క్ తీసి డైలాగ్స్ చెప్పాలి. చాలా భయమేసేది. షూటింగ్ అయిపోగానే క్యారివాన్‌లోకి వెళ్లి ఆవిరి పట్టేవాడిని. ఈ రెండేన్నరేళ్లలో నేను కోవిడ్ బారిన పడలేదు. నేను ఇప్పటికీ మాస్కులు ధరిస్తున్నాను. ఇప్పుడు చాలా మంది అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. గుంపులు ఉన్నప్పుడు మాస్కులు ధరిస్తేనే మంచిదని నా భావన.
వివేకానంద బయోపిక్ తీయాలనుకున్నా కుదరలేదు. ఇప్పుడు తీయాలని లేదు. నాన్న గారి (నిర్మాత రామానాయుడు) బయోపిక్ స్క్రిప్ట్ వస్తే మాత్రం తప్పకుండా నటిస్తాను. ఎఫ్2లో లాగానే ఎఫ్3లో ఎలాంటి కొత్త ఆసనాలు ఉండవు. కానీ కామెడీ మాత్రం అంతకు మించి ఉంటుంది. ప్రతి సన్నివేశం నవ్వులు పూయిస్తాయి. ఈ జనరేషన్ పిల్లలను కూడా అలరించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం అందించాడు. అన్ని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిందని మీడియాతో వెంకటేష్ (Venkatesh) చెప్పుకొచ్చాడు.