బాంబ్ బ్లాస్ట్‌తో ఆసక్తిగా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda).. కొత్త సినిమా ఫస్ట్ లుక్ యాడ్
సినిమాకు ప్రేక్షకుడు రావాలంటే కావలసింది పబ్లిసిటీ.. ఆ పబ్లిసిటీని ఎలా చేశాం అనే దానిపైనే సినిమా కలెక్షన్లు ఆధారపడి ఉంటాయి. సినిమా రిలీజ్‌కు కొద్ది రోజుల ముందు నుంచే ఈ హడావుడి ఉండేది. అయితే సినిమా ఇండస్ట్రీలో పోటీ విపరీతంగా పెరిగిపోవడంతో.. పబ్లిసిటీ కూడా అదే రేంజ్‌లో చేస్తున్నాయి నిర్మాణ సంస్థలు. సినిమాకు తాము చేసే ప్రచారం పైనే సినిమా హిట్, ప్లాప్ ఆధారపడి ఉంటాయని నమ్ముతున్నాయి కూడా. దాంతో వాటి కోసం స్పెషల్‌గా బడ్జెట్ కూడా పెట్టుకుంటున్నాయి.
యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)కు యూత్‌లో ఉన్న క్రేజ్ ఏంటో మనందరికీ తెలిసిందే. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. అప్పటినుంచి విజయ్‌కు ఆ రేంజ్ హిట్ రాకపోయినా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో లైగర్ సినిమాలో నటించాడు. ఆ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో త్వరలో విడుదలకు రెడీగా ఉంది.
ఆ సినిమా షూటింగ్ పూర్తి కావడంతోనే సమంత హీరోయిన్‌గా తెరకెక్కుతున్న సినిమాను పట్టాలెక్కించాడు విజయ్. లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కాశ్మీర్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను సోమవారం రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఫస్ట్ లుక్ రిలీజ్‌ను ప్రమోట్ చేయడానికి డైరెక్టర్ శివ నిర్వాణ ప్లాన్ చేశాడు. ‘#వీడీ11’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమా ఫస్ట్ లుక్ ప్రకటన కోసం డైరెక్టర్ శివ, స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ చేసిన వీడియోను రిలీజ్ చేశారు.
ఆ వీడియోలో.. ఇదో ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. కాశ్మీర్ మంచు కొండల మధ్యలో హీరోయిన్‌ను ఫస్ట్ టైమ్ చూస్తున్న హీరో.. ఆ సమయంలో స్మోక్ ఎఫెక్ట్ కావాలి. మణిరత్నం సినిమాలో హీరోయిన్ ఎంట్రన్స్ సీన్ ఉన్నట్టుగా అని పీటర్ హెయిన్స్‌కు డైరెక్టర్ శివ వివరించాడు. దానికి సరేనని చెప్పిన పీటర్ హెయిన్స్.. తన టీమ్‌తో కలిసి స్మోక్ ఎఫెక్ట్ కోసం బాంబ్‌బ్లాస్ట్‌కు ప్లాన్ చేస్తాడు. షూటింగ్ స్టార్ట్ అయిన వెంటనే.. డైరెక్టర్ రోల్ కెమెరా యాక్షన్ అని చెప్పగానే... బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. అప్పుడు వచ్చే పొగలో నుంచి... #వీడీ11 ఫస్ట్ లుక్. సోమవారం ఉదయం 9:30 గంటలకు అని డిస్‌ప్లే అయ్యింది. ఇంత ప్లాన్ చేసి ఫస్ట్ లుక్ రిలీజ్ ప్రకటన చేసిన చిత్ర యూనిట్... రిలీజ్ చేసే విజయ్ (Vijay Deverakonda) కొత్త సినిమా ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతోందో చూడాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే మరి.