నా గురించి ఎవరూ అలా అనుకోకూడదంటున్న తమన్నా (Tamannaah Bhatia)
‘శ్రీ’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తమన్నా భాటియా (Tamannaah Bhatia) అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. మిల్కీ బ్యూటీగా తన అందంతో కుర్రకారుని ఉర్రూతలూగిస్తూనే.. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను కూడా చేస్తూ మంచి నటిగా ఎదిగింది. తెలుగు, తమిళంతో పాటు బాలీవుడ్ సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంది ఈ ముంబై భామ.ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తున్న తమన్నా.. టాలీవుడ్‌లోని అందరి అగ్రహీరోలతోపాటు దాదాపుగా చాలామంది యువ హీరోలతో కూడా స్క్రీన్‌ను షేర్ చేసుకుంది.
అంతేకాదు చాన్స్ దొరికిన ప్రతిసారీ ఐటమ్ సాంగ్స్ చేస్తూ యూత్‌కు దగ్గరైంది. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తోందీ మిల్కీ బ్యూటీ. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ఎఫ్3తోపాటు, మెగాస్టార్ చిరంజీవితో భోళాశంకర్‌లో నటిస్తోంది. సూపర్‌హిట్ సినిమా ఎఫ్2కి సీక్వెల్‌గా వస్తున్న ఎఫ్3లో వెంకటేష్‌కు జంటగా చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో చిత్ర యూనిట్ నిర్వహిస్తున్న ప్రమోషన్ కార్యక్రమాల్లో తమన్నా పాల్గొంటోంది.
సినిమా ఇండస్ట్రీకి వచ్చి అప్పుడే చాలా కాలం అయిపోయిందా అనిపిస్తోందని అంటోంది తమన్నా. చూస్తుండగానే ఇండస్ట్రీలో సీనియర్‌ని అయిపోయాను. అయితే సీనియారిటీ అనేది ఒక బాధ్యత. కెరీర్ స్టార్టింగ్‌లో ఎటువంటి పాత్రను ఎంచుకుని నటించినా ఎవరూ ఏమీ అనుకోరు. కానీ ఇప్పుడు అలా కాదు. ఏ పాత్ర చేయాలనే దాన్ని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. ఏంటి.. తమన్నా ఇలాంటి పాత్రను సెలెక్ట్ చేసుకుంది అని ఎవరూ అనుకోకూడదు. అందుకే ఏ పాత్ర చేయాలి. ఏది చేయకూడదు అనే దానిపై శ్రద్ధ పెడుతున్నాను. నేను సెలెక్ట్ చేసుకునే పాత్రల కారణంగా నా విలువ తగ్గిపోకుండా జాగ్రత్తపడుతున్నాను అని చెప్పింది తమన్నా.
కాగా, విక్టరీ వెంకటేష్, తమన్నా, మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్, మెహరీన్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ఎఫ్3. అనిత్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దిల్ రాజు నిర్మించిన ఎఫ్ 3 ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తోంది.
డిసెంబర్ 21న ముంబయిలో పుట్టిన తమన్నా (Tamannaah Bhatia).. 2005లో హిందీ సినిమా చాంద్ సా రోషన్ చెహ్రాతో చిత్రసీమలోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు మూడు భాషల్లో కలిపి సుమారుగా 65 సినిమాల్లో నటించింది. తమిళ్ సినిమాల్లో అయాన్, పయ్యా, సిరుతాయ్, వీరమ్, ధర్మ దురై, దేవి, స్కెచ్‌తోపాటు తెలుగులో 100% లవ్, ఊసరవెల్లి, రచ్చ, తడాఖా, బాహుబలి 1, 2, బెంగాల్ టైగర్, ఊపిరి, ఎఫ్2, సైరా నరసింహారెడ్డి సినిమాలు విజయం సాధించాయి.