అలా కలిసొచ్చింది నితిన్‌ (Nithiin)కు మాత్రమే : ఒకే యూనిట్‌తో రెండు సినిమాల్లోని పాటలు.. !

Updated on May 22, 2022 05:00 PM IST
నితిన్‌ (Nithiin)
నితిన్‌ (Nithiin)

జయం సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నితిన్‌ (Nithiin) స్టార్ హీరోగా ఎదిగాడు. మాస్‌ ఇమేజ్‌తోపాటు, లవర్‌‌బాయ్‌ ఇమేజ్‌ను కూడా సంపాదించుకున్నాడు. 'భీష్మ' చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన నితిన్ 'చెక్, రంగ్‌దే, మాస్ట్రో' సినిమాలతో వరుస పరాజయాలు ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో తదుపరి చిత్రాల విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నాడు.

ప్రస్తుతం నితిన్ చేతిలో రెండు సినిమాలున్నాయి. అతడి సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ మూవీస్ బ్యానర్‌లోనే ఈ రెండు చిత్రాలు నిర్మిస్తున్నాడు. కొత్త దర్శకుడు రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో 'మాచర్ల నియోజకవర్గం'లో నటిస్తూనే.. వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీకి కమిట్ అయ్యాడు నితిన్.

ఇటీవలే ఈ సినిమా ప్రారంభ కార్యక్రమం గ్రాండ్‌గా జరిగింది. అలాగే షూటింగ్ కూడా మొదలైంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా చేస్తోంది. ఇటీవలే విదేశాల్లో ఒక సాంగ్ చిత్రీకరణ కూడా పూర్తిచేసి, ఇండియా తిరిగొచ్చింది చిత్ర యూనిట్.

ప్రస్తుతం ఇటలీలో 'మాచర్ల నియోజకవర్గం' సినిమా పాటల షూటింగ్‌ జరుగుతోంది. ఈ సినిమాలోని మూడు పాటలు షూట్ చేయాల్సి ఉండగా.. మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. అయితే ఆ ఖాళీ సమయాన్ని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలోని ఒక పాట షూటింగ్‌ను, ఇటలీలోనే పూర్తి చేశాడు నితిన్.

శ్రీలీల, వక్కంతం, డాన్స్ మాస్టర్, కెమెరామెన్‌ మాత్రమే ఇండియా నుంచి ఇటలీ వెళ్లారు. మిగిలినవారంతా మాచర్ల నియోజకవర్గం టీమే. అలా ఒకే దేశంలో.. ఒకే యూనిట్‌తో రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్స్‌ను పూర్తి చేయడం నితిన్‌కు మాత్రమే చెల్లింది.

ఈ రెండు సినిమాలపై నితిన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. 'మాచర్ల నియోజకవర్గం' పొలిటికల్ థ్రిల్లర్ కాగా.. వక్కంతం దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా పక్కా యాక్షన్ చిత్రం. రేసుగుర్రం తరహా స్క్రీన్ ప్లేతో ఈ సినిమా తెరకెక్కుతోంది. మాచర్ల నియోజకవర్గం చిత్రం షూటింగ్ పూర్తయిన వెంటనే.. వక్కంతం చిత్రంపై పూర్తి ఫోకస్ పెట్టబోతున్నాడు యంగ్‌ హీరో నితిన్. మరి నితిన్‌ (Nithiin)కు ఈ రెండు సినిమాలు ఏ స్థాయిలో సక్సెస్ అందిస్తాయో చూడాలి.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!