కోర్టు తీర్పుతో ఆగిపోయిన రాజశేఖర్‌‌ (Rajasekhar) నటించిన ‘శేఖర్’ సినిమా షోస్.. కుట్ర జరిగిందని హీరో ఆవేదన

Updated on May 24, 2022 10:28 AM IST
శేఖర్‌‌ సినిమాలో కూతురుతో రాజశేఖర్‌‌
శేఖర్‌‌ సినిమాలో కూతురుతో రాజశేఖర్‌‌

రాజశేఖర్‌(Rajasekhar) కీలక పాత్రలో నటించిన చిత్రం ‘శేఖర్‌’. జీవితా రాజశేఖర్‌ దర్శకత్వం వహించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్‌ తెచ్చుకుంది.  ఈ క్రమంలో ‘శేఖర్‌’ చిత్రానికి ఊహించని పరిస్థితి ఎదురైంది. చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ సిటీ సివిల్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.  జీవితా రాజశేఖర్‌ డబ్బులు చెల్లించలేదని ఫైనాన్షియర్‌ పరంధామరెడ్డి కోర్టుకు వెళ్లారు. ఆయన పిటిషన్‌ విచారణకు స్వీకరించిన కోర్టు ‘శేఖర్‌’ సినిమా ప్రదర్శన నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రంలోపు రూ.65లక్షలు డిపాజిట్‌ చేయాలని కోర్టు తెలిపింది. నగదు డిపాజిట్‌ చేయకపోతే శేఖర్‌ మూవీ అన్ని హక్కులు అటాచ్‌ చేయాలని ఆదేశించింది. థియేటర్లు, డిజిటల్‌, శాటిలైట్‌, ఓటీటీ యూట్యూబ్‌లో ఎలాంటి ప్రసారాలు చేయొద్దని కోర్టు పేర్కొంది.

కోర్టు ఆదేశాల నేపథ్యంలో నటుడు నటుడు రాజశేఖర్‌ స్పందించారు. కొందరు కుట్ర చేసిన  తమ సినిమా ప్రదర్శన నిలిపివేశారని అన్నారు. శేఖర్‌ చిత్రాన్ని పూర్తి చేసేందుకు చాలా కష్టపడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపారు.

ఇదిలా ఉండగా.. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి అన్నాడు. జీవితా రాజశేఖర్ ఈ చిత్రానికి దర్శకురాలు మాత్రమేనని, నిర్మాతను తానేనని.. సుధాకర్‌‌ రెడ్డి స్పష్టం చేశాడు. ఈ సినిమాను నిలిపేయాలంటూ ఫైనాన్షియర్ ఎ. పరంధామరెడ్డి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేసినట్టు వార్తలు వచ్చాయి.

‘జీవితా రాజశేఖర్‌ 48 గంటల్లోగా రూ.65 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్‌గా తనకు ఇవ్వాలి. అలా చేయని పక్షంలో ‘శేఖర్‌’ సినిమాకు సంబంధించిన నెగెటివ్‌ రైట్స్‌ను అటాచ్‌ చేస్తూ డిజిటల్‌, శాటిలైట్‌, ఓటీటీ, యూట్యూబ్‌ వంటి మాధ్యమాలతోపాటు సినిమా ట్రైలర్‌ను కూడా ప్రసారం చేయకూడదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అటాచ్‌మెంట్‌ అమలులోకి వస్తే ఆదివారం సాయంత్రం తర్వాత ‘శేఖర్‌’  సినిమాను ఏ ప్లాట్‌ఫామ్‌లో ప్రదర్శించినా కోర్టు ధిక్కరణే అవుతుంది’ అని ఫైనాన్షియర్‌‌ ఎ.పరంధామరెడ్డి హెచ్చరించారు.

ఫైనాన్షియర్ పరంధామరెడ్డి వాదనను నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి  తోసిపుచ్చారు. ‘నేను ‘శేఖర్’ చిత్రానికి నిర్మాతను. జీవితా రాజశేఖర్ మా సినిమాకు దర్శకత్వం మాత్రమే చేశారు. వాళ్లిద్దరికీ ఇవ్వాల్సిన రెమ్యునరేషన్లు ఇచ్చేశాను. ఈ సినిమా రాజశేఖర్ (Rajasekhar), జీవితకు చెందినదిగా అనుకుని ఎవరో కోర్టుకు వెళ్లారు. నా సినిమాకు గనుక నష్టం కలిగిస్తే..  సదరు వ్యక్తులపై పరువు నష్టం దావా వేస్తా. నష్టపోయిన మొత్తాన్ని వాళ్ల నుంచి వసూలు చేస్తాను. నా సినిమాను ఎవరికీ అమ్మకూడదని ఏదో చెబుతున్నారు. అది చెల్లదు. ఎందుకంటే... శేఖర్‌‌ సినిమాకు నిర్మాతను నేనే’’ అని సుధాకర్‌‌రెడ్డి చెప్పాడు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!