పూరిజగన్నాథ్​ ‘జనగణమన’లో హీరోయిన్‌గా పూజా హెగ్డే (Pooja Hegde)?

Updated on May 07, 2022 12:13 AM IST
జనగణమన  సినిమా పోస్టర్, పూజా హెగ్డే (Pooja Hegde)
జనగణమన సినిమా పోస్టర్, పూజా హెగ్డే (Pooja Hegde)

ఒక లైలా కోసం, ముకుంద సినిమాల్లో ట్రెడిషనల్‌ లుక్‌లో కనిపించినా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన దువ్వాడ జగన్నాథం సినిమాతో తనలోని హాట్‌ యాంగిల్‌ని చూపించి వరుస అవకాశాలు దక్కించుకున్న ఉత్తరాది భామ పూజా హెగ్డే (Pooja Hegde). అయితే ఆ సినిమా ఫలితం కాస్తా బెడిసికొట్టడంతో ఆచితూచి కథలు ఎంచుకోవడం మొదలుపెట్టింది. అరవింద సమేత వీర రాఘవ, అలవైకుంఠపురంలో, మహర్షి, మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచ్‌లర్‌ వంటి సినిమాలు మంచి విజయం సాధించడంతో టాలీవుడ్‌లోనే టాప్‌ హీరోయిన్‌ స్థాయికి చేరుకుంది.

అంతేకాదు హిట్‌ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా ప్యాన్‌ ఇండియా లెవల్లో క్రేజీ ప్రాజెకట్స్‌లతో బిజీగా ఉంది. ఈమె నటించిన సినిమాలు అంతగా సక్సెస్‌ కాకపోయినా పూజ హవా మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఆమె నటించబోయే మరో పాన్‌ ఇండియా మూవీ Janaganamana (JGM). హీరో విజయ్‌, మాస్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ కలయికలో ఈ సినిమాను ప్రకటించారు. త్వరలోనే చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు కానుంది. దేశభక్తిని, యాక్షన్‌ ను మిళితం చేస్తూ రూపొందించబోయే JGM చిత్రంలో కథానాయికగా పూజాహెగ్డేను ఎంచుకున్నాడు పూరీ. అయితే వరుస ప్లాపులు ఖాతాలో వేసుకుంటున్న పూజ స్థానంలో మరో హీరోయిన్‌ అయితే బాగుంటుందంటున్నారు అభిమానులు. కానీ పూరీ తన నిర్ణయాన్ని మార్చుకోకుండా పూజకే ఓటేయడంతో ఈ సినిమాలో పూజ దాదాపు కరారైనట్టేనని తెలుస్తోంది. పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సైతం ఈ సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం విజయ్‌, పూరీ కలయికలో ‘లైగర్‌' చిత్రం రూపొందుతోంది.

కాగా, దువ్వాడ జగన్నాథం మూవీ నుంచి వరుస సక్సెస్‌లతో ఉన్న పూజా హెగ్డే జైత్రయాత్రకు ప్రభాస్‌ ప్యాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ ‘రాధే శ్యామ్‌' బ్రేకులు వేసింది. రాధే శ్యామ్‌' బాక్సాఫీస్‌ దగ్గర ఫెయిలైనా ఈ సినిమాలో ప్రేరణగా పూజా హెగ్డే నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ చిత్రంలో డాక్టర్‌ పాత్రలో మంచి నటనే కనబరిచింది. ఈ సినిమా ఫెయిలైన తర్వాత విజయ్‌తో ‘బీస్ట్‌' చిరంజీవి, రామ్‌ చరణ్‌ల ‘ఆచార్య’ సినిమాలు కూడా ఆశించిన విజయం అందుకోలేకపోవడంతో పూజకు నిరాశే మిగిలింది. అయితే రాబోయే సినిమాల సక్సెస్‌తో సమాధానం చెప్పాలని చూస్తోంది పూజ. 

రంగస్థలంలో జిగేల్‌ రాణిగా కుర్రాళ్ల మనసు దోచిన పూజ తాజాగా ఎఫ్‌ 3 మూవీలో మళ్లీ ఐటెం సాంగ్‌ చేసింది పూజ. మే 27న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాదు పవన్‌ కళ్యాణ్‌, హరీష్‌ శంకర్‌ సినిమా ‘భవదీయుడు భగత్‌సింగ్‌' సినిమాలోనూ నటిస్తోంది. దర్శకుడు హరీష్‌ శంకర్‌తో పూజకు ఈ సినిమా ముచ్చటగా మూడోది. ప్రస్తుతం మహేష్‌ బాబు,త్రివిక్రమ్‌ సినిమాలోనూ నటిస్తోంది. మహేష్‌తో మరోసారి జతకట్టబోతోంది.

హిందీలో సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటిస్తోన్న ‘కభీ ఈద్‌ కభీ దివాళీ’ సినిమాలోనూ నటిస్తోంది పూజ. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ’ఈ నెల 12 నుంచి మొదలు కానుంది. రణ్‌వీర్‌ సింగ్‌తో చేస్తోన్న సర్కస్‌ సినిమా జూలై 15న విడుదల కానుంది. మొత్తంగా భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దుమ్ము దులుపుతోంది క్రేజీ భామ పూజా హెగ్డే (Pooja Hegde).

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!