ఏ వర్గాన్నీ కించపరచలేదు.. ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి: జీవితా రాజశేఖర్ (Jeevitha Rajasekhar)
సోషల్ మీడియాలో తనపై వచ్చే కథనాలు, రూమర్స్ మరెవరిపైనా ఉండవని సినీనటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్ (Jeevitha Rajasekhar) ఆవేదన వ్యక్తం చేశారు. తను, తన ఫ్యామిలీ ఎవరినైనా మోసం చేయడం చూశారా? అని ప్రశ్నించారు. నటీనటులపై సోషల్ మీడియాలో జరుగుతన్న అసత్య ప్రచారాన్ని ఖండిస్తూ హైదరాబాద్ ఫిలిం చాంబర్‌లో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ప్రెస్‌మీట్‌లో జీవిత మాట్లాడారు.
‘సినిమా షూటింగ్స్, ఇతర పనులతో మా కుటుంబం ఎప్పుడూ బిజీగా ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రమే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతాను. ఇలా ఉన్నప్పటికీ మా కుటుంబం పై వచ్చిన అసత్య వార్తలు మరెవ్వరి మీదా రాలేదు. నేను ఎవరికైనా అన్యాయం చేయడం చూశారా?’ అని జీవితా రాజశేఖర్ ప్రశ్నించారు.
"ఇటీవలే ‘గరుడవేగ’ నిర్మాతలు కోటేశ్వరరాజు, హేమ మాపై ఎన్నో ఆరోపణలు చేశారు. సినిమాకి వాళ్లు కొంత మాత్రమే ఖర్చుచేశారు. మిగతాది మేము ఆస్తులమ్ముకుని ఖర్చు పెట్టాం. సినిమా రిలీజ్ అయిన తర్వాత, వచ్చిన డబ్బు మొత్తం వాళ్లే తీసుకున్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. మేము రూ.26 కోట్లు తీసుకుని ఎగ్గొట్టామని చెబుతున్నారు. మోసం చేశామని ఆరోపణలు చేశారు. ఆ వార్తలను మీడియా నాలుగు రోజులు ప్రసారం చేసింది. దానిపై నేను ఆయా మీడియా వాళ్లను ప్రశ్నించాను. కోటేశ్వరరాజు బ్లాంక్ చెక్ చూపించారు కాబట్టే, కథనాలు ప్రసారం చేశామని వారంటున్నారు. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో ఉంది. నిజానిజాలు త్వరలోనే తెలుస్తాయి" అని జీవిత తెలిపారు.
"ఇటీవలే నా కూతుళ్లపై కూడా ఏవేవో వార్తలు రాశారు. నా కూతురి వ్యక్తిగత జీవితాన్ని ఇబ్బంది పెట్టేలా, కొంతమంది థంబ్‌నెయిల్స్ పెట్టి వార్తలు సృష్టించారు. ఇలాంటి వార్తల వల్ల మా కుటుంబంలో ఇబ్బందులు పెరుగుతున్నాయి. కొన్ని మీడియా హౌస్‌లు మాత్రమే ఇలాంటి పనులు చేస్తున్నాయి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, తప్పు చేశామో లేదో నిరూపించుకోవడానికి అవకాశం ఇవ్వండి. మేము తప్పు చేశామని రుజువైతే, నడిరోడ్డుపై మమ్మల్ని నిలబెట్టి కొట్టండి. ఇలాంటి అసత్య వార్తల కారణంగా, 25 సంవత్సరాలుగా ఎంతో ఇబ్బందిపడుతున్నా. న్యాయ పోరాటం చేయొచ్చు. కానీ, అంత సమయం, డబ్బు అందరి దగ్గరా ఉండదు. మాకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి" అని ఆవేదన వ్యక్తం చేశారు జీవిత.
"శేఖర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా, నా కూతుళ్లతో కలిసి ఓ ఇంటర్వ్యూ ఇచ్చాను. అందులో నేను ఓ నానుడి వాడితే.. దాన్ని వేరేలా అర్థం చేసుకుని.. ఆర్యవైశ్య వర్గం వారిని కించపరిచినట్లు వార్తలు వచ్చాయి. దానిపై చర్చా సమావేశం నిర్వహించారు. ఏ వర్గాన్నీ కించపరచాలనే ఉద్దేశం నాకు లేదు. నా మాటలతో ఎవరైనా ఇబ్బందిపడితే క్షమించండి" అని జీవిత (Jeevitha Rajasekhar) క్షమాపణలు తెలిపారు.