కళ్యాణ్ రామ్ (Kalyan Ram) : తాత బాటలోనే మనవడు
స్వర్గీయ నందమూరి తారకరామారావు.. ఎన్నో చారిత్రక పాత్రలకు పెట్టింది పేరు. శ్రీకృష్ణదేవరాయలు, చంద్రగుప్తుడు, అశోకుడు, శ్రీనాథుడు లాంటి పాత్రలలో ఆయన అలవోకగా నటించేశారు. ఛత్రపతి శివాజీ, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, వీరపాండ్య కట్టబొమ్మన లాంటి పాత్రలను కూడా ఓ సినిమా ప్రత్యేకగీతంలో పోషించారు. ఇప్పుడు కళ్యాణ్ రామ్ (Kalyan Ram) ఎంపిక చేసుకున్న "బింబిసార" టైటిల్ చూస్తే, కచ్చితంగా మనకు ఎన్టీఆర్ గతంలో పోషించిన పాత్రలే టక్కున గుర్తుకొస్తాయి.
కనుక కళ్యాణ్ రామ్ పై ఇప్పుడు పెద్ద బాధ్యతే ఉంది. ఈ చారిత్రక పాత్రను ఎంత సమర్థవంతంగా పోషించి, తాతకు తగ్గ మనవడిగా నిలుస్తాడో మనమూ వేచిచూడాలి మరి. ఈ క్రమంలో మనం కూడా ఈ చిత్ర విశేషాలు తెలుసుకుందాం.
ముగ్గురు భామలు
కేథరిన్, సంయుక్త మీనన్, వారీనా హుసేన్ .. వీరు ముగ్గురు ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
వైవిధ్యమైన కథాంశం
టైమ్ ట్రావెల్ అనే కాన్సెప్టుతో ఈ సినిమా తెరకెక్కిందంట. ఇదే క్రమంలో ఈ చిత్రంలో క్రీపూ 5 వ శతాబ్దానికి చెందిన బింబిసారుడిగానూ, అలాగే నేటి తరం యువకుడైన రామ్‌గానూ..ఇలా రెండు విభిన్నమైన పాత్రలలో కళ్యాణ్ రామ్ నటిస్తున్నారు.
ఇంతకీ బింబిసారుడు ఎవరు?
బింబిసారుడు హర్యంక రాజవంశానికి చెందినవాడు.15 సంవత్సరాల వయసులోనే రాజసింహాసనాన్ని అధిష్టించాడు. మగధ సామ్రాజ్యపు ఔన్నత్యానికి పాటుపడ్డాడు. తొలుత క్రూరుడిగా పేరుపొందినా కూడా, తర్వాత జైన, బౌద్ధ మతాల పట్ట ఆకర్షితుడై శాంతిబాట పట్టాడు. ఇలాంటి ఒక పాత్రను కళ్యాణ్ రామ్ పోషించడమంటే సవాలే మరి.
కొత్త దర్శకుడికి అసలు సిసలైన ఛాలెంజ్
వశిష్ట్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకి సారథ్యం వహించనున్నారు. మొదటి సినిమా కాబట్టి, ఆయన కచ్చితంగా ఈ చిత్రం కోసం అహర్నిశలు కష్టపడే ఉంటారు. ఆ కష్టం ఇటీవలే విడుదలైన టీజర్‌లో మనకు కనిపిస్తోంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై చిత్రం విడుదల అవుతుండగా, కీరవాణి నేపథ్య సంగీతాన్ని.. చిరంతన్ భట్, సంతోష్ నారాయణన్ లు ఈ చిత్రానికి బాణీలను సమకూరుస్తున్నారు.