అడివి శేష్ (Adivi Sesh) ‘మేజర్’ సినిమాకు సంగీతం చేసినందుకు గర్వపడుతున్నా: శ్రీచరణ్ పాకాల
కెరీర్ స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే అడివి శేష్ (Adivi Sesh) ‘మేజర్’ వంటి మంచి భావోద్వేగాలు ఉన్న సినిమాకు పనిచేసే అవకాశం వచ్చింది. ఈ సినిమాకు సంగీతం అందించడం గొప్ప అనుభవం అని సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల అన్నాడు. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో అమరుడైన మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మేజర్’ సినిమాకి మ్యూజిక్ అందించడం సంతృప్తినిచ్చిందని చెప్పాడు.
జూన్ 3వ తేదీన మేజర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగుతోపాటు హిందీ, మలయాళ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాకు శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించాడు. త్వరలో సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో శ్రీచరణ్ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఆ ముచ్చట్లు ఆయన మాటల్లోనే..
నా సినీ ప్రయాణంలో తొలి అడుగుల్లోనే బయోపిక్‌కి పనిచేయడం గొప్ప అనుభవం. అది చాలా సంతృప్తినిచ్చింది. సినిమాని నిర్మాణ వ్యయం ఆధారంగా చూడను. సినిమా కథ ఎలా ఉంది? దానికి సరిపోయేలా సంగీతం సమకూర్చగలనా లేదా అనేదే ఆలోచిస్తాను. ‘డీజే టిల్లు’ సినిమా తర్వాత ‘మేజర్’ చిత్రానికి సంగీతం చేయడం నా అదృష్టం. అడివి శేష్, నేను దాదాపు ఇద్దరం ఒకేసారి సినీ ప్రయాణం మొదలుపెట్టాం. మొదటిసారి ‘కిస్’ సినిమా చేశాం. అయితే అది అనుకున్నంత సక్సెస్ కాలేదు. ‘క్షణం’ తర్వాత ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘మేజర్’ సినిమాలతో మా ప్రయాణం కొనసాగుతోంది.
దర్శకుడు శశికిరణ్ కథ చెప్పగానే ఆసక్తిగా అనిపించింది. ‘మేజర్’లో ప్రేమకథ, పాటలు, నేపథ్య సంగీతం అన్నింటికీ ప్రాధాన్యం ఉంది. ఇప్పటికే విడుదలైన పాటలకు శ్రోతల నుంచి మంచి ఆదరణ లభించింది. మేజర్ సినిమాకు సంగీతం అందించినందుకు గర్వపడుతున్నా. డ్రామా, యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలు ఈ సినిమా కథలో ఉన్నాయి. ఇదివరకు థ్రిల్లర్ సినిమాలకి పనిచేశా, కమర్షియల్ సినిమాలూ చేశా. ‘మేజర్’ భావోద్వేగాలు ఉన్న సినిమా. 1990ల నాటి కథ కాబట్టి అప్పటి బ్యాక్‌డ్రాప్‌ను గుర్తుచేసేలా సంగీతం చేయడానికి ప్రయత్నించా.
సాధారణంగా నాకు కూడా 90ల నాటి పాటలు, సంగీతం అంటే ఇష్టం. తెలుగు కంటే అడివి శేష్ (Adivi Sesh) ‘మేజర్’ హిందీ భాషకి బాణీలు చేయడానికి కొంచెం కష్టంగా అనిపించింది. సంగీతపరంగా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంటాను. సంగీతానికి సాహిత్యం ఎంతో ముఖ్యం. పాటకి సరిపడేలా శబ్దం ఉండాలని గట్టిగా నమ్ముతాను. ప్రస్తుతం నరేష్ హీరోగా చేస్తున్న ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమాతోపాటు ‘క్షణం’ దర్శకుడితో ఒక సినిమా, ‘గూఢచారి2’, ‘తెలిసినవాళ్లు’ చిత్రాలు చేస్తున్నా అని చెప్పాడు శ్రీచరణ్ పాకాల.