రాజశేఖర్ (Rajasekhar) ‘శేఖర్’ సినిమాకు అసలు నిర్మాతను నేనేనంటున్న బీరం సుధాకర్‌రెడ్డి
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ (Rajasekhar) హీరోగా జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించిన సినిమా ‘శేఖర్’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి అన్నాడు. జీవితా రాజశేఖర్ ఈ చిత్రానికి కేవలం దర్శకురాలు మాత్రమేనని, అసలు నిర్మాతను తానేనని.. సుధాకర్ రెడ్డి స్పష్టం చేశాడు. అంతకుముందు ఈ సినిమాను నిలిపేయాలంటూ ఫైనాన్షియర్ ఎ. పరంధామరెడ్డి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేసినట్టు వార్తలు వచ్చాయి.
‘జీవితా రాజశేఖర్ 48 గంటల్లోగా రూ.65 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్‌గా తనకు ఇవ్వాలి. అలా చేయని పక్షంలో ‘శేఖర్’ సినిమాకు సంబంధించిన నెగెటివ్ రైట్స్‌ను అటాచ్ చేస్తూ డిజిటల్, శాటిలైట్, ఓటీటీ, యూట్యూబ్ వంటి మాధ్యమాలతోపాటు సినిమా ట్రైలర్‌ను కూడా ఎక్కడా ప్రసారం చేయకూడదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అటాచ్‌మెంట్ అమలులోకి వస్తే ఆదివారం సాయంత్రం తర్వాత ‘శేఖర్’ సినిమాను ఏ ప్లాట్‌ఫామ్‌లో ప్రదర్శించినా కోర్టు ధిక్కరణే అవుతుంది’ అని ఫైనాన్షియర్ ఎ.పరంధామరెడ్డి హెచ్చరించారు. దీనికి సంబంధించిన కోర్టు కాపీని జతచేశారు.
అయితే ఫైనాన్షియర్ పరంధామరెడ్డి వాదనను నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి తోసిపుచ్చారు. ‘నేను ‘శేఖర్’ చిత్రానికి నిర్మాతను. జీవితా రాజశేఖర్‌గారు మా సినిమాకు దర్శకత్వం మాత్రమే చేశారు. రాజశేఖర్ హీరోగా నటించాడు. వాళ్లిద్దరికీ ఇవ్వాల్సిన రెమ్యునరేషన్లు పూర్తిగా ఇచ్చేశాను. ఈ సినిమా రాజశేఖర్ (Rajasekhar), జీవితకు చెందినదిగా అనుకుని ఎవరో కోర్టుకు వెళ్లారు. నా సినిమాకు వాళ్లు గనుక నష్టం కలిగిస్తే.. సదరు వ్యక్తులపై నేను పరువు నష్టం దావా వేస్తా. నేను నష్టపోయిన మొత్తాన్ని వాళ్ల నుంచి వసూలు చేస్తాను. నా సినిమాను ఎవరికీ అమ్మకూడదని ఏదో చెబుతున్నారు. అది చెల్లదు. ఎందుకంటే... శేఖర్ సినిమాకు అసలు నిర్మాతను నేనే’’ అని సుధాకర్‌రెడ్డి చెప్పాడు.