మే 18న పెళ్లి చేసుకోబోతున్న హీరో ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) – హీరోయిన్ నిక్కీ గల్రానీ
ప్రముఖ దర్శకుడు, రచయిత రవిరాజా పినిశెట్టి కొడుకుగా వెండితెరకు పరిచయమైన హీరో ఆది పినిశెట్టి (Aadhi Pinisetty). భిన్నకథా చిత్రాలతో తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో తనకంటూ ఓ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నాడు ఆది. ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు స్టైలిష్ విలన్ గా దూసుకుపోతున్న ఆదికి మార్చిలో నిక్కీ గల్రానీతో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ఏంటంటే ఈ జంట ఈ నెల 18న పెళ్లి బంధంతో ఒకటవ్వనున్నారు. ఈ పెళ్లికి చెన్నైలోని ఓ స్టార్ హోటల్ వేదిక కానుందని తెలుస్తోంది. ఈ పెళ్లి ఆది కుటుంబ సంప్రదాయం ప్రకారం జరగనుందని, ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులు దగ్గరి బంధువులు మరియు అత్యంత సన్నితులు మాత్రమే హాజరు కానున్నారని తెలుస్తోంది.
`యాగవరైనమ్ నా కక్కా(తెలుగులో మలుపు)`అనే తమిళ సినిమాతో తొలిసారి ఆది పినిశెట్టి నిక్కీ గల్రానీ కలిసి నటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ఇప్పుడీ జంట నిశ్చితార్థం చేసుకుని పెళ్లి వరకు వచ్చారు. కాగా సినిమాల విషయానికి వస్తే.. ఆది పినిశెట్టి ఇటీవల `గుడ్ లక్ సఖీ` `క్లాప్` చిత్రాలతో ప్రేక్షకులను పలకరించాడు. వీటిలో గుడ్ లక్ సఖీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినా క్లాప్ ప్రేక్షకులను బాగానే అలరించింది.
ప్రస్తుతం ఆది పినిశెట్టి `ది వారియర్` మూవీలో విలన్ గా అలరించబోతున్నాడు. ఎన్.లింగుస్వామి దర్వకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కృతి శెట్టి జంటగా నటిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ మూవీ జూలై 14న తెలుగు తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు ఆది పినిశెట్టి హీరోగానూ పలు సినిమాలు చేస్తున్నాడు.
నిక్కీ గల్రానీ 2014 లో విడుదలైన "1983" అనే మళయాళ చిత్రం ద్వారా నటిగా పరిచయం అయ్యారు.తరువాత ఒం శాంతి ఒశానా అనే మలయాళ చిత్రంలో నటించారు. "అజిత్","జంబొ సవారి" అనే కన్నడ చిత్రాలలో నటించారు. ప్రేమకథా చిత్రమ్ తమిళ రీమేక్ "డార్లింగ్" సినిమాతో తమిళ చిత్రసీమలో అడుగుపెట్టారు. సునీల్ సరసన కృష్ణాష్టమి ద్వారా తెలుగు ఇండస్ట్రీకి నిక్కీ పరిచయం అయ్యారు. ఆది పినిశెట్టి.. అటు తమిళ్ సినిమాలు చేస్తూ.. ఇటు తెలుగులో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. రంగస్థలంలో రాంచరణ్‌కు బ్రదర్‌గా, సరైనోడులో బన్నీకి విలన్‌గా నటించి అందర్నీ ఆకట్టుకున్నాడు ఆది పినిశెట్టి (Aadhi Pinisetty). మలుపు, వైశాలి వంటి సినిమాల్లో ఆది నటన విమర్శకులను సైతం మెప్పించింది.