సైడ్ క్యారెక్టర్ నుండి పాన్ ఇండియా స్టార్ వరకు.. హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) జర్నీ
2012లో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో చిన్న పాత్ర పోషించిన విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) నేడు పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగి కష్టపడితే తప్పకుండా ఫలితం దక్కుతుందని చెప్పడానికి ఒక ఉదాహరణగా నిలిచాడు. ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా పరిశ్రమలో అడుగుపెట్టి హీరోలుగా ఎదిగిన చిరంజీవి, రవితేజ, నాని వంటివారి సరసన చేరాడు విజయ్. ఇప్పుడు విజయ్‌కి టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్‌లోనూ చాలా క్రేజ్ ఉంది. చాలామంది బాలీవుడ్ భామలు విజయ్ దేవరకొండనే తమ ఫేవరెట్ హీరో అంటూ ఒక్కసారి తనతో నటించాలని ఉందంటూ చెబుతున్నారంటే విజయ్ క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్న ఈ రౌడీ హీరో పుట్టినరోజు నేడు. విజయ్ దేవరకొండకి పింక్ విల్లా తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక కథనం..
మే 9, 1989న హైదరాబాద్‌లో జన్మించిన విజయ్ చిన్నప్పటినుండే నటుడవ్వాలని కలలు కన్నాడు. డిగ్రీ పూర్తవగానే తన ఆలోచనను తండ్రితో చెప్పాడు విజయ్. నిజానికి ఆయన ఒకప్పుడు హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చి అవకాశాలు దొరకక దూరదర్శన్‌లో సీరియల్స్‌కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. దాంతో తన కోరిక కొడుకు ద్వారా తీరబోతుందని సంతోషపడిన ఆయన విజయ్‌ని యాక్టింగ్ స్కూల్లో చేర్చాడు. అక్కడ శిక్షణలో ఉండగానే చాలా సినిమాల ఆడిషన్స్‌కి వెళ్లాడు విజయ్. మొదటగా రవిబాబు నువ్విలా సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించినా అది ఏమాత్రం విజయ్ కెరీర్‌కి హెల్ప్ అవలేదు.
కూల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో ఓ చిన్న క్యారెక్టర్లో కనిపించాడు విజయ్. అది కూడా అంతగా గుర్తింపు ఇవ్వకపోయినా తరువాతి సినిమాలు రావడానికి మార్గం తేలికైంది. ఎవడే సుబ్రమణ్యం సినిమాలో నానితో సమానమైన పాత్ర పోషించిన విజయ్ తన నటనతో దర్శకనిర్మాతలను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత విజయ్‌కి పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ హిట్లు పడ్డాయి. దాంతో టాలీవుడ్లో క్రేజీ హీరోగా ఎదిగాడు.
నిజానికి పలువురు స్టార్ హీరోలు అర్జున్ రెడ్డి కథను రిజక్ట్ చేశారు. ఈ క్రమంలో వైజయంతి సంస్థ నిర్వాహకులైన స్వప్న దత్, విజయ్ గురించి చెప్పిందట. అలా ఎంతో మంది స్టార్ హీరోల దగ్గరకు వెళ్ళిన కథ చివరికి విజయ్ దగ్గరకు వచ్చి చేరింది. కరెక్టుగా యూస్ చేసుకునే దర్శకుడు ఉంటే హీరో ఎలాంటి అవుట్ పుట్ ఇవ్వగలడో అర్జున్ రెడ్డి సినిమా నిరూపించింది. 2017 ఆగస్టు 25న విడుదలైన ఈ చిత్రం సంచలనం సృష్టించింది. విజయ్ నటన, ఆటీట్యూడ్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. కల్ట్ క్లాసిక్ మోడ్రన్ దేవదాసు అంటూ సినిమాకు ట్యాగ్ ఇచ్చేశారు. ఈ చిత్రంతో విజయ్ రేంజ్ అమాంతం పెరిగింది. అప్పటివరకు పలువరు స్టార్లకు కూడా రాని ఫిలింఫేర్ అవార్డు విజయ్‌కు ఈ చిత్రంతో వచ్చింది.
అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ మీద ప్రేక్షకులలో విపరీతమైన అభిమానం పెరిగింది. యూత్‌లో ఒక రేంజ్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ సక్సెస్‌తో తన తరువాతి సినిమాలపై ప్రేక్షకులలో భారీ ఎక్సపెక్టేషన్స్ ఏర్పడ్డాయి. అయితే విజయ్ అర్జున్ రెడ్డి తర్వాత ఎలాంటి సినిమాతో వస్తాడో అని ప్రేక్షకులలో ఆసక్తిని ఏర్పడింది. మరో అగ్రెసీవ్ క్యారెక్టర్‌తో వస్తాడా లేదా మాస్ సినిమాతో వస్తాడా అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ విజయ్ గీతా గోవిందంతో అందిరిని సర్‌ప్రైజ్ చేశాడు. అర్జున్‌రెడ్డి లాంటి వైలెంట్ చిత్రం తర్వాత గీతా గోవిందం లాంటి సాఫ్ట్ సినిమా రావడం విజయ్ నుంచి అస్సలు ఎవరూ ఊహించలేరు. ఈ చిత్రంలో విజయ్ నటనకు గొప్ప ప్రశంసలు దక్కాయి. తన స్క్రిప్ట్ సెలక్షకు స్టార్ హీరోల సౌతం మెచ్చుకున్నారు. అర్జున్ లాంటి అగ్రెసీవ్ క్యారెక్టర్ తర్వాత విజయ్ గోవింద్ లాంటి సాఫ్ట్ క్యారెక్టర్ చేయడం ప్రేక్షకులకు తెగ నచ్చింది. ఈ చిత్రం విజయ్ కెరీర్‌ను ఏకంగా 10 మెట్లు ఎక్కించింది. ఈ చిత్రంతో విజయ్ 100కోట్ల క్లబ్లో అడుగుపెట్టి స్టార్ హీరోలను సైతం ఆశ్యర్యపరిచాడు.
గీతగోవిందం తర్వాత వచ్చిన టాక్సీవాలా చాలా ఫైరసీ గొడవలను ఎదుర్కున్నా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ సినిమాలు కాస్త నిరాశపర్చినా యువతరంలో విజయ్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. దానికి నిదర్శనమే లైగర్. మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రూపొందిస్తున్న ఈ సినిమా నుంచి ఏ అప్డేట్ వచ్చినా గంటల వ్యవధిలో మిలియన్ల వ్యూస్ సాధిస్తూ విజయ్ క్రేజ్ ఏంటో తెలియజేస్తోంది.
పూరి జగన్నాధ్ సినిమాలలో హీరోలకు ఆటీట్యూడ్, స్వాగ్, ఆత్మవిశ్వాసం దండిగా ఉంటుంది. అలాంటిది విజయ్‌కు ముందునుండే అవన్ని ఉన్నాయి. అలాంటిది పూరి, విజయ్‌ను ఏ రేంజ్‌లో చూపిస్తాడో అని విజయ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, మేకింగ్ గ్లింప్స్ వంటివి విజయ్‌లో మరో కోణాన్ని తెలియజేస్తున్నాయి. ఈ చిత్రం విజయ్‌కు మొదటి పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25న విడుదల కానుంది. విజయ్ కెరీర్‌ను మార్చిన అర్జున్ రెడ్డి కూడా అదే తేదీన విడుదలైంది. లైగర్ కూడా అదే రోజున విడుదలవుతుండటంతో ఈ సారి కూడా బ్లాక్ బస్టర్ కన్ఫార్మ్ అవుతుందని ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు.
ప్రస్తుతం విజయ్, శివ నిర్వాణ దర్శకత్వంలో లవ్‌స్టోరిని చేస్తున్నాడు. కాశ్మీర్ ప్రాంతంలో సాగే లవ్‌స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కింది. మణిరత్నం రోజా తరహాలో ఈ చిత్రం ఉండనున్నట్లు తెలుస్తుంది. సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం కాశ్మీర్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రం తర్వాత విజయ్ పూరితో మరోసారి జనగణమన సినిమాను చేయనున్నాడు. ఈ చిత్రంలో ఆర్మీ అధికారిగా నటించనున్నాడు. సామాన్యుడి స్థాయినుంచి స్టార్ హీరోగా ఎదిగిన రౌడీ బాయ్ విజయ్ (Vijay Devarakonda)కి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు.