తాత పేరే సినిమా టైటిల్.. నాగచైతన్య (Naga Chaitanya) – పరశురాం సినిమా టైటిల్‌ ‘నాగేశ్వరరావు’?

Updated on May 25, 2022 07:56 PM IST
అక్కినేని నాగేశ్వరరావు, నాగచైతన్య, పరశురాం
అక్కినేని నాగేశ్వరరావు, నాగచైతన్య, పరశురాం

సమంతతో విడాకుల తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంటున్నాడు అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya). ప్రస్తుతం తెలుగులో థ్యాంక్యూ సినిమాతోపాటు హిందీలో లాల్‌ చద్దా సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం ఆ రెండు సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. ఈ రెండు సినిమాల షూటింగ్‌లు పూర్తి కావడంతో తర్వాత చేయబోయే సినిమాలపై ఫోకస్ పెట్టాడు చై.

తాజాగా సూపర్‌‌స్టార్ మహేష్‌బాబుతో ‘సర్కారు వారి పాట’ సినిమాతో సూపర్‌‌ డూపర్‌‌ హిట్‌ అందుకున్న డైరెక్టర్ పరశురాం. ప్రస్తుతం ఆ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు ఈ క్రేజీ డైరెక్టర్. తన తర్వాత సినిమాను నాగచైతన్యతో చేయబోతున్నాడు. పరశురాంతో సినిమా చేయడానికి నాగచైతన్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమాకు నాగచైతన్య తాత పేరైన.. ‘నాగేశ్వరరావు’ పేరును టైటిల్‌గా అనుకుంటున్నట్టు తెలుస్తోంది. దాదాపు అదే టైటిల్‌ను ఖరారు చేశారని సమాచారం.

లవ్‌స్టోరీ, బంగార్రాజు సినిమాల విజయాలతో జోరు మీదున్న నాగచైతన్య.. ప్రస్తుతం విక్రమ్‌ కుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న థ్యాంక్యూ సినిమాలో నటిస్తున్నాడు. రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. రష్యాలో షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌తోపాటు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగింది. ఈ సినిమాలో సూపర్‌‌స్టార్ మహేష్‌బాబుకు డై హార్డ్‌ ఫ్యాన్‌గా, హాకీ ప్లేయర్‌‌గా కనిపించనున్నాడు చైతన్య.  హ్యూమర్‌‌, డ్రామా, రొమాంటిక్‌ ఎంటర్‌‌టైనర్‌‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కొద్దిపాటి యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నట్టు సమాచారం.

దిల్‌ రాజుకు చెందిన శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌‌పై తెరకెక్కుతున్న నాగచైతన్య (Naga Chaitanya ) థ్యాంక్యూ సినిమా జూలైలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సాధారణ కుటుంబంలో పుట్టిన యువకుడు ప్రపంచ స్థాయిలో బిజినెస్‌ చేసే స్థాయికి ఎలా ఎదిగాడు.  దానికి సహకరించిన వాళ్లకు థ్యాంక్స్‌ చెప్పడం కోసం ఏం చేశాడు అనేది సినిమా కథ. ఈ సినిమాలోని కీలక పాత్రల్లో అవికా గోర్, మాళవికా నాయర్, సుశాంత్‌ రెడ్డి, జబర్దస్త్ సుధీర్‌‌ కనిపించనున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!