‘లైగర్’ (Liger) సినిమా పెట్టుబడుల విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దర్యాప్తు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఓ రాజకీయ నేత ప్రమేయం కూడా ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది. ఆ నాయకుడికి ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధం ఉందని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ‘లైగర్’ చిత్రంలో భాగస్వాములైన వారందరినీ ఈడీ అధికారులు విచారిస్తున్నారు.
‘లైగర్’ దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మీని గతంలో విచారించిన ఈడీ.. తాజాగా ఈ చిత్రంలో హీరోగా నటించిన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)ను ఇన్వెస్టిగేట్ చేసింది. బుధవారం విచారణకు హాజరైన విజయ్‌ను.. దాదాపు 11 గంటలపాటు ఈడీ అధికారులు పలు కోణాల్లో ప్రశ్నలు సంధించారని సమాచారం.
ఈడీ విచారణ అనంతరం ఈ విషయంపై విజయ్ స్పందించారు. ‘మనకొచ్చే పాపులారిటీ వల్ల కూడా కొన్ని సమస్యలు వస్తాయి. వాటిల్లో ఇదొకటి. మీరు చూపించే అభిమానం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. జీవితంలో ఇదొక అనుభవం. ఈడీ అధికారులకు పూర్తిగా సహకరించా. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చా. నన్ను మళ్లీ రమ్మని చెప్పలేదు’ అని విజయ్ తెలిపారు.
ఇకపోతే, విజయ్ దేవరకొండతో ‘జనగణమన’ పేరుతో కొత్త చిత్రాన్ని ప్రకటించిన పూరి జగన్నాథ్.. ‘లైగర్’ నిర్మాణ సమయంలోనే ఈ మూవీ కోసం కొన్ని సన్నివేశాలు షూట్ చేశారు. ఇందుకు సుమారు రూ.20 కోట్ల దాకా ఖర్చయినట్లు సమాచారం. ఈ మొత్తాన్ని సమకూర్చింది ఎవరనేది ఇంకా బయటపడాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా, ‘లైగర్’ హిందీ వెర్షన్‌కు కరణ్ జోహర్ కూడా నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం.
ఇక, విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘ఖుషి’ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఆయన సరసన టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) యాక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ మూవీ రిలీజ్ అవుతుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయ్ తెలిపారు.
Follow Us