Chandini Chowdary: వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లతో అదరగొడుతున్న 'సమ్మతమే' బ్యూటీ చాందినీ చౌదరి..!
టాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్లుగా తెలుగమ్మాయిలు కనిపించడం చాలా అరుదు. అలాంటిది ఓ తెలుగు పిల్ల వెండి తెరపై అందాలు ఆరబోస్తోంది. ఆ బ్యూటీనే.. చాందినీ చౌదరి (Chandini Chowdary). షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ, ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోయిన్ గా మారింది ఈ అమ్మడు. 'కలర్ ఫోటో' సినిమాతో మంచి హిట్ ను అందుకుంది ఈ అమ్మడు. ఇప్పుడు 'సమ్మతమే' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో చాందిని చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ నిర్మించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నేడు (జూన్ 24) ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసింది.
చాందినీ చౌదరి.. ఏపీలోని విశాఖపట్నంలో 1993 అక్టోబర్ 23న జన్మించింది. బెంగళూర్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చదివింది. ఈ సమయంలోనే ప్రేమ.. ప్రేమ, ట్రూ లవ్, సాంబర్ ఇడ్లీ, రోమియో, అప్రోచ్ తదితర షార్ట్ ఫిలింలలో నటించింది. హీరో రాజ్ తరుణ్‌తో కలిసి 'ది బ్లైండ్ డేట్' (The Blind Date) షార్ట్ ఫిల్మ్ చేసింది. అది చాందినీకి మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది.
'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్', 'ప్రేమ ఇష్క్ కాదల్' చిత్రాల్లోనూ చాందినీ మెరిసింది. 2015లో వచ్చిన 'కేటుగాడు' చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అనంతరం కుందనపు బొమ్మ, శమంతకమణి, హౌరా బ్రిడ్జ్, బొంబాట్ చిత్రాల్లో నటించింది. ఇక, 'మను' చిత్రంలో చాందినీ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత ‘కలర్ ఫొటో’ (Color Photo Movie) చిత్రంతో క్రేజ్ దక్కింది. ఆ చిత్రంలో నటనకు మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమాలో నటించినందుకు ఈ బ్యూటీకి అల్లు అర్జున్ ఫోన్ చేసి కంగ్రాట్స్ కూడా చెప్పాడట.
మరోవైపు.. చాందినీ చౌదరి సినిమాలతో పాటు వెబ్ సిరీసుల్లోనూ నటిస్తోంది. గాడ్స్ ఆఫ్ ధర్మపురి, మస్తీస్, అన్‌హియర్డ్, గాలివానల్లో నటించింది. ఈ బ్యూటీ త్రో బాల్ చాంపియన్ కూడా. కథలు కూడా రాసేది. నటిగా రాణిస్తూనే.. మరోవైపు దర్శకత్వం చేయాలని చూస్తోంది. తనకు ఇష్టమైన దర్శకుడు మణిరత్నం (Director Maniratnam) అని, ఆయన సినిమాలో నటించాలని ఉన్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.