60 ఏళ్లలో సాధించలేని కీర్తిని.. పునీత్ (Puneeth Rajkumar) 21 ఏళ్లలోనే సాధించారు: రజినీకాంత్ (Rajinikanth)

అభిమానులు ముద్దుగా ‘అప్పూ’ అని పిలిచే పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar) దేవమానవుడని రజినీకాంత్ (Rajinikanth) అన్నారు

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar)కు ‘కర్ణాటక రత్న’ పురస్కార ప్రదానోత్సవంలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) పాల్గొన్నారు. ఈ సందర్భంగా పునీత్ గురించి రజినీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పురాణాల్లో మార్కండేయ, భక్తప్రహ్లాద ఎలాగో కలియుగంలో పునీత్ రాజ్‌కుమార్ అలా అని తలైవా అన్నారు. ఓ నటుడు 60 ఏళ్లలో సాధించే కీర్తిని పునీత్ కేవలం 21 ఏళ్లలోనే సాధించారని చెప్పారు. అభిమానులు ముద్దుగా ‘అప్పూ’ అని పిలిచే పునీత్ దేవమానవుడని రజినీకాంత్ పేర్కొన్నారు. 

‘పిన్న వయసులోనే గొప్ప సాధన చేసిన పునీత్‌ రాజ్‌కుమార్ ‘కర్ణాటక రత్న’ పురస్కారానికి పూర్తి అర్హులు. పునీత్‌ నాలుగేళ్ల వయసులో శబరిమలై వచ్చారు. తొలిసారి ఆయనను అక్కడే చూశా. శబరిమలై యాత్రకు 48 కిలోమీటర్లు కాలినడకన.. రాజ్‌కుమార్‌ తన భుజాలపై పునీత్‌ను తీసుకొచ్చారు. 'స్వామియే శరణమయ్యప్ప' అంటూ పునీత్‌ భక్తుల వెంట వెళ్లేవారు’ అని రజినీకాంత్ చెప్పుకొచ్చారు. 

అందుకే లక్షలాది మంది తరలివచ్చారు

‘తక్కువ వయసులోనే పునీత్ ఎంతో సాధించారు. ప్రజలకు ఆయన చాలా సేవ చేశారు. 21 ఏళ్లకే 35 సినిమాలు, ఎందరికో గుప్తదానాలు చేసిన పునీత్‌.. తమిళంలో ఎంజీఆర్‌, శివాజీ గణేశన్‌, తెలుగులో సీనియర్ ఎన్టీఆర్‌, కర్ణాటకలో డా. రాజ్‌కుమార్‌ల సాధనకు సాటివచ్చే వ్యక్తి’ అని రజినీకాంత్‌ మెచ్చుకున్నారు. పునీత్‌ మరణించిన సమయంలో తాను ఐసీయూలో ఉన్నానని ఆయన చెప్పారు. మూడ్రోజుల తర్వాత పునీత్‌ మరణ వార్త విని షాక్‌ అయ్యానని అన్నారు. పునీత్‌ గొప్ప మనసుకు చలించే ఆయన అంతిమ సంస్కారాలకు లక్షలాది సంఖ్యలో అభిమానులు, సామాన్య ప్రజలు తరలివచ్చారని రజినీకాంత్‌ వివరించారు.

ఆ నవ్వులోని స్వచ్ఛతను మరెక్కడా చూడలేదు: ఎన్టీఆర్

‘కర్ణాటక రత్న’ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో రజినీకాంత్‌తోపాటు జూనియర్ ఎన్టీఆర్‌ (Junior NTR) కూడా అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పునీత్‌ రాజ్‌కుమార్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. ‘పునీత్‌ నవ్వులో ఉన్న స్వచ్ఛతను మరెక్కడా చూడలేదు. అహంకారాన్ని పక్కనపెట్టి, యుద్ధం చేయకుండానే రాజ్యాన్ని జయించిన వ్యక్తి పునీత్‌ రాజ్‌కుమార్‌. గొప్ప వ్యక్తిత్వాన్ని స్వయంగా సాధించారు. పునీత్‌ సూపర్‌ స్టార్‌గా, గాయకుడిగా, మంచి భర్తగా, తండ్రిగా, స్నేహితుడిగా తనదైన ముద్రవేశారు. పునీత్‌కు ‘కర్నాటక రత్న’ ప్రదానం చేయడంతో ఈ పురస్కారానికి ఓ సార్థకత చేకూరింది. ఈ కార్యక్రమానికి నటుడిగా సాధించిన అర్హతతో కాకుండా పునీత్‌కు మంచి మిత్రుడిగానే వచ్చా. నన్ను పొరుగు రాష్ట్రానికి చెందిన యాక్టర్‌గా కాకుండా తమలో ఒకడిగా భావించే రాజ్‌కుమార్‌ కుటుంబ సభ్యులకు నా ధన్యవాదాలు’ అని తారక్ చెప్పుకొచ్చారు.

Read more: EXCLUSIVE : ఓపిక, తెగువ ఉంటేనే ఇండస్ట్రీలో రాణించగలం

You May Also Like These