‘అశోక వనంలో అర్జున కల్యాణం’ సినిమా ఓటీటీ తేదీ ఖరారు కాలేదన్నహీరో విశ్వక్‌సేన్ (Vishwaksen)
యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwaksen) నటించిన తాజా చిత్రం ‘అశోక వనంలో అర్జున కల్యాణం’. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను యస్వీసీసీ డిజిటల్ బ్యానర్ పై బాపినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మించారు. తన ఇదివరకటి సినిమాలతో మాస్ కా దాస్ అనిపించుకున్న విశ్వక్ సేన్ (Vishwaksen) తొలిసారిగా నటించిన కుటుంబ కథాచిత్రంగా మంచి పేరు తెచ్చుకుంటోంది ఈ సినిమా. ముప్పై ఏళ్ళొచ్చినా ఇంకా పెళ్ళికాని అల్లం అర్జున్ కుమార్‌కు ఒక అందమైన అమ్మాయితో పెళ్ళి కుదురుతుంది. అయితే లాక్ డౌన్ కారణంగా మగపెళ్ళివారు ఆడపెళ్ళివారింట్లో ఉండిపోవాల్సి వస్తుంది. అప్పుడు జరిగే అనూహ్య సంఘటనల సమాహారమే ఈ సినిమా. అయితే, ఈ సినిమా త్వరలోనే ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానున్నట్టు వస్తున్న వార్తలపై విశ్వక్ స్పందించాడు. ఇంకా ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఖరారు కాలేదని, దయచేసి ఆ వార్తలు అన్నింటినీ ఆపాలని కోరాడు.
కెరీర్ ఆరంభం నుంచి మాస్ కథా చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించి పేరు తెచ్చుకున్నారు నటుడు విశ్వక్ సేన్. మొదటిసారి ఆయన నటించిన క్లాస్ ఓరియెంటెడ్ చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. విద్యాసాగర్ చింతా దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్‌ని సొంతం చేసుకుంది. 33 ఏళ్ల వ్యక్తి పెళ్లి కోసం పడే పాట్లను చూపించిన ఈ కుటుంబకథా చిత్రంలో విశ్వక్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇదిలా ఉండగా, ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి తాజాగా పలు చోట్ల వార్తలు దర్శనమిస్తున్నాయి. ఓ ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఈ సినిమా త్వరలోనే ప్రసారం కానుందంటూ తేదీతో సహా.. నెట్టింట పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి.
తమ చిత్రానికి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఆయన ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోని రిలీజ్ చేశారు. ‘‘మా చిత్రాన్ని చాలా పెద్ద హిట్ చేసినందుకు, ఇకపై మరిన్ని మంచి చిత్రాలు తీసేలా మాకు ధైర్యాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. మా సినిమా ఓటీటీ రిలీజ్ గురించి సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ కానుందో డేట్‌తో సహా చెప్పేస్తున్నారు. నిజం చెప్పాలంటే, మేమే ఇంకా ఓటీటీ రిలీజ్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నాక్కూడా ఓటీటీ రిలీజ్ డేట్ తెలియదు. మేము ఫిక్స్ అయిన వెంటనే అధికారికంగా ప్రకటిస్తాం. ప్రస్తుతానికి సినిమా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. కాబట్టి సోషల్‌మీడియాలో ఓటీటీ రిలీజ్‌పై పోస్టులు పెట్టే వాళ్లందరికీ నేను చెప్పేది ఒక్కటే.. థియేటర్‌లో సినిమా చూస్తే వచ్చే అనుభవం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. దాన్ని మిస్ కాకండి. మీరు ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేస్తే థియేటర్‌లో సినిమా చూడాలనుకునేవారు కూడా ఓటీటీ రిలీజ్‌ని దృష్టిలో ఉంచుకుని కొన్నిసార్లు సినిమాహాళ్లకు రారు. కాబట్టి, మీరు పెట్టిన పోస్టుల్ని దయచేసి డిలీట్ చేసేయండి. రూమర్స్ వ్యాప్తి చేయకండి’’ అని విశ్వక్ వివరించారు.
కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ‘అశోక వనంలో అర్జున కల్యాణం’ సినిమా కథేంటంటే.. ముప్పై ఏళ్ళొచ్చినా ఇంకా పెళ్ళికాని అల్లం అర్జున్ కుమార్‌కు ఒక అందమైన అమ్మాయితో పెళ్ళి కుదురుతుంది. అయితే లాక్ డౌన్ కారణంగా మగపెళ్ళివారు ఆడపెళ్ళివారింట్లో ఉండిపోవాల్సి వస్తుంది. అప్పుడు జరిగే అనూహ్య సంఘటనల సమాహారమే ఈ సినిమా. చక్కటి కామెడీ, ఎంచక్కటి ఎమోషన్స్ ఈ సినిమా విజయానికి మూలస్థంభాలుగా నిలిచాయి. అయితే ఈ సినిమాను ‘ఆహా’ ఓటీటీలో జూన్ మొదటి వారంలో స్ట్రీమింగ్ కానుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
మే 6న విడుదలైన ఈ సినిమాకి మొదటి రోజు వసూళ్ళు చెప్పుకోదగ్గ స్థాయిలోనే నమోదయ్యాయి. విడుదలకు ముందు ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో జరిగిన రచ్చ, హీరో విశ్వక్ సేన్ (Vishwaksen) వినూత్న రీతిలో చేపట్టిన ప్రచారాలు సినిమా విజయానికి ప్రధాన కారణమయ్యాయి. దానికి తగ్గట్టుగానే కంటెంట్ కూడా బాగుండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా చూడడానికి మంచి ఆసక్తి చూపిస్తున్నారు. రుక్సార్ థిల్లాన్ కథానాయికగా నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రంలో ఇంకా గోపరాజు రమణ, రితికా నాయక్, కేదార్, వెన్నెల కిషోర్, కాదంబరి కిరణ్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. జయక్రిష్ సంగీతం అందించగా.. పవి కె పవన్ ఛాయగ్రహణం నిర్వహించారు. కథ స్ర్కీన్ ప్లే మాటల్ని రవికిరణ్ కోలా అందించారు.