నేను ప్రొఫెషనల్ నటుడ్ని.. నాకు కమిట్‌మెంట్ లేదంటే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతా: విశ్వక్ సేన్ (Vishwak Sen)

దర్శక నటుడు అర్జున్ (Arjun Sarja)తో తలెత్తిన విభేదాలపై యువ కథానాయకుడు విశ్వక్ సేన్ (Vishwak Sen) స్పందించారు

యాక్టర్ అయ్యేందుకు ఎన్నో సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగానని యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) అన్నారు. తాను ఈ  స్థాయికి రావడానికి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని ఆయన చెప్పారు. ఒక సినిమా విషయంలో దర్శక నటుడు అర్జున్ (Arjun Sarja), విశ్వక్‌కు మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ విషయంపై విశ్వక్ స్పందించారు. తనంతటి ప్రొఫెషనల్ నటుడు లేరని.. అలాంటి తనకు కమిట్‌మెంట్ లేదని ఒక్క లైట్ బాయ్ చెప్పినా చిత్ర పరిశ్రమ నుంచి వెళ్లిపోతానన్నారు. ‘రాజయోగం’ చిత్రం టీజర్ విడుదలకు హాజరైన విశ్వక్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘నటుణ్ని అయ్యేందుకు ఎన్నో సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగా. చాలా అవమానాలు ఎదుర్కొన్నా. ‘ఇప్పుడు వీడు బాగానే ఉన్నాడు కదా’ అనుకుంటూ వాటి గురించి ఎవరూ మాట్లాడరు. కానీ, యాక్టర్స్‌గా మేం మాత్రం వాటినే ఎక్కువగా గుర్తు పెట్టుకుంటాం. ఎందుకంటే మరోసారి అలాంటి పరిస్థితి రాకూడదని. ఏదో ఛాన్స్ వచ్చేసింది కదా అని నేను సినిమాలు చేయను. సినిమాలను ఇష్టంతో, ప్రేమతో చేస్తుంటా. మూవీకి సంబంధించిన అన్ని పనులను దగ్గరుండి చూసుకుంటా. అది పూర్తయిన తర్వాత ప్రమోషన్స్‌ను కూడా నా భుజాలపై వేసుకుని రోడ్లపై తిరుగుతుంటా. నా అంత కమిటెడ్‌, ప్రొఫెషనల్‌ నటుడు ఉండడు’ అని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చారు. 

‘ఈ ఏడాది నేను మూడు సినిమాలు పూర్తి చేశా. వాటిల్లోని ఒకదానికి నేనే దర్శకుడ్ని, నిర్మాతను, హీరోను. నా వల్ల ఇప్పటివరకూ ఏ నిర్మాత కూడా బాధపడలేదు, ఒక్క రూపాయి నష్టపోలేదు. నేను చేసినవి చిన్న చిత్రాలే అయ్యుండొచ్చు. కానీ వాటిని పెద్ద నిర్మాతలు నిర్మించారు. నా సినిమాల సెట్స్‌లోని ఒక్క లైట్‌బాయ్‌ అయినా.. నన్ను కమిటెడ్‌, ప్రొఫెషనల్‌ యాక్టర్‌ కాదంటే ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతా. కొత్త దర్శకుడైనా, అనుభవం ఉన్న దర్శకుడితో అయినా ‘గివ్‌ అండ్‌ టేక్‌’ పద్ధతిలో పనిచేశా. అన్ని సినిమాల్లానే అర్జున్‌గారి చిత్రాన్నీ అదే అనుకుని ప్రారంభించా. షూటింగ్ మొదలయ్యే వారం ముందు నాకు ఈ సినిమా స్క్రిప్టు అందింది’ అని విశ్వక్ పేర్కొన్నారు.  

‘నేను ఆఫీస్‌ బాయ్‌ ఇన్‌పుట్‌ కూడా వింటానని అర్జున్‌ సర్‌ అన్నారు. ‘నేను ఫలానా మార్పు చేస్తే బాగుంటుంది సర్‌’ అని చెబితే మాత్రం నువ్వు వదిలెయ్‌, నన్ను నమ్ము అంటూ ఏం చెప్పనిచ్చేవారు కాదు. నన్ను కట్టిపడేశారు. కళ్లుమూసుకుని కాపురం చేసెయ్‌ అన్నట్టుంది వ్యవహారం. అయినా ఏదో విధంగా ముందుకెళ్లాలనుకుని, లుక్‌ టెస్ట్‌లో పాల్గొని ఆయనకు ఫొటోలు పంపించా. మరుసటి రోజు లేచి, షూట్‌కు బయలుదేరేముందు ఎందుకో భయమేసింది. నాకు ఏ సినిమాకీ ఇలా అనిపించలేదు. అందుకే ‘సర్‌.. ఈ ఒక్కరోజు షూటింగ్‌ రద్దు చేస్తే.. కొన్ని విషయాలు చర్చించుకుందాం’ అని మెసేజ్ చేశా. నేనూ మా మేనేజరు ఎన్నిసార్లు అడిగినా ఆయన నుంచి సమాధానం లేదు. అదేరోజు మధ్యాహ్నం వాళ్ల మేనేజరు నుంచి.. ‘ఇంకేంటి మాట్లాడేది’ అంటూ అకౌంట్‌ వివరాలు పంపించారు. ఆ సినిమా నుంచి  వైదొలుగుతానని నేను చెప్పలేదు, ఆ చిత్రాన్ని నేను ఆపలేదు’ అని విశ్వక్ స్పష్టం చేశారు.

‘షూటింగ్ ప్రారంభానికి ముందు నేను క్యాన్సిల్‌ చేయడం తప్పే. కానీ, నాలుగు రోజులు అయిష్టంగా పనిచేసి తర్వాత కొన్ని రోజులు బ్రేక్‌ తీసుకోవాలనుకోవడం ఇంకా పెద్ద తప్పు. నాకు ఇబ్బంది కలిగితే నాలుగు గోడల మధ్యే మాట్లాడా. అంత గౌరవం ఇచ్చా. ఆయన ప్రెస్‌మీట్‌ పెట్టడం వల్ల ఇప్పుడు నా కుటుంబీకులు, స్నేహితులు బాధపడుతున్నారు. నేనేం చేయాలి? నన్ను ఆ సినిమా నుంచి తీసేశారు. అలాంటప్పుడు ఆయన మూవీ గురించి నేనెందుకు మాట్లాడాలని అనుకున్నా. కాబట్టే నిన్న స్పందించలేదు. సినిమాల విషయంలో తప్పు చేశానంటే చెప్పండి.. ఇప్పుడే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతా. నా వల్ల మీరు ఇబ్బంది పడి ఉంటే క్షమించండి సర్‌’ అని విశ్వక్‌ సేన్‌ అర్జున్‌ను ఉద్దేశించి మాట్లాడారు.  

Read more: Trivikram Srinivas Birthday Special :  మాటలతో యుద్ధం చేయగల సినీ మాంత్రికుడు త్రివిక్రమ్ !

You May Also Like These