Lavanya Tripathi: 'హ్యాపీ బర్త్ డే' ట్రైలర్ లాంఛ్ కార్యక్రమంలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు..!
Lavanya Tripathi: ‘మత్తు వదలరా’ సినిమాతో ప్రేక్షకుల అటెన్షన్‌ను తనవైపు తిప్పుకున్నాడు రితేశ్ రానా. ఆయన దర్శకత్వంలో ఇప్పుడు వస్తున్న మరో సినిమా ‘హ్యాపీ బర్త్‌డే’. టైటిల్ కామన్‌గానే ఉన్నా.. టీజర్, ట్రైలర్ మాత్రం డిఫరెంట్‌గా ఉన్నాయి. సినిమాపై ఆసక్తి రేకెత్తించేలా టీజర్, ట్రైలర్లను డిజైన్ చేసింది చిత్ర యూనిట్. ‘హ్యాపీ బర్త్‌డే’ కథను కూడా డైరెక్టర్ రితేశ్.. ‘మత్తు వదలరా‘ సినిమాలాగే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించాడని తెలుస్తోంది. స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠీ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది.
‘హ్యాపీ బర్త్‌డే’ (Happy Birth Day Movie) సినిమాను క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మిస్తోంది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా హ్యాపీ బర్త్ డే సినిమా జూలై 8న విడుదల కాబోతున్నది. తొలుత జూలై 15న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ అనూహ్యంగా జూలై 8న రావాల్సిన నాగచైతన్య థాంక్యూ సినిమా చివరి నిమిషంలో వాయిదా పడింది. పెద్ద సినిమా వెనక్కి వెళ్లిపోవడంతో ఆ డేట్‌ను సద్వినియోగం చేసుకోవాలని భావించిన హ్యాపీ బర్త్ డే యూనిట్ వారం రోజుల ముందుగానే తమ సినిమాను రిలీజ్ చేయబోతోంది.
టీవల ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) చేతుల మీదుగా హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర హీరోయిన్ లావణ్య త్రిపాఠీ మాట్లాడుతూ... డైరెక్టర్ రాజమౌళి మా కార్యక్రమానికి రావడం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోంది. మాదొక డిఫరెంట్ ఫిల్మ్ అని మేము చెప్పక్కర్లేదు. మీరు టీజర్, ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది. నిర్మాత కొత్తగా ఆలోచిస్తేనే ఇలాంటి మూవీ తెరపైకి వస్తుంది. దర్శకుడిగా రితేష్ రానా ఇప్పటికే నిరూపించుకున్నాడు. నేను ఈ తరహా సినిమాలో నటిస్తానని అనుకోలేదు. నా క్యారెక్టర్ కంప్లీట్ గా కొత్తగా ఉంటుంది. జూలై 8న థియేటర్ లో పార్టీ చేసుకుందాం అని అన్నారు.