ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఒక్క మూవీతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. ఆయన కెరీర్ ‘పుష్ప’కు ముందు ఆ తర్వాత అనేలా ఉంది. ‘ఆర్య’, ‘దేశముదురు’, ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘రేసుగుర్రం’, ‘సరైనోడు’ లాంటి సినిమాలు ఆయన్ను తెలుగుతోపాటు మలయాళంలోనూ తిరుగులేని స్టార్‌ను చేశాయి. అయితే ‘పుష్ప’ మాత్రం ఆయనకు జాతీయ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ సినిమా ఎప్పటిలాగే తెలుగు, మలయాళంలో బన్నీకి మరో హిట్ అందించగా.. తమిళం, హిందీలో సూపర్ సక్సెస్ అయ్యింది.
ఉత్తరాదిన ‘పుష్ప’తో అల్లు అర్జున్ చేసిన మాయ అంతా ఇంతా కాదు. అక్కడ ఈ సినిమా అద్భుతమైన వసూళ్లతో ఏకంగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. డ్యాన్సులు, ఫైట్లు, ‘తగ్గేదేలే’ అంటూ మేనరిజమ్స్‌తో బన్నీ చేసిన మ్యాజిక్‌కు హిందీ ఆడియెన్స్ ఫుల్ ఫిదా అయ్యారు. ఈ మూవీతో తన అభిమానగణాన్ని, మార్కెట్‌ను మరింతగా పెంచుకున్న అల్లు అర్జున్.. ఎన్నో అవార్డులనూ ఖాతాలో వేసుకుంటున్నారు. ‘పుష్ప’లో అల్లు అర్జున్ నటనకు ఇప్పటికే ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కింది. ఇప్పుడు ఆయన మరో విశేష గౌరవాన్ని దక్కించుకున్నారు.
ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా భావించే జీక్యూ (GQ Awards) ‘మ్యాన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ఈ ఏడాది అల్లు అర్జున్‌ను వరించింది. ఈ మేరకు ఆ మేగజీన్ బృందం బుధవారం హైదరాబాద్‌కు చేరుకుని సిటీలోని ఓ ప్రముఖ హోటల్‌లో ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో బన్నీకి ఆ అవార్డును అందించింది. ఈ ఫొటోలు ఆయన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ తన టార్గెట్ అందుకున్నానని చెప్పారు. ‘లీడింగ్ మ్యాన్ ఆఫ్ 2022గా నన్ను సత్కరించినందుకు జీక్యూ ఇండియాకు కృతజ్ఞతలు. ఈ మేగజీన్ కవర్ మీద నా ఫొటో ఉండటాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నా. నా లిస్టులోని ఓ లక్ష్యాన్ని ఇలా అందుకున్నా’ అని అల్లు అర్జున్ పేర్కొన్నారు.
ఇకపోతే, వినోద రంగంలో విశేష ఆదరణ పొందిన పలువురు స్టార్స్‌ను గుర్తించి జీక్యూ ఇండియా మేగజీన్ ప్రతి ఏడాది ‘లీడింగ్ మ్యాన్’, ‘లీడిండ్ ఉమెన్’ పురస్కారాలను అందజేస్తుంటుంది. బాలీవుడ్‌కు చెందిన పలువురు నటీనటులకు ఇప్పటి వరకూ ఈ అవార్డు వచ్చింది. అలాంటి ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కావడం విశేషం. కాగా, బన్నీ ప్రస్తుతం ‘పుష్ప–2’ (Pushpa 2) చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా ఆడియెన్స్ ముందుకు రానుంది.
Read more: IMDb Best of 2022 : 2022లో అత్యంత జనాదారణ పొందిన సినిమా 'ఆర్ఆర్ఆర్' (RRR)
Follow Us