టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను ‘హిట్’ (HIT: The First Case) సినిమాతో ప్రేక్షకులకు థ్రిల్ చేశారు. మర్డర్ మిస్టరీ కథను అంతే సీరియస్‌గా తెరకెక్కించి ఆయన హిట్ కొట్టారు. యువ కథానాయకుడు విశ్వక్ సేన్ కెరీర్‌లో ఇదో డిఫరెంట్ ఫిల్మ్‌గా నిలిచిపోయింది. ఈ సినిమాను హిందీలోనూ రీమేక్ చేశారు శైలేష్ కొలను. బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావ్ హీరోగా నటించిన ఈ మూవీ థియేటర్లలో యావరేజీ చిత్రంగా నిలిచింది. అయితే ఓటీటీలో మాత్రం మంచి వ్యూస్ సాధించింది.
ఇప్పుడు ‘హిట్’ సీక్వెల్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు శైలేష్ కొలను సిద్ధమవుతున్నారు. ఆయన తెరకెక్కించిన ‘హిట్ 2’ (HIT: The Second Case) డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస హిట్లతో దూసుకెళ్తున్న అడివి శేష్ ఈ మూవీలో హీరోగా నటిస్తున్నారు. ‘హిట్ 2’ టీజర్‌ను గురువారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో అడివి శేష్ ఈ మూవీ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘హిట్ 1’ ప్రశ్నలతో థ్రిల్ చేస్తే.. ‘హిట్ 2’ భయపెట్టి థ్రిల్ చేస్తుందన్నారు.
‘హీరో నాని నాకు ఇష్టమైన హీరో. ‘గూఢచారి’, ‘ఎవరు’ సినిమాల ట్రైలర్స్‌ను ఆయనే రిలీజ్ చేశారు. ఒకరోజు హఠాత్తుగా వచ్చి నాతో ఒక హిట్ సినిమా నిర్మిస్తానన్నారు. అలా ‘హిట్ 2’ నా దగ్గరకు వచ్చింది. ఈ మూవీ చేయడానికి కొవిడ్ టైమ్‌లో చిత్ర బృందమంతా చాలా కష్టపడింది. అందుకు గర్వంగా ఫీలవుతున్నా. సినిమా చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. టీజర్ చూడగానే విలన్ వాయిస్ బాగా నచ్చింది. హిట్ వర్స్‌లో విభిన్నమైన కోణాలున్నాయి. అందుకనే ‘హిట్ 2’లో నటించాను. ఇందులో శైలేష్ నన్ను కొత్తగా చూపించాడు. హీరోయిన్ మీనాక్షి చక్కటి ప్రతిభ ఉన్న నటి. ఆమె సినిమా కోసం చాలా కష్టపడి పని చేశారు’ అని అడివి శేష్ చెప్పారు.
సెట్స్‌లో అడివి శేష్ ప్రొఫెషనల్‌గా ఉంటారని డైరెక్టర్ శైలేష్ కొలను అన్నారు. ఈ కథతో శేష్ దగ్గరకు వెళ్దామనుకుంటే కొందరు వద్దన్నారని ఆయన చెప్పారు. శేష్ దగ్గరకు వెళ్తే స్క్రిప్ట్‌లో వేలుపెడతాడని.. అన్నీ తనే రాసేసుకుంటాడని చెప్పారని శైలేష్ పేర్కొన్నారు. దీంతో తొలి మీటింగ్ సమయంలో కథ శేష్‌కు నచ్చుతుందో లేదోనని అనుకున్నానని.. కానీ ఆయనకు బాగా నచ్చిందన్నారు. ‘సెట్స్‌లో శేష్ ఎంతో ప్రొఫెషనల్‌గా ఉండేవాడు. కె.డి. అనే క్యారెక్టర్ ఎలా ఉండాలని అనుకున్నానో.. దానికంటే నాలుగైదు రెట్లు బాగా చేసి చూపించాడు. హిట్ వర్స్ (Hit Verse)కు వచ్చిన ఆదరణ చూసి ఆశ్చర్యమేసింది’ అని శైలేష్ కొలను పేర్కొన్నారు.
Follow Us