టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నుంచి తర్వాతి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా ఆడియెన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ‘సర్కారు వారి పాట’తో ప్రేక్షకులను పలకరించిన ఆయన.. తదుపరి క్రేజీ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న ఓ మూవీలో నటిస్తున్నారు. ఎస్ఎస్ఎంబీ 28 (SSMB 28) అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా కొంతమేర షూటింగ్‌ను జరుపుకుంది. అయితే ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్న పూజా హెగ్డే గాయపడటంతో షూట్‌కు కొన్నాళ్లు బ్రేక్ పడిందని సమాచారం.
ఇటీవల మహేష్ తండ్రి కృష్ణ చనిపోయారు. దీంతో సూపర్‌స్టార్ షూటింగ్స్‌కు దూరంగా ఉంటున్నారు. అయితే మళ్లీ ఆయన షూటింగ్స్‌ను మొదలుపెట్టేశారు. బ్యాక్ టు వర్క్ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ద్వారా అభిమానులకు శుభవార్త తెలిపారు. ఈ చిత్రాన్ని త్వరగా ముగించేసి.. రాజమౌళి (SS Rajamouli)తో నెక్స్ట్ చేయబోయే ప్రతిష్టాత్మక చిత్రం పనుల్లో నిమగ్నమవ్వాలని మహేష్ భావిస్తున్నారని తెలుస్తోంది.
ఇకపోతే, మహేష్ తర్వాతి సినిమా గురించి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మహేష్ లాంటి నటుడికి కథ రాయాలని చాలా మంది రచయితలు అనుకుంటారని విజయేంద్ర ప్రసాద్ ప్రశంసించారు. మహేష్ చాలా ఇంటెన్సిటీ ఉన్న యాక్టర్ అని.. ఆయన నటించిన యాక్షన్ సన్నివేశాలు చూస్తే ఆ తీవ్రత కనిపిస్తుందని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.
‘ఎన్నో రోజుల నుంచి సాహసోపేతమైన కథతో సాగే సినిమా తెరకెక్కించాలని రాజమౌళి అనుకుంటున్నారు. ఈ కథకు మహేష్ సరిగ్గా సరిపోతారని ఆయన్ను ఎంపిక చేసుకున్నారు. నేను తనను దృష్టిలో పెట్టుకొని కథ రాశా. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో ప్రదేశాల్లో షూట్ చేయాలని అనుకుంటున్నాం. వచ్చే ఏడాది జూన్ నాటికి ఈ మూవీ షూటింగ్ ప్రారంభించనున్నాం’ అని విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.
Follow Us