మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)పై ప్రముఖ సినీ, రాజకీయ సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) కూడా చిరును మెచ్చుకున్నారు. ‘ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్–2022’ అవార్డు మెగాస్టార్‌ను వరించడంపై ప్రధాని మోడీ స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. చిరు ఓ విలక్షణమైన నటుడని మోడీ ప్రశంసించారు.
‘చిరంజీవి ఒక విలక్షణమైన నటుడు. అద్భుతమైన వ్యక్తిత్వంతో, విభిన్న నటనాచాతుర్యంతో అనేక పాత్రలు పోషించి ఎన్నో తరాల ప్రేక్షకుల అభిమానం, ఆదరణనూ ఆయన పొందుతున్నారు. గోవాలో జరుగుతున్న భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో విశిష్టమైన ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి ఎంపికైనందుకు చిరంజీవికి నా శుభాభినందనలు’ అని మోడీ చెప్పుకొచ్చారు.
మెగాస్టార్ చిరంజీవిని ప్రతిష్టాత్మక అవార్డు వరించడంపై ఆయన సోదరుడు, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. ఈ పురస్కారం చిరు కీర్తి కిరీటంలో చేరిన మరొక వజ్రం అని పవన్ అన్నారు. ఈ ఆనంద సమయంలో తన మార్గదర్శి అన్నయ్య చిరుకు అభినందనలు తెలియజేశారు.
‘నాలుగు దశాబ్దాలు పైబడిన అన్నయ్య (చిరంజీవి) సినీ ప్రస్థానం, తనను తాను మలచుకొని ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థానం సంపాదించుకోవడం నాతో సహా ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. అంతర్జాతీయ చలన చిత్ర వేదికపై అన్నయ్య చిరంజీవి గారికి ఈ గౌరవం దక్కుతున్నందుకు ఎంతో ఆనందిస్తున్నా’ అని పవన్ పేర్కొన్నారు.
ఇకపోతే, చిరంజీవి ప్రస్తుతం ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో నటిస్తున్నారు. ఆయన యాక్ట్ చేసిన ‘గాడ్ ఫాదర్’ సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ‘వాల్తేరు వీరయ్య’లో నటిస్తూ ఆయన బిజీ అయిపోయారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు రిలీజ్ కానుంది. మాస్ మహారాజా రవితేజ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్నారు.
Follow Us