Kamal Haasan: విశ్వనటుడు కమల్ హాసన్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక.. ఆందోళనలో అభిమానులు

విశ్వనటుడు కమల్ (Kamal Haasan) త్వరగా కోలుకుని.. పూర్తి ఆరోగ్యంతో బయటకు రావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు

కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan) అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. చెన్నైలోని పోరూర్ రామచంద్ర ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కమల్ ఇంతకుముందు కొవిడ్ బారిన పడ్డారు. అప్పుడు కొన్ని రోజుల పాటు హాస్పిటల్ ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. పూర్తి  ఆరోగ్యంతో ఆయన కోలుకున్నారు. ఇక గురువారం (నవంబర్ 23) హైదరాబాద్‌కు వచ్చిన కమల్.. తన గురువు కళాతపస్వి కే విశ్వనాథ్‌ను కలసి వెళ్లారు. 

విశ్వనాథ్‌ను కలసిన అనంతరం తిరిగి చెన్నైకి బయలుదేరారు కమల్. నిన్న రాత్రి చెన్నై చేరుకున్న తర్వాత ఆయన స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. రాత్రి కాస్త జ్వరంగా ఉండటంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆస్పత్రికి వెళ్లారని సమాచారం. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తమ అభిమాన హీరో అనారోగ్యం పాలయ్యారని తెలియడంతో కమల్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. విశ్వనటుడు త్వరగా కోలుకుని.. పూర్తి ఆరోగ్యంతో బయటకు రావాలని కోరుకుంటున్నారు. 

ఇకపోతే, ‘విక్రమ్’ (Vikram) చిత్రంతో ఇటీవల బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న కమల్ హాసన్.. తదుపరి చిత్రం షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం ‘ఇండియన్ 2’ (Indian 2) సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీని కోలీవుడ్ దిగ్దర్శకుడు శంకర్ డైరెక్షన్ చేస్తున్నారు. 1996లో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు ఇది సీక్వెల్‌గా వస్తోంది. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఈ ఫిల్మ్‌లో కథానాయికగా నటిస్తున్నారు. 

‘ఇండియన్ 2’ సినిమాను లైకా ప్రొడక్షన్స్‌, రెడ్‌జియాంట్‌ మూవీస్‌ బ్యానర్‌లపై సుభాస్కరన్, ఉదయనిధి స్టాలిన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వీలైనంత త్వ‌రగా పూర్తి చేయాల‌ని దర్శకుడు శంక‌ర్ భావిస్తున్నారు. ప్ర‌స్తుతం క‌మ‌ల్ హాస‌న్‌తో పాటు కాజ‌ల్‌కు సంబంధించిన స‌న్నివేశాల‌ను ఆయన చిత్రీక‌రిస్తున్నార‌ని స‌మాచారం. క‌మ‌ల్‌తో ‘ఇండియ‌న్ 2’, రామ్ చ‌ర‌ణ్‌తో ‘ఆర్‌సీ 15’ (RC15) చిత్రాల‌ను ఏక‌కాలంలో ద‌ర్శ‌కుడు శంక‌ర్ తెరకెక్కిస్తుండటం విశేషం. 

Read more: పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌(Prabhas)కు ఇష్టమైనవి ఏంటో తెలుసా? (డార్లింగ్‌ గురించిన టాప్‌7 ఆసక్తికర విశేషాలు)

You May Also Like These