తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush)కు తెలుగులోనూ మంచి పాపులారిటీ ఉంది. ‘రఘువరన్ బీటెక్’ చిత్రం ఆయనకు టాలీవుడ్లో క్రేజ్ తీసుకొచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా ఇక్కడ విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన పలు ధనుష్ చిత్రాలకు కూడా తెలుగు నాట మంచి ఆదరణే దక్కింది.
వైవిధ్యమైన సినిమాలను ఎంపిక చేసుకుంటాడని ధనుష్‌కు పేరుంది. ఆయన నటించే పాత్రలు కూడా విలక్షణంగా ఉంటాయి. అందుకే ఆయన నుంచి ఓ చిత్రం వస్తోందంటే చాలా చూడటానికి ఆడియెన్స్ సిద్ధంగా ఉంటారు. తెలుగులో తనకు క్రేజ్ పెరుగుతుండటంతో ఇక్కడి దర్శకులతో పని చేసేందుకు ధనుష్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఆయన ఓ తెలుగు దర్శకుడితో సినిమా చేస్తున్నారు. ఆయన యాక్ట్ చేస్తున్న ద్విభాషా చిత్రం ‘సార్’ (Sir Movie)ను తెలుగు దర్శకుడైన వెంకీ అట్లూరినే రూపొందిస్తున్నారు.
ఇప్పుడు మరో టాలీవుడ్ డైరెక్టర్‌తో చిత్రాన్ని పట్టాలెక్కించారు ధనుష్. సెన్సిబుల్ సినిమాలు తీస్తాడనే పేరున్న సీనియర్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula)తో ఓ కొత్త సినిమాను తాజాగా ప్రారంభించారు ధనుష్. వాస్తవానికి ఈ మూవీ ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లాల్సింది. అయితే పలు కారణాలతో ఆలస్యం కావడంతో ‘సార్’ చిత్రం షూటింగ్‌ను తొలుత ప్రారంభించారు. దీంతో శేఖర్ కమ్ముల–ధనుష్ కాంబోలో సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి.
ఎట్టకేలకు శేఖర్ కమ్ముల–ధనుష్ కలయికలో మూవీ సెట్స్ పైకి వెళ్లింది. ఇవాళ ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి. ఇందులో హీరో ధనుష్ కూడా పాల్గొన్నారు. త్రిభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ఫిల్మ్‌ను.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. సోనాలీ నారంగ్ ఈ మూవీకి సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
Follow Us