ప్రతి ఒక్కరి జీవితంలో మొదటి ఉద్యోగం, మొదటి సంపాదన, మొదటి ప్రేమ, మొదటి కారు వీటికి ప్రాముఖ్యత చాలా ఎక్కువ. దానిని చూసుకుని ఎంతో మురిసిపోతుంటారు. సినిమా ఇండస్ట్రీలో కూడా అంతే. తాము నటించిన మొదటి సినిమా గురించి గర్వంగా చెప్పుకుంటారు నటీనటులు. ఆ సినిమా హిట్ అయితే ఆ జోష్ వారిలో మరింత ఎక్కువగా ఉంటుంది. అందులో వాళ్ల క్యారెక్టర్‌కు గుర్తింపు లభిస్తే వాళ్ల ఆనందానికి అవధులు ఉండవు.
ఇక, ఆ మొదటి సినిమా పేరే వాళ్ల పేరుకు ముందు బిరుదుగా వచ్చి చేరితే.. అంతకంటే కావాల్సినది ఏముంటుంది.తాము నటించిన, సంగీతం అందించిన, లిరిక్స్ రాసిన, నిర్మించిన, దర్శకత్వం వహించిన సినిమా టైటిల్ తమ పేరుకు ముందు వచ్చి చేరితే.. ఆ పేరుతో వాళ్లు పాపులర్ అయితే..వాళ్లు తొలి ప్రయత్నంలోనే విజయం సాధించినట్టు లెక్క. మొదటి సినిమా పేరు తమ పేరుకు ముందు చేరిన టాలీవుడ్ (Tollywood) ప్రముఖుల గురించిన విషయాలు పింక్‌విల్లా ప్రేక్షకుల కోసం..
‘శుభలేఖ’ సుధాకర్
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా శుభలేఖ. 1982లో విడుదలైన ఈ సినిమాలో సుమలత, కైకాల సత్యనారాయణ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాతోనే ఇండస్ట్రీకి పరిచయమయ్యారు ఎస్.సుధాకర్. శుభలేఖ సినిమాలో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక, అప్పటి నుంచి ఆయన పేరు శుభలేఖ సుధాకర్‌గా స్థిరపడిపోయింది.
‘ఆహుతి’ ప్రసాద్
రాజశేఖర్ (RajaShekar), జీవిత (Jeevitha) జంటగా నటించిన సినిమా ఆహుతి. 1987లో విడుదలైన ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో ఎ.జనార్ధన వరప్రసాద్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆహుతి సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఆయన పేరులో ఆహుతి చేరిపోయింది. దాదాపు 300 చిత్రాల్లో నటించినా ఆహుతి ప్రసాద్‌గానే ఆయన అందరికీ సుపరిచితుడు.
‘అల్లరి’ నరేష్
స్టార్ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నరేష్ (Allari Naresh). అల్లరి సినిమాలో హీరోగా నటించి కామెడీ పండించారు. ఆ సినిమా యావరేజ్‌గా ఆడినప్పటికీ నరేష్ పేరుకు ముందు అల్లరి అనేది చేరిపోయింది. రవిబాబు దర్శకత్వంలో 2002వ సంవత్సరంలో విడువలైన ఈ సినిమాతో నరేష్ ఇంటిపేరు ‘అల్లరి’గా మారిపోయింది.
‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి
కవి, పాటల రచయిత అయిన చేంబోలు సీతారామశాస్త్రి.. ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి’గా తెలుగు వారందరికీ సుపరిచితులు. సర్వదమన్ బెనర్జీ, సుహాసిని (Suhasini ManiRatnam) ప్రధాన పాత్రల్లో కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సంగీత ప్రధాన చిత్రం సిరివెన్నెల. ఈ సినిమాలో ‘విధాత తలపున ప్రభవించినది’ అనే పాటతో తెలుగు చలనచిత్ర రంగంలోకి ప్రవేశించారు సీతారామశాస్త్రి. అప్పటి నుంచి ఆయన ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి’గా ఖ్యాతి పొందారు.
‘దేవి’ శ్రీ ప్రసాద్
జి.ప్రసాద్.. సంగీత దర్శకుడు. ఈ పేరు చెప్తే బహుశా ఎవరికీ తెలియకపోవచ్చు. అయితే దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) లేదా డీఎస్పీ అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలకు తప్పకుండా తెలుస్తారు. యూత్‌ను ఉర్రూతలూగించే మ్యూజిక్, ఎనర్జిటిక్ పర్ఫామెన్స్‌తో అభిమానులను అలరించే వ్యక్తి డీఎస్పీ. 2006వ సంవత్సరంలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో సిజు, ప్రేమ ప్రధాన పాత్రల్లో నటించిన దేవి సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు ప్రసాద్. అప్పటి నుంచి ఆయన దేవి శ్రీ ప్రసాద్‌గా పాపులర్ అయ్యారు.
‘వెన్నెల’ కిషోర్ :
వెన్నెల సినిమాతో టాలీవుడ్‌లోకి కమెడియన్‌గా అడుగుపెట్టారు కిషోర్. ఈ సినిమాలో హీరో రాజాకు ఫ్రెండ్‌గా నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. వెన్నెల కిషోర్ అసలు పేరు బి.కిషోర్ కుమార్. వెన్నెల సినిమా తర్వాత ఆయన ‘వెన్నెల కిషోర్’గా ఫేమస్ అయ్యారు. 2005వ సంవత్సరంలో వచ్చిన వెన్నెల సినిమా నుంచి ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.
‘దిల్’ రాజు
వి.వెంకటరమణా రెడ్డి అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. అయితే దిల్ రాజు అంటే మాత్రం అందరికీ కచ్చితంగా తెలుస్తుంది. శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ బ్యానర్‌ను స్థాపించి పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కిస్తున్నారు దిల్ రాజు. ఆయన నిర్మాతగా వ్యవహరించిన మొదటి సినిమా 2003లో నితిన్ (Nithin) హీరోగా తెరకెక్కిన దిల్. వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక, అప్పటి నుంచి దిల్ రాజుగా పాపులర్ అయ్యారు.
‘బొమ్మరిల్లు’ భాస్కర్
సిద్దార్థ్ (Siddharth), జెనీలియా (Genelia) నటించిన సూపర్‌డూపర్ హిట్ సినిమా బొమ్మరిల్లు. ఈ సినిమాకు దర్శకత్వం వహించారు భాస్కరన్ నటరాజన్. ఈ పేరు కొత్తగా అనిపించినా.. బొమ్మరిల్లు భాస్కర్ అసలు పేరు ఇదే. బొమ్మరిల్లు సినిమాతో దర్శకుడిగా మారారు భాస్కరన్ నటరాజన్. 2006లో సినిమా విడుదలైనప్పటి నుంచి ఆయనను అందరూ బొమ్మరిల్లు భాస్కర్ అనే పిలుస్తున్నారు. ఆ పేరుతోనే ఆయన పాపులర్ అయ్యారు.
‘సత్యం’ రాజేష్
సుమంత్ (Sumanth), జెనీలియా హీరోహీరోయిన్లుగా సూర్య కిరణ్ దర్శకత్వంలో వచ్చిన లవ్, మ్యూజికల్ ఎంటర్‌టైనర్ సత్యం. ఈ సినిమాలో కమెడియన్‌గా నటించారు రాజేష్ బాబు. సత్యం సినిమాలో సుమంత్ స్నేహితుడిగా రాజేష్ నటనకు మంచి పేరు వచ్చింది. 2003లో విడుదలైన ఈ సినిమా తర్వాత నుంచి రాజేష్.. ‘సత్యం రాజేష్’ పాపులర్ అయ్యారు.
‘చిత్రం’ శ్రీను
ఉదయ్ కిరణ్ (Uday Kiran), రీమాసేన్ హీరోహీరోయిన్లుగా తేజ దర్శకత్వంలో వచ్చిన సినిమా చిత్రం. ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చారు శ్రీనివాసులు. చిత్రం సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఈ సినిమాలోని శ్రీను నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దాంతో అప్పటి నుంచి ఆయన పేరు ‘చిత్రం శ్రీను’గా స్థిరపడిపోయింది.
Read More : టాలీవుడ్ (Tollywood) ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాప్10 క్రేజీ కాంబినేషన్స్
Follow Us