టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రంభ (Rambha) ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్.. పిల్లలతో స్కూలు నుంచి వెళ్తుంటే..

వెటరన్ హీరోయిన్ రంభ (Rambha) ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ అయ్యింది. పిల్లలతోపాటు స్కూలు నుంచి వస్తుంటే ఈ ప్రమాదం చోటుచేసుకుంది

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రంభ (Rambha)కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ఘటనలో రంభ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయాలపాలైన ఆమె కూతరు సాషా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం సాయంత్రం పిల్లలను స్కూల్ నుంచి కారులో తీసుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్వయంగా రంభ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 

ప్రస్తుతం తామంతా క్షేమంగా ఉన్నామని రంభ తెలిపారు. తన చిన్నారి సాషా ఇంకా ఆస్పత్రిలోనే ఉందని ఆమె స్పష్టం చేశారు. తన కుమార్తె త్వరగా కోలుకోవడానికి అందరి ప్రార్థనలు కావాలని రంభ కోరారు. దీంతో పాటు కారు యాక్సిడెంట్ ఫొటోలను ఆమె షేర్ చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయని ఆ ఫొటోలను బట్టి తెలుస్తోంది. అందువల్లే, ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు. ఈ ఘటనలో కారు డోర్స్ మాత్రం బాగా డ్యామేజ్ అయినట్లు ఫొటోలను చూస్తే తెలుస్తోంది. వీటిని చూసిన సినీ ప్రేక్షకులు, రంభ అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని పోస్టులు చేస్తున్నారు. 

ఇక, ఇంతిరన్ అనే వ్యక్తిని రంభ పెళ్లాడారు. మొదట ఇద్దరు కుమార్తెలు (లావణ్య, సాషా) వీరికి సంతానం. ఆలస్యంగా 2018లో రంభ ఓ మగబిడ్డకు జన్మనిచ్చారు.  కాగా, రంభ తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేశ్‌ తోపాటు విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి తదితర స్టార్స్‌తో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళ, హిందీ భాషల్లోనూ ఆమె పలు సినిమాల్లో నటించారు. ప్రస్తుతం రంభ సినిమాలకు దూరంగా ఉంటూ.. భర్తతో కలిసి విదేశాల్లో సెటిలయ్యారు. 

Read more: రోజులో 15 గంటలు ఫ్రీజర్‌లో ఉండేదాన్ని.. ‘మిలీ’ కోసం పెయిన్ కిల్లర్స్ తీసుకున్నా: జాన్వీ కపూర్ (Janhvi Kapoor)

You May Also Like These