ప్రతి పాత్ర పైనా అది రాసి ఉంటుంది.. సినిమా ఫలితం కాదు, నాకు ప్రయాణమే ముఖ్యం: సాయి పల్లవి (Sai Pallavi)

ప్రతి పాత్ర మీదా దాన్ని ఎవరు చేయాలో రాసి ఉంటుందని హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) అన్నారు

నటీనటులు చాలా మంది ఉంటారు. కానీ సహజనటులు కొంతమందే ఉంటారు. అలాంటి కోవలోకే వస్తారు నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. చూడటానికి పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ సహజమైన నటనతో ఈతరం అమ్మాయిల పాత్రలకు ప్రాణం పోస్తున్నారు సాయి పల్లవి. అందుకే అనతి కాలంలోనే టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా ఆమె ఎదిగారు. అయినప్పటికీ వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒప్పకోవట్లేదు సాయి పల్లవి. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ.. కెరీర్‌ను జాగ్రత్తగా మలుచుకుంటున్నారు. 

ఎడాపెడా సినిమాలను ఒప్పుకోవడం తనకు నచ్చదని సాయి పల్లవి అన్నారు. తన దగ్గరకు వచ్చిన ప్రతి పాత్రలో నటించాలనే అత్యాశ లేదని ఆమె స్పష్టం చేశారు. ‘ప్రతి మెతుకు పైనా తినేవాడి పేరు ఉంటుందని అంటారు. అలాగే చిత్ర పరిశ్రమలో కూడా ప్రతి పాత్ర మీదా అది ఎవరు చేయాలనేది ముందే రాసి పెట్టి ఉంటుంది. అందుకే ఫలానా సినిమా లేదా పాత్ర నేను చేసుంటే బాగుండేదన్న ఆలోచన నాకెప్పుడూ రాలేదు. క్యారెక్టర్ల ఎంపికలో నాకంటూ ప్రత్యేకంగా ప్రణాళికలేమీ లేవు. కథ వింటున్నప్పుడు నేను ఎంటర్‌టైన్ అయ్యానా లేదా అనేదే ఆలోచిస్తా’ అని సాయి పల్లవి చెప్పుకొచ్చారు. 

పాత్రలో కొత్తదనం ఉందా.. లేదా అని ఆలోచిస్తానని సాయి పల్లవి అన్నారు. అలాగే కథలో ఆ పాత్రకు ఉన్న ప్రాధాన్యత ఏంటనే అంశాల్ని దృష్టిలో పెట్టుకుంటానని ఆమె తెలిపారు. సినిమా ఫలితాన్ని దృష్టిలో పెట్టుకోకుండా తన పాత్రకు వంద శాతం న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తానని సాయి పల్లవి పేర్కొన్నారు. ప్రతి చిత్రంతో ప్రయాణాన్ని తాను ఆస్వాదిస్తానని.. ఫలితాన్ని మాత్రం ప్రేక్షకులకు వదిలేస్తానని ఆమె చెప్పారు.

ఫలానా కథానాయకుడితో నటించాలనే కోరిక తనకు లేదని సాయి పల్లవి స్పష్టం చేశారు. కథ నచ్చితే ఎవరితోనైనా యాక్ట్ చేస్తానని ఆమె క్లారిటీ ఇచ్చారు. తనకు కథ చాలా ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. ‘ఫిదా’, ‘లవ్ స్టోరీ’ చిత్రాలు తన కెరీర్‌లో చాలా ప్రత్యేకమన్నారు. ముఖ్యంగా ‘ఫిదా’తో తన సినీ ప్రయాణం మారిపోయిందని.. తన ఆలోచనా విధానాన్ని డైరెక్టర్ శేఖర్ కమ్ముల మార్చేశారని సాయి పల్లవి వివరించారు. ఇకపోతే, ‘విరాటపర్వం’, ‘గార్గి’ చిత్రాలతో ఇటీవల ఆడియెన్స్‌ను అలరించిన సాయి పల్లవి.. ఇంకా కొత్త ప్రాజెక్టులను ఒప్పుకోలేదు. ప్రస్తుతం పలు కథలను ఆమె వింటున్నారని.. త్వరలో ఏదో ఒకదానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 

Read more: నటన నేర్చుకోకపోవడమే ప్లస్ అయ్యింది: సాయి పల్లవి (Sai Pallavi).. మహేష్‌బాబు స్క్రీన్ ప్రెజెన్స్ ఇష్టమని కామెంట్

You May Also Like These