టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ (Poonam Kaur) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన ‘మాయాజాలం’ సినిమాతో తెరంగేట్రం చేసిన బబ్లీ బ్యూటీ.. ఆ తర్వాత ‘ఒక విచిత్రం’, ‘నిక్కి అండ్ నీరజ్’, ‘శ్రీనివాస కల్యాణం’, ‘నెక్స్ట్ ఏంటి’ లాంటి మూవీల్లో పూనమ్ నటించారు. అయితే ‘వినాయకుడు’ సినిమాతో ఆమెకు మంచి పాపులారిటీ లభించింది.
సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారా ఎక్కువ క్రేజ్ సంపాదించిన పూనమ్ ఆరోగ్యంపై పలు వార్తలు వస్తున్నాయి. ఆమె పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఫైబ్రో మైయాల్జియా (Fibromyalgia) అనే అరుదైన వ్యాధితో పూనమ్ బాధపడుతున్నారట. ఆమె
ప్రస్తుతం కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నారట. ఈ వ్యాధి కారణంగా అలసట, నిద్ర, జ్ఞాపకశక్తి తగ్గడం, మానసిక స్థితిలో సమస్యలు తలెత్తడం, కండరాల నొప్పితో పాటు పూనమ్ పలు ఇబ్బందులు పడుతున్నారని సమాచారం.
గత రెండేళ్ల నుంచి పూనమ్ ఈ వ్యాధితో బాధపడుతున్నారట. ప్రస్తుతం దీని నుంచి బయటపడేందుకు కేరళలో ఆమె ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారట. దీనికి సంబంధించి కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. తమ అభిమాన హీరోయిన్ త్వరగా కోలుకోవాలని కోరుతూ పూనమ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ విషయంపై ఆమె ఇంకా అధికారికంగా స్పందించకపోవడం గమనార్హం.
ఇక ఇటీవలే స్టార్ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) మయోసైటిస్ వ్యాధి బారినపడినట్లు స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో కథానాయిక పూనమ్ కూడా అరుదైన వ్యాధితో బాధపడుతూ చికత్స తీసుకుంటున్నారని సమాచారం. సమంత, పూనమ్ త్వరగా కోలుకుని.. తిరిగి స్ట్రాంగ్‌గా కమ్‌బ్యాక్ ఇవ్వాలని మూవీ లవర్స్ కోరుకుంటున్నారు.
Follow Us