పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pavan Kalyan) నటిస్తున్న కొత్త చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లి చాలా నెలలు గడుస్తున్నా.. షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. సాధారణంగా వేగంగా సినిమాలు పూర్తి చేస్తాడనే పేరున్న దర్శకుడు క్రిష్ జాగర్లమూడి.. ‘వీరమల్లు’ విషయంలో మాత్రం ఎక్కువ టైమ్ తీసుకుంటున్నారు. దీంతో తమ అభిమాన హీరో చిత్రం కోసం ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలని క్రిష్‌ను పవన్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
పవన్ ఒకవైపు ‘వీరమల్లు’ (Harihara Veeramallu) చిత్రీకరణలో పాల్గొంటూనే రాజకీయాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. ఇంకా ఈ మూవీ షూటింగ్ పూర్తికాక ముందే మరిన్ని సినిమాలకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వినికిడి. మరి, ‘వీరమల్లు’ ఎప్పుడు పూర్తవుతుందో, మిగిలిన చిత్రాలను ఆయన ఎప్పుడు మొదలుపెడతారో అనేది అర్థం కాకుండా ఉంది. ఈ నేపథ్యంలో ‘హరిహర వీరమల్లు’ చిత్ర యూనిట్ ఓ అప్‌డేట్ ఇచ్చింది. తమ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోందని ఓ ప్రకటనలో వెల్లడించింది.
చారిత్రక నేపథ్యంలో తీస్తున్న ‘వీరమల్లు’ను మరింత నాణ్యతో తెరకెక్కిస్తున్నామని.. అందుకే ఎక్కువ సమయం పడుతోందని ఆ ప్రకటనలో మూవీ యూనిట్ తెలిపింది. ‘ఈ చిత్రాన్ని తీసే క్రమంలో ప్రతి సూక్ష్మ వివరాన్ని తెలుసుకుంటున్నాం. ఎంతోమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్ల పరిశ్రమ, పరిశోధన ఇందులో ఇమిడి ఉన్నాయి. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ఈ మూవీ శరవేగంగా జరుగుతోంది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ చివరి వారం నుంచి పవన్ కల్యాణ్‌తోపాటు 900 మంది ఆర్టిస్టులు చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ‘హరిహర వీరమల్లు’ సినిమా ఓ మైలురాయి చిత్రం అవుతుందని మేం నమ్ముతున్నాం. మాపై మీ ఆశీస్సులు, ప్రేమను ఇలాగే కొనసాగించండి’ అని మూవీ యూనిట్ కోరింది.
Follow Us