సూపర్‌స్టార్ కృష్ణ (Superstar Krishna) అంత్యక్రియలు బుధవారం హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలను నిర్వహించనుంది. అభిమానుల సందర్శనార్థం కృష్ణ భౌతికకాయాన్ని పద్మాలయ స్టూడియోకి తీసుకొచ్చారు. ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు అభిమానులు సందర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. పన్నెండు గంటల తర్వాత అంతిమయాత్ర, మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.
సూపర్ స్టార్ కృష్ణను చివరిసారి చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి అభిమానులు, సినీ ప్రేక్షకులు పెద్ద ఎత్తున పద్మాలయ స్టూడియోస్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పద్మాలయ స్టూడియోస్ వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కాగా, కృష్ణ మృతికి సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నటనతో సినీ రంగానికి, రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు చేసిన సేవలను గుర్తుచేసుకుంటున్నారు. కృష్ణ మృతికి సంతాపం తెలియజేస్తూ పలువురు ట్వీట్లు పెడుతున్నారు. అలాగే, కృష్ణ పార్థివదేహాన్ని సందర్శించి, ఆయన చిన్న కొడుకు మహేష్ బాబును, కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు
ఇవాళ షూటింగ్స్ బంద్
ఇక, కృష్ణ మృతి చెందడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు అని కేసీఆర్ అన్నారు. ప్రభుత్వ అధికార లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేష్ కుమార్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని తెలంగాణ సీఎంవో ట్విట్టర్‌లో వెల్లడించింది. కృష్ణ మృతికి సంతాప సూచకంగా బుధవారం సినిమా షూటింగ్‌లను నిలిపివేయాలని నిర్మాతల మండలి నిర్ణయించింది. ఈ మేరకు కౌన్సిల్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఇకపోతే, సూపర్‌స్టార్ కృష్ణ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయారని కాంటినెంటల్ ఆస్పత్రి డాక్టర్లు స్పష్టం చేశారు. ‘కృష్ణ గుండెపోటుతో ఆస్పత్రికి వచ్చారు. ఆయనను వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు తరలించి సీపీఆర్ చేశాం. ఆ తర్వాత ట్రీట్‌మెంట్ చేయడం ప్రారంభించాం. వచ్చినప్పటి నుంచే ఆయన హెల్త్ కండీషన్ విషమంగా ఉంది. రెండు మూడు గంటల తర్వాత పలు అవయవాలు పనిచేయడం మానేశాయి. సుమారు నాలుగు గంటల తర్వాత డయాలసిస్ అవసరం ఏర్పడటంతో అది కూడా చేశాం. ఎలాంటి చికిత్స చేసినా ఫలితం ఉండదని, వైద్యుల బృందం నిర్ధారణకు వచ్చింది. దీంతో ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఉన్న కొద్ది గంటలు మనఃశాంతిగా వెళ్లిపోవాలని కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకున్నాం’ అని డాక్టర్ గురు ఎన్ రెడ్డి తెలిపారు.
Read more: Tamannaah Bhatia : ప్రముఖ వ్యాపారవేత్తతో తమన్నా వివాహం.. ఈ వార్తలో నిజమెంత ?
Follow Us