‘ది కశ్మీర్ ఫైల్స్’ (The Kashmir Files), ‘కార్తికేయ 2’ (Karthikeya 2) చిత్రాల నిర్మాత అభిషేక్ అగర్వాల్ (Abhishek Agarwal) మరోమారు గొప్ప మనసును చాటుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో చాలా మంది పేదలకు సాయం చేసిన ఆయన.. తాజాగా మరో అడుగు ముందుకేశారు. తెలంగాణలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని అభిషేక్ నిర్ణయించుకున్నారు. రంగారెడ్డి జిల్లా, కందుకూరు మండలంలోని తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ గ్రామం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన్మస్థలం కావడం గమనార్హం.
మంత్రి కిషన్ రెడ్డి, అభిషేక్ అగర్వాల్‌కు మధ్య మంచి అనుబంధం ఉంది. వివిధ కార్యక్రమాలు, ఫంక్షన్లలో వీరిద్దరూ పలుసార్లు కలసి కనిపించారు. అభిషేక్ కుటుంబానికి చంద్రకళ అనే ఫౌండేషన్ ఉంది. ఈ ఫౌండేషన్ ద్వారా చాన్నాళ్లుగా ప్రజలకు ఆయన కుటుంబం సేవ చేస్తోంది. తన తండ్రి తేజ్ నారాయణ్ అగర్వాల్ 60వ పుట్టినరోజు, దివంగత అమ్మమ్మ చంద్రకళ 90వ జయంతి సందర్భంగా తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు వెల్లడించారు. చంద్రకళ ఫౌండేషన్ మూడో సార్థక్ దివస్ అక్టోబర్ 30న హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో జరగనుంది. ఈ కార్యక్రమానికి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
ఇకపోతే, ‘ది కశ్మీర్ ఫైల్స్’, ‘కార్తికేయ 2’ చిత్రాలతో అభిషేక్ అగర్వాల్ వరుసగా హిట్లను అందుకున్నారు. ఈ సినిమాలతో ఈ యంగ్ ప్రొడ్యూసర్ భారీగా లాభాలను ఆర్జించారు. స్వతహాగా వ్యాపారవేత్త అయిన అభిషేక్.. సినిమా రంగంపై ఉన్న ఆసక్తితో నిర్మాతగా మారారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థపై తొలుతగా మహేశ్ బాబు నటించిన ‘బ్రహ్మోత్సవం’ మూవీని ఆయన డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ తర్వాత నిఖిల్ ‘కిర్రాక్ పార్టీ’, అడవి శేష్ ‘గూఢచారి’, బెల్లంకొండ శ్రీనివాస్ ‘సీత’ మూవీలకు అభిషేక్ అగర్వాల్ కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత సందీప్ కిషన్ ‘ఏ1 ఎక్స్ ప్రెస్’తో పూర్తిస్థాయి నిర్మాతగా మారారు. అనంతరం శ్రీ విష్ణుతో ‘రాజ రాజ చోర’, ‘ది కశ్మీర్ ఫైల్స్’, ‘కార్తికేయ 2’ చిత్రాలను అభిషేక్ అగర్వాల్ రూపొందించారు. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజతో ‘టైగర్ నాగేశ్వరరావు’ను పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నారు.
Follow Us