'బింబిసార' (Bimbisara) సినిమాతో క‌ల్యాణ్ రామ్ రేంజ్ మ‌రింత పెరుగుతుంది.. ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ (NTR)!

Published on Jul 30, 2022 08:08 PM IST

టాలీవుడ్ హీరో నందమూరి క‌ల్యాణ్ రామ్ (Kalyan Ram) హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'బింబిసార'. ఈ చిత్రం ఆగ‌స్టు 5న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని శిల్పకళా వేదికలో 'బింబిసార' ప్రీ రిలీజ్ వేడుక జ‌రిగింది. ఈ వేడుక‌కు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ (NTR) హాజ‌ర‌య్యారు. ఈ ఈవెంట్ ప్రారంభమయిన కాసేపటికే శిల్పకళా వేదిక వద్ద నందమూరి అభిమానులు భారీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా 'బింబిసార' చిత్రం గురించి ఎన్టీఆర్ ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. 

'బింబిసార' కోసం త‌న అన్న‌య్య క‌ల్యాణ్‌రామ్ ర‌క్తాన్ని ధార‌పోశార‌ని ఎన్టీఆర్ అన్నారు. అంతేకాదు 'బింబిసార' సినిమా కేవ‌లం క‌ల్యాణ్ రామ్‌తోనే సాధ్య‌మైందని అభిప్రాయపడ్డారు. అభిమానులు కాల‌ర్ ఎగ‌రేసుకునేలా చేయ‌డ‌మే త‌మ బాధ్య‌త‌న్నారు. 'బింబిసార' సినిమా త‌ర్వాత, క‌ల్యాణ్ రామ్ రేంజ్ మ‌రింత పెరుగుతుందని ఎన్టీఆర్ ధీమా వ్య‌క్తం చేశారు. 'బింబిసార' కోసం క‌ల్యాణ్ రామ్ అహర్నిశలు ఎంతో శ్రమించారని తెలిపారు. ఓ న‌టుడిగా క‌ల్యాణ్ రామ్ త‌న‌ను తాను మ‌లుచుకున్నార‌ని ప్ర‌శంసించారు. 

ఓ మంచి జాన‌ప‌ద చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు 'బింబిసార' రూపంలో తీసుకొస్తున్నామ‌ని హీరో క‌ల్యాణ్ రామ్ అన్నారు. 'బింబిసార' చిత్రంతో అభిమానులు సంతృప్తి చెందుతార‌న్నారు. అభిమానులు గ‌ర్వించేలా ఈ చిత్రం ఉంటుంద‌న్నారు. సినిమాకు ప్రాణం పోసిన కీర‌వాణికి, త‌న‌కు ఈ చిత్రాన్ని అందించిన కె.హ‌రికృష్ణ‌కు జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాన‌ని క‌ల్యాణ్ రామ్ పేర్కొన్నారు.

కాగా, 'బింబిసార' (Bimbisara)లో ముగ్గురు హీరోయిన్లు న‌టిస్తున్నారు. కేథరిన్, సంయుక్త మీనన్, వార్నియా హుస్సేన్‌లు కథానాయిక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే వెన్నెల కిశోర్, శ్రీనివాస రెడ్డి, బ్రహ్మాజీ కీల‌క పాత్ర‌లలో క‌నిపించ‌నున్నారు. మ‌ల్లాది వ‌శిష్ట్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతుంది. 'బింబిసార' చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ ప‌తాకంపై హరికృష్ణ.కె నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి, చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. 'బింబిసార' చిత్రం ఆగస్టు 5వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. 

అయితే.. 'ఆర్ఆర్ఆర్' సినిమా తర్వాత చాలా రోజులకు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఒకే వేదికపై కనిపిస్తుండడంతో నందమూరి అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read More: 'బింబిసార' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నందమూరి అభిమానుల కోలాహలం.. ఎన్టీఆర్ కు ఘన స్వాగతం.. వీడియో వైరల్!