భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరిగా పేరొందిన మణిరత్నం (ManiRatnam) తెరకెక్కించిన ‘పొన్నియిన్ సెల్వన్’ (Ponniyin Selvan 1) చిత్రం సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకొచ్చింది. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్టు అయిన ఈ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. మణిరత్నం కష్టం వృథా పోలేదు. ఈ చిత్రం రిలీజైన రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లలో ఓ రేంజ్‌లో దూసుకెళ్తోంది. ఐదు రోజుల్లోనే రూ.300 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఒక్క తమిళనాడులోనే రూ.100 కోట్ల మార్కును అధిగమించింది.
‘పొన్నియిన్ సెల్వన్’కు తమిళంలో మంచి కలెక్షన్లు వస్తున్నా.. మిగిలిన భాషల్లో వసూళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ చిత్రానికి తెలుగుతోపాటు ఉత్తరాదిన రిలీజ్ రోజు మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ వచ్చేసింది. విడుదలకు ముందు ఈ సినిమాను బాహుబలితో పోల్చడంతో రిలీజైన తర్వాత ఇదే అంశంపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అసలు బాహుబలికి, పొన్నియన్ సెల్వన్‌కు పోలికే లేదంటూ విమర్శిస్తున్నారు.
ముఖ్యంగా సినిమా బాగోలేదంటూ సోషల్ మీడియాలో తెలుగు ప్రేక్షకులు పెడుతున్న పోస్టులు, కామెంట్లతో కొందరు తమిళ సినీ అభిమానులు గరంగరం అవుతున్నారు. పౌరాణిక చిత్రాలు తీయాలంటే రాజమౌళి లాంటి తెలుగు దర్శకులకే సాధ్యమని తెలుగు ఫ్యాన్స్ పెట్టిన పోస్టులకు తమిళ అభిమానులు హర్ట్ అయ్యారు. దీంతో తెలుగు ప్రేక్షకులపై తమిళ ప్రేక్షకులు మండిపడుతున్నారు. జక్కన్న తీసిన బాహుబలి ఒక ఫిక్షనల్ మూవీ అని.. ‘పొన్నియిన్ సెల్వన్’ యదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా అని వారు విరుచుకుపడుతున్నారు. తెలుగువారికి సినిమాలను ఎలా చూడాలో తెలియదని.. వారికి సరైన్ టేస్ట్ లేదంటూ రెచ్చగొట్టేలా కామెంట్లు చేస్తున్నారు తమిళ ఫ్యాన్స్.
అందరూ ఆదరించాలని నియమమేం లేదు
‘పొన్నియిన్ సెల్వన్’ వివాదంపై తాజాగా లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) స్పందించారు. ఇతర భాషల ప్రజలను దూషించడం తగదని ఆయన అన్నారు. ‘సినిమా బాగుంటే ఏ భాష వారైనా ఆదరిస్తారు. మనం ‘శంకరాభరణం’ ఆదరిస్తే వాళ్లు మన ‘మరో చరిత్ర’ను ఆదరించారు. ‘పొన్నియిన్ సెల్వన్’ ఓ తమిళ చారిత్రక కథ. దీనిని ఇతర భాషల వారూ ఆదరించాలనే నియమం లేదు కదా! దీనికి పోయి.. ఇతర భాషల ప్రజలను దూషించడం తగదు’ అని కమల్ సూచించారు.
సినీ పరిశ్రమలో రాజకీయాలు తగదు
చోళరాజులపై కూడా కమల్ హాసన్ పలు కామెంట్స్ చేశారు. చోళరాజులు హిందువులు కాదని ఆయన అన్నారు. రాజరాజ చోళుడి కాలంలో హిందుత్వం లేదని.. అప్పట్లో హిందూమతం అనేది లేదన్నారు. అప్పట్లో శైవం, వైష్ణవం మాత్రమే ఉన్నాయని చెప్పారు. మనదేశంలోకి బ్రిటిష్ వారు అడుగు పెట్టిన తర్వాత మనల్ని ఎలా పిలవాలో తెలియక హిందువులని సంబోధించారని కమల్ పేర్కొన్నారు. కళలకు భాష, కులం, మతం అనేవి లేవన్నారు. వీటి ప్రాతిపదికన ఫిల్మ్ ఇండస్ట్రీలో రాజకీయాలు చేయడం మంచిది కాదని మండిపడ్డారు.
Follow Us