Karthikeya 2 Movie Review : శ్రీకృష్ణుడి ద్వారకా నగరంలో తెలుగోడి సాహసయాత్ర 'కార్తికేయ 2' !

Karthikeya 2 : 'కార్తికేయ 2' చిత్రంలో నిఖిల్ సిద్ధార్థ, అనుపమా పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాసరెడ్డి ప్రధాన పాత్రలలో నటించారు.

నటీనటులు: నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాస్ రెడ్డి

నిర్మాతలు: అభిషేక్ అగర్వాల్, టిజి విశ్వ ప్రసాద్

సంగీత దర్శకుడు: కాలభైరవ

దర్శకత్వం : చందూ మొండేటి


రేటింగ్ : 3/5

యువ దర్శకుడు ‘చందు మొండేటి’ దర్శకత్వంలో కథానాయకుడు నిఖిల్ హీరోగా నటించిన థ్రిల్లర్ ‘కార్తికేయ 2’. ఈ రోజే ఈ సినిమా విడుదలైంది. ద్వారకా నగర రహస్యాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మరి ప్రేక్షకులను ఎంతవరకు అలరించిందో మనమూ చూద్దాం
 

కథ :

కార్తికేయ (నిఖిల్) ఒక వైద్యుడు. చాలా విషయాలను పరిశోధనాత్మకంగా ఆలోచించడం తనకు అలవాటు. ఏ సమస్యకైనా ఒక పరిష్కారం ఉంటుందని కచ్చితంగా నమ్ముతాడు. ఓ రోజు అనుకోకుండా తన తల్లితో కలిసి ద్వారకా యాత్రకు వెళ్లిన కార్తికేయ, ఓ హత్య కేసులో ఇరుక్కుంటాడు. ఇటువంటి సందర్భంలోనే ముగ్ధ (అనుపమ పరమేశ్వరన్) తనకు మార్గదర్శిగా నిలుస్తుంది. 

ఇక్కడ నుండి కథ ఆధ్మాత్మిక చింతన నుండి ప్రాక్టికాలిటీ వరకు ఒక కొత్త పంథాలో నడుస్తుంది. శ్రీకృష్ణుడి ఆజ్ఞ లేనిదే ప్రపంచాన ఏ పని జరగదని.. కార్తికేయను ద్వారకకు ఆ పరంధాముడే రప్పించాడని, ఒక కొత్త కోణంలో కథను మనకు దర్శకుడు చెప్పడానికి ప్రయత్నిస్తాడు. అసలు కార్తికేయ ద్వారకకు ఎందుకు వచ్చాడు? భగవంతుడు అతనికి నిర్దేశించిన లక్ష్యమేమిటో తెలుసుకోవాలంటే, ఈ సినిమా చూడాల్సిందే. 

సానుకూల అంశాలు
ఈ సినిమాకి ప్రధానమైన బలం కథ. అలాగే దర్శకుడు కథా, కథనాలను నడిపిన తీరు కూడా బోర్ కొట్టించకుండా, ఆసక్తికరంగానే సాగుతుంది. అలాగే నిఖిల్ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. కొన్ని యాక్షన్ సన్నివేశాలలో తన నటన అనుభవాన్ని మొత్తం చూపించాడు. కొన్ని సాహసాలు కూడా చేశాడు. అలాగే కథానాయిక అనుపమ పరమేశ్వరన్ కూడా తన పాత్రలో ఒదిగిపోయింది. కొన్ని సన్నివేశాలలో భావోద్వేగాలను కూడా పండించింది. 

ఇక బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఓ ప్రత్యేక పాత్రలో జనాలను అలరిస్తారు. ఈ పాత్ర ఓ అదనపు ఆకర్షణ. ఇక హర్ష, శ్రీనివాసరెడ్డి లాంటివారు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. 

అలాగే ఈ సినిమాలో చూపించిన విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. మంచి నిర్మాణ విలువలతో ఈ సినిమాను తెరకెక్కించిన సాంకేతిక వర్గపు శ్రమ, సినిమాలోని ప్రతీ ఫ్రేములో మనకు కనిపిస్తుంది.  నిజంగానే ప్రేక్షకుడిని ఒక కొత్త లోకంలోకి ఈ సినిమా తీసుకెళ్తుందనడంలో అతిశయోక్తి లేదు. 

ప్రతికూల అంశాలు
ప్రథమార్థంలో కొన్ని సన్నివేశాలు అనవసరమేమో అనే ఫీలింగ్‌ని ఈ సినిమా ప్రేక్షకులకు కలిగిస్తుంది. అలాగే ఇలాంటి సినిమాలలో మనం లాజిక్స్ వెతక్కూడదు.

సాంకేతిక అంశాలు :
విఎఫ్ఎక్స్ వర్క్ నూటికి నూరు శాతం ఈ సినిమాకి పూర్తి న్యాయం చేసింది. సంగీత దర్శకుడు కాలభైరవ కూడా మంచి ట్యూన్స్ అందించారు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. 

ఫైనల్ వర్డ్ :

తెలుగు చిత్ర పరిశ్రమకి ఇలాంటి కథలు కొత్తేమీ కాదు. గతంలో వెంకటేష్ కూడా ద్వారకా నగర నేపథ్యంలో వచ్చిన "దేవీ పుత్రుడు" చిత్రంలో నటించారు. కాకపోతే ‘కార్తికేయ 2’ విషయానికి వస్తే, ఇది ఒక కొత్త తరహా చిత్రం. ముఖ్యంగా టేకింగ్ విషయంలో దర్శకుడిని మెచ్చుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే, ద్వారకా నగరంలో ఓ తెలుగోడి సాహస యాత్రలను విజువల్ వండర్‌గా సెల్యూలాయిడ్ పై ఆవిష్కరించిన సినిమా ఇది. ఏదేమైనా, ఇలాంటి వైవిధ్యమైన కథాంశాన్ని ఎంచుకున్న దర్శకుడిని మనం అభినందించాల్సిందే. 

Read More: 'కార్తికేయ 2' రిలీజ్‌ను కొంద‌రు సినీ పెద్ద‌లు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు : హీరో నిఖిల్ (Nikhil Siddharth)

You May Also Like These