బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ‘ద కశ్మీర్ ఫైల్స్’ చిత్రం ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో తెలిసిందే. తక్కువ బడ్జెట్‌తో లిమిటెడ్ స్క్రీన్స్‌లో విడుదలైన ఈ మూవీ.. మౌత్ పబ్లిసిటీతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకుంది. కరోనా తర్వాత అయోమయ పరిస్థితులు నెలకొన్న సమయంలో ‘ద కశ్మీర్ ఫైల్స్’ విజయంతో హిందీ చిత్రపరిశ్రమ ఊపిరి పీల్చుకుంది.
బిగ్ స్టార్స్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద చతికిలపడుతున్న టైమ్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా ‘ద కశ్మీర్ ఫైల్స్’ రిలీజైంది. చిన్న చిత్రమైనప్పటికీ కంటెంట్ బాగుండటంతో ప్రేక్షకులు ఈ మూవీని విపరీతంగా ఆదరించారు. కశ్మీర్ పండిట్ల ఊచకోత అంశాన్ని వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన విధానానికి ప్రేక్షకులతోపాటు విమర్శకుల నుంచీ ప్రశంసలు వచ్చాయి. అలాంటి ఈ చిత్రాన్ని పట్టుకుని అదో ప్రచార ఆర్భాటమని, దరిద్రమైన సినిమా అంటూ నోరు పారేసుకున్నారు ఇజ్రాయెల్ ఫిల్మ్ మేకర్ నదావ్ లపిడ్. దీంతో ఆయన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
‘కశ్మీర్ ఫైల్స్’ చూసి దిగ్ర్భాంతికి గురయ్యా: నదావ్ లపిడ్
గోవా వేదికగా జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి నదావ్ లపిడ్ జ్యూరీ హెడ్‌గా ఉన్నారు. చిత్రోత్సవం ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమాను ‘ప్రోపగాండా’, ‘వల్గర్ సినిమా’గా అభివర్ణించారు. ఈ మూవీ చూసి తామంతా కలవరపడ్డామని, దిగ్భ్రాంతికి గురయ్యామని ఆయన అన్నారు. ప్రచార ఆర్భాటం కలిగిన అసభ్యకరమైన సినిమా ఇది అని పేర్కొన్నారు. ప్రతిష్ఠాత్మకమైన చలనచిత్రోత్సవంలో కళాత్మక పోటీ విభాగానికి ఈ సినిమా ఎంపికవ్వడం తనకు సముచితంగా అనిపించలేదన్నారు. ఈ వేదిక పైనుంచి తన భావాలను అందరితో పంచుకోవాలని అనిపించిందని పేర్కొన్నారు. విమర్శనాత్మక చర్చను కూడా ఆమోదించడం ఈ ఫిల్మ్ ఫెస్టివల్ స్ఫూర్తి అని నదావ్ స్పష్టం చేశారు.
నదావ్ వ్యాఖ్యలు సరికాదు: అనుపమ్ ఖేర్
నదావ్ వ్యాఖ్యలను బాలీవుడ్ ప్రముఖ నటుడు, ‘ద కశ్మీర్ ఫైల్స్’లో ప్రధాన పాత్ర పోషించిన అనుపమ్ ఖేర్ తీవ్రంగా ఖండించారు. ముందస్తు పథకం ప్రకారమే చలన చిత్రోత్సవంలో ఈ సినిమాపై విమర్శలు చేశారని ఆయన ఆరోపించారు. నదావ్ కామెంట్స్ సరికాదని, ఇది సిగ్గుచేటని అన్నారు. భగవంతుడు ఆయనకు జ్ఞానం ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మారణహోమం సరైనదైతే కశ్మీరీ పండిట్ల వలస కూడా సరైనదేనని అనుపమ్ ఖేర్ వివరించారు.
Follow Us