హాలీవుడ్ చిత్రం ‘అవతార్’ (Avatar) గురించి తెలియని సినీ ప్రేక్షకుడు ఉండరంటే అతిశయోక్తి కాదు. 2009లో ఆడియెన్స్ ముందుకొచ్చిన ఈ చిత్రం సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కాదు. భాషలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ప్రతి చోట ‘అవతార్’ విజయఢంకా మోగించింది. ‘టైటానిక్’ సినిమా తీసిన జేమ్స్ కామెరాన్‌యే (James Cameron) ఈ మూవీని కూడా తెరకెక్కించారు. ఆయన తొమ్మిదేళ్ల కృషికి నిదర్శనమే విజువల్ వండర్ ‘అవతార్’. భారతీయ ప్రేక్షకులనూ ఈ సినిమా ఉర్రూతలూగించింది.
‘అవతార్’ మూవీకి త్వరలో సీక్వెల్ రానుంది. అవతార్ 2 (ది వే ఆఫ్ వాటర్) పేరుతో సీక్వెల్‌ను ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 160 దేశాల్లో ఈ సంవత్సరం డిసెంబర్ 16న ‘అవతార్ 2’ (Avatar 2) గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. హై ఎండ్ టెక్నాలజీతో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ బిజినెస్ వివిధ దేశాల్లో రికార్డులు సృష్టిస్తోందని ట్రేడ్ నిపుణులు అంటున్నారు.
రైట్స్ కోసం అన్ని కోట్లు పెడుతున్నారా?
తెలుగు రాష్ట్రాల్లోనూ ‘అవతార్ 2’కు విపరీతమైన హైప్ నెలకొంది. అందుకే ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్‌ను దక్కించుకునేందుకు డిస్ట్రిబ్యూటర్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారట. ‘అవతార్ 2’ తెలుగు డబ్బింగ్ వెర్షన్‌కు సుమారు రూ.100 కోట్లకు పైగా ధర పలుకుతున్నట్లు వినికిడి. పలువురు బడా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కలసి ఈ మూవీని కొనే ఆలోచనలో ఉన్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం. దీనికి సంబంధించిన వార్తలు కొన్ని రోజులుగా నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. వీటిల్లో ఎంత నిజముందో ఇంకా తెలియరాలేదు.
భారత్‌లో భారీ క్రేజ్
మన దేశంలో హాలీవుడ్ సినిమాలకు మార్కెట్ బాగానే ఉంటుంది. అయితే వచ్చిన ప్రతి సినిమా ఆడేస్తుందని మాత్రం చెప్పలేం. మార్వెల్ స్టూడియోస్, డీసీ నుంచి వచ్చే బిగ్ కాన్వాస్ సినిమాలను చూసేందుకే మన ఆడియెన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా సూపర్ హీరోస్ మూవీలను మన వాళ్లు ఎగబడి చూస్తున్నారు. అందుకే ఆ సినిమాలు ఇక్కడ కోట్లాది రూపాయలను కలెక్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఆ కోవలో వస్తున్న ‘అవతార్ 2’తో ఇండియాలో ఎన్ని వందల కోట్లు వసూలు చేస్తుందో చూడాలి.
Follow Us