టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) టైటిల్ రోల్ పోషించిన తాజా చిత్రం ‘యశోద’. పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నవంబర్ 11న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది. సరోగసి నేపథ్యంలో హరి-హరీష్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది.
ఓవర్సీస్ సహా తెలుగులో కూడా ‘యశోద’ (Yashoda Movie) మంచి వసూళ్లు సాధించి సమంత కెరీర్‌లో భారీ హిట్‌గా నిలిచింది. అయితే ఇప్పుడీ చిత్రంపై కేసు నమోదవ్వడం షాకింగ్‌గా మారింది. ఈ సినిమాలో ‘ఈవా ఐవీఎఫ్ హాస్పిటల్స్’ పేరిట ఓ సరోగసి కేంద్రాన్ని చూపించారు. అందులో జరిగే అక్రమాలు అంటూ కొన్ని షాకింగ్ విజువల్స్ మూవీలో ఉంటాయి. దీంతో నిజ జీవితంలోనూ ‘ఈవా’ (EVA IVF Hospital) పేరిట ఉన్న ఓ ఆస్పత్రి ఇది అభ్యంతరకరంగా ఉందని ఆరోపించింది.
‘యశోద’ చిత్రం వల్ల బయట తమ గౌరవం పోతుందని పేర్కొంటూ ఈవా ఆస్పత్రి యాజమాన్యం హైదరాబాద్ కోర్టును ఆశ్రయించింది. ఈ మూవీతో తమ సంస్థ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందని ఈవా హాస్పిటల్ ఎండీ మోహన్ రావు.. ‘యశోద’ మూవీ నిర్మాత, హీరోయిన్ సమంతతోపాటు దర్శకులు హరీశ్ నారాయణ్, హరి శంకర్‌లపై రూ.5 కోట్ల పరువు నష్టం దావా వేశారు. దీంతో ‘యశోద’ ఓటీటీ విడుదలను వాయిదా వేయాలని ఆదేశాలు జారీ చేస్తూ కోర్టు తీర్పు కూడా ఇచ్చింది. డిసెంబర్ 19 వరకు ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయొద్దని మేకర్స్‌కు నోటీసులు జారీ చేసింది.
కాన్సెప్ట్ ప్రకారం పెట్టాం: నిర్మాత కృష్ణ ప్రసాద్
‘యశోద’ సినిమా వివాదంపై తాజాగా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ స్పందించారు. తమ చిత్రంలో ‘ఈవా’ అనే పేరును కాన్సెప్ట్ ప్రకారం పెట్టామని.. అంతేగానీ వేరొకరి మనోభావాలను దెబ్బతీయడానికి కాదన్నారు. ఈవా హాస్పిటల్ యాజమాన్యాన్ని తాను కలిశానని.. ఇక భవిష్యత్తులో ఈవా అనే పదం ‘యశోద’ సినిమాలో కనిపించదని కృష్ణ ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు.
మా ప్రొఫెషన్‌ను గౌరవించాలి: ‘ఈవా’ ఎండీ మోహన్ రావు
‘మా నిర్ణయాన్ని ఈవా ఆస్పత్రి యాజమాన్యం వారు కూడా అంగీకరించారు. ఈ సమస్య ఇంతటితో సమసిపోయింది. ఇది తెలియక జరిగిన పొరపాటు’ అని కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఆ తర్వాత ఈవా హాస్పిటల్ ఎండీ మోహన్ రావు మాట్లాడుతూ.. ‘యశోదలో మా హాస్పిటల్ పేరు వాడటంతో మేం హర్ట్ అయ్యాం. నిర్మాత చాలా తొందరగా సమస్యను క్లియర్ చేశారు. డాక్టర్స్ అందరూ కూడా ప్రాణాలు కాపాడాలని కోరుకుంటారు. సినిమా వాళ్లు కూడా మా ప్రొఫెషన్‌ను గౌరవించాలి’ అని వ్యాఖ్యానించారు. మొత్తానికి ఈ వివాదం సమసిపోవడంతో.. ‘యశోద’ ఓటీటీ విడుదలకు ఏర్పడిన అడ్డంకులు తొలగిపోయాయి.
Read more: అందంతోనే కాదు విలనిజంతోనూ మెప్పించిన టాప్6 హీరోయిన్లు
Follow Us