దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలైన అన్ని కేంద్రాలలో హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. రష్మికా మందాన, సుమంత్ కీలకపాత్రలు పోషించిన సీతారామం సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కూడా పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను సాధించింది.
సీతారామం సినిమాపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పరుచూరి పలుకులు అనే యూట్యూబ్ చానల్ ద్వారా సినిమాలపై అభిప్రాయాలను తెలియజేస్తున్నారు ఆయన. తాజాగా సీతారామం సినిమాపై పరుచూరి చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
హృదయానికి హత్తుకునే ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీతారామం సినిమా తనకూ నచ్చిందని అన్నారు పరుచూరి. హృద్యమైన ప్రేమ కథ, ఆకట్టుకునే యుద్ధ నేపథ్యం, ప్రేక్షకులకు గుర్తుండిపోయే సన్నివేశాలు, క్లైమాక్స్ విషాదాంతం సీతారామం సినిమాను మరపురాని చిత్రంగా చేశాయని పొగిడారు పరుచూరి.
‘వీర్ జారా’ కూడా ఇలాగే..
గతంలో కూడా ఇటువంటి కథాంశం, నేపథ్యంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు హిట్ అయ్యాయని గుర్తుచేశారు పరుచూరి. షారుక్ ఖాన్, ప్రీతి జింటా, రాణీ ముఖర్జీ నటించిన ‘వీర్ జారా’ సినిమా దాదాపుగా ఇదే కథతో తెరకెక్కిందని అన్నారు. అయితే ఆ సినిమాలో క్లైమాక్స్ సుఖాంతం అవుతుందని చెప్పారు పరుచూరి గోపాలకృష్ణ.
సీతారామం సినిమాలో క్లైమాక్స్ విషాదాంతం కావడంతో భిన్నమైన ప్రేమ కథా చిత్రంగా నిలిచిందని తెలిపారు. అయితే సినిమా చివరిలో హీరోహీరోయిన్లు కలిసినట్టుగా చూపించి ఉంటే సినిమా వేరే స్థాయిలో నిలిచేదని అభిప్రాయం వ్యక్తం చేశారు పరుచూరి.
చక్కని ప్రేమకావ్యంగా సీతారామం సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు హను రాఘవపూడి వంద శాతం సక్సెస్ అయ్యారని ప్రశంసించారు పరుచూరిగోపాలకృష్ణ. హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), మృణాల్ ఠాకూర్, రష్మికా మందాన తమతమ క్యారెక్టర్లలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారని చెప్పారు.
Read More : కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) సీతారామం సినిమా..రూ.60 కోట్ల క్లబ్‌లో చోటు
Follow Us