ప్రతి ఏడాది వందలాది సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని మాత్రమే సక్సెస్ సాధిస్తాయి. అయితే విజయవంతమైన ప్రతి సినిమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుందని చెప్పలేం. దర్శకులు, నటులు తమ చిత్రాలు అందరికీ గుర్తుండిపోవాలనే తీస్తారు. కానీ ఎప్పటికీ మర్చిపోలేని క్లాసిక్స్ కొన్ని మాత్రమే ఉంటాయి. అలా అరుదైన క్లాసిక్స్‌గా నిలిచే మూవీస్‌లో ‘సీతారామం’ను ఒకటిగా చెప్పడం ఎంతమాత్రం అతిశయోక్తి లేదు.
అందమైన ప్రేమకావ్యంగా ఆడియెన్స్ హృదయాలను హత్తుకుంది ‘సీతారామం’ (Sita Ramam). ఎన్నేళ్లు గడిచినా ఈ సినిమా వారి గుండెల్లో నిలిచిపోతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న చిత్రంగా రిలీజైన ఈ మూవీ సూపర్ హిట్టయ్యింది. సిల్వర్ స్క్రీన్‌పై దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంట సృష్టించిన లవ్ మ్యాజిక్‌కు అంతా ముగ్ధులయ్యారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి (Hanu Raghavapudi) డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ చేసిన ఈ సినిమా గురించి ఓ టాక్ షోలో హను ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
‘నాకు పుస్తకాలు చదవడం అలవాటు. అలా ఓ రోజు కోఠిలో సెకండ్ హ్యాండ్ పుస్తకం ఒకటి కొన్నా. అందులో ఓ లేఖ ఉంది. అది ఓపెన్ చేసి కూడా లేదు. హాస్టల్లో ఉంటున్న అబ్బాయికి వాళ్ల అమ్మ రాసిన లేఖ అది. సెలవులకు ఇంటికి రమ్మని ఆమె రాశారు. కానీ అది చదివాక నాకు ఓ ఆలోచన వచ్చింది. ఒకవేళ ఆ లెటర్లో ఏదైనా ముఖ్యమైన సమాచారం ఉంటే ఎలా అని అనుకున్నా! ఆ ఆలోచనే ‘సీతారామం’ సినిమా రూపొందడానికి మూలకారణం. స్టోరీ రాసుకున్నాక నిర్మాత స్వప్న గారికి చెప్పా. ఆమె వెంటనే చేద్దాం అన్నారు’ అని హను రాఘవపూడి చెప్పుకొచ్చారు.
‘సీతారామం కథకు హీరోగా దుల్కర్ (Dulquer Salmaan) సరిగ్గా సరిపోతారని అనిపించింది. అందుకే ఆయన్ను సెలెక్ట్ చేశాం. సీత పాత్ర కోసం కొత్తగా ఉండాలని అనుకుంటుంటే స్వప్న.. మృణాల్ (Mrunal Thakur) గురించి చెప్పారు. ఆమెను చూడగానే ఆ క్యారెక్టర్‌కు సరిగ్గా సరిపోతారని అనిపించింది’ అని హను తెలిపారు. ఇక తెలుగు అమ్మాయిని ఎందుకు తీసుకోలేదనే ప్రశ్నకు సమాధానంగా.. ‘తెలుగు వాళ్ల ప్రొఫైల్స్ ఎక్కడా కనిపించలేదు. ఫలానా అమ్మాయి ఉందని తెలిస్తే తను పాత్రకు సరిపోతుందా లేదా అని చూడొచ్చు. కానీ ఎక్కడ కూడా తెలుగు అమ్మాయిల ప్రొఫైల్స్ కనిపించలేదు. తెలుగు వాళ్లు దొరికితే మాకే హాయే. ఎందుకంటే వాళ్లకు భాష వస్తుంది’ అని హను వివరించారు.
Follow Us