Horror Movies: హారర్ సినిమాలు అంటే మీకు అమితమైన ఇష్టమా..? తెలుగులో విడుదలయ్యే ప్రతీ హారర్ చిత్రం కూడా చూస్తుంటారా..? గుండె ధైర్యం ఉన్నవారికి హారర్ సినిమాలు బాగానే ఉంటాయి. ధైర్యం లేనివాళ్లు కూడా పక్కన ఇంకొకర్ని కూర్చోబెట్టుకునో, లేకపోతే పట్టపగలు లైట్లు వేసుకుని మరీ ఈ చిత్రాలను చూసే ధైర్యం చేస్తుంటారు.
ఒక హారర్ సినిమా చూడాలంటేనే ఇంత తతంగం ఉంటుంది. నిజం చెప్పాలంటే.. దెయ్యాలు, భూతాలను ప్రధాన కథ వస్తువుగా తీసుకొని తీసే ఈ హారర్ చిత్రాల్లో సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రాలు టాలీవుడ్‌లో కొన్ని ఉన్నాయి. అలాంటి చిత్రాలలో కొన్నింటిని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..!
జగన్మోహిని (1978) - జానపద బ్రహ్మగా ప్రసిద్ధుడైన బి.విఠలాచార్య ఈ సినిమాను తన సొంత బ్యానర్‌పై నరసింహ రాజు కథానాయకుడిగా నిర్మించి, దర్శకత్వం వహించారు. దాదాపు జానపద చిత్రాల ట్రెండ్ ఆగిపోయిన తరుణమది. అందులోనూ నరసింహరాజుకు హీరో ఇమేజ్ లేదు. కానీ ఈ సినిమా మంచి విజయం సాధించింది. జయమాలిని (Jayamalini), ప్రభ ఈ చిత్రంలో కథానాయికలుగా నటించారు. ఈ సినిమా కథ పాతివ్రత్యం, అద్భుత శక్తులు, దేవతలు, దయ్యాలు, భక్తి అనే ఇతివృత్తాల చుట్టూ తిరుగుతుంది.
ఒక పల్లెటూరి అందగాడిని ఒక కామపిశాచి ఆశించి తన వలలో వేసుకొంటుంది. పతివ్రతా శిరోమణి అయిన అతని భార్య తను నమ్మిన దైవాన్ని కొలిచి తన భర్తను మళ్ళీ తనవాడిగా చేసుకొంటుంది. ఈ సినిమాలో కోతి, పాము లాంటి జంతువులు కూడా కీలక పాత్రలే పోషించాయి. పూర్తి స్థాయి హారర్ చిత్రంగా అప్పట్లోనే ఈ చిత్రం ఆదరణ పొంది, సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. టెక్నాలజీ కూడా పెద్దగా లేని ఆ రోజుల్లో.. విఠలాచార్య చేసిన పలు కెమెరా ట్రిక్స్ కోసం ఈ చిత్రాన్ని కచ్చితంగా చూడవచ్చు.
కాష్మోరా (1986) - యండమూరి వీరేంద్రనాథ్ కలం నుండి జాలువారిన సంచలన నవల "తులసి" ఆధారంగా 1986లో ఎన్ బి చక్రవర్తి దర్శకత్వం వహించిన చిత్రం "కాష్మోరా". చేతబడి లాంటి మూఢనమ్మకాలపై అప్పట్లో తీసిన ఈ చిత్రం ఎన్నో చర్చలకు కూడా దారి తీసింది. సైన్స్ ప్రాముఖ్యతను గురించి కూడా ఈ చిత్రంలో దర్శకుడు చెప్పడానికి ప్రయత్నించడం గమనార్హం. రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) ఈ చిత్రంలో దార్కా అనే ఓ మాంత్రికుడి పాత్రలో కనిపిస్తారు.
చేతబడులు చేసే భీకర మాంత్రికుడు దార్కా పాత్రలో నటకిరీటి ఇందులో ప్రేక్షకులను ఒళ్ళు జలదరించేలా భయపెడతాడు. ఏ స్థాయిలో అంటే.. ప్రతీకారంతో రగిలిపోయే పాత్రలో మనం చూస్తోంది రాజేంద్రప్రసాద్‌నేనా అనేంతగా. రాజశేఖర్, భాను ప్రియ, శుభలేఖ సుధాకర్ ఈ చిత్రంలో ఇతర ముఖ్య తారాగణం. ఈ సినిమా గొప్ప విజయం సాధించకపోయినా రాజేంద్రప్రసాద్ నటన మాత్రం అద్భుతంగా ఉంటుంది.
రక్ష (2008) - వన్ మోర్ థాట్ ఎంటర్టైన్మెంట్, జెడ్ 3 పిక్చర్స్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆజమ్ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. దీనిని రామ్ గోపాల్ వర్మ (Ramgopal Varma) సమర్పించాడు. దర్శకత్వం ఆకెళ్ళ వంశీకృష్ణ. ఈ చిత్రంలో జగపతి బాబు, కళ్యాణి ప్రధాన పాత్రల్లో నటించగా, బోపి తుతుల్ సంగీతం అందించాడు.
ఈ సినిమా కథానాయకుడు రాజీవ్ నాస్తికుడు, కానీ అతని భార్యకూ, తల్లికీ దేవుడు, చేతబడి మొదలైనవాటిపై విపరీతమైన నమ్మకం. నిర్మాణ స్థలంలో ఓ రోజున, అతని సహాయకుడు శ్యామ్ (నర్సింగ్ యాదవ్) ఒక పురాతన వినాయక విగ్రహం కనబడిందని చెబుతాడు. వినాయకుడికి ఆలయం నిర్మించాలని రాజీవ్‌కు సలహా ఇస్తూ, నిర్మించకపోతే వారికి కీడు జరుగుతుందని కూడా చెబుతాడు. అయితే, రాజీవ్ అతడి మాటలను పెడచెవిన పెడతాడు.
ఈ సంఘటన తరువాత, అకస్మాత్తుగా ఒక రోజున, రాజీవ్ ఇంట్లో వింత సంఘటనలు జరుగుతాయి. రాజీవ్ కూతురు రక్ష అసాధారణంగా ప్రవర్తించడం ప్రారంభిస్తుంది. చివరగా, రాజీవ్ అద్భుతాలనూ, చేతబడినీ నమ్మడం ప్రారంభిస్తాడు. వినయ్ అతన్ని బాబా (ప్రదీప్ రావత్) అనే క్షుద్ర మాంత్రికుడి వద్దకు తీసుకు వెళ్తాడు. ఇది వేణు, మధులు చేసిన చేతబడి అని తెలుసుకుంటాడు. రాజీవ్ కారు డ్రైవరు మణి (శేఖర్) వారికి సహాయం చేస్తాడు. రాజీవ్, రక్షను ఈ భయానక స్థితి నుండి ఎలా కాపాడతాడనేది మిగతా కథ.
రాత్రి (1992) - రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన "రాత్రి" చిత్రం కల్ట్ క్లాసిక్ చిత్రంగా నిలిచింది. ఇందులో రేవతి, ఓంపురి, అనంత్ నాగ్ మొదలైన వారి నటన సినిమాకే హైలెట్ అని చెప్పవచ్చు. హారర్ చిత్రమైనా చాలా సహజమైన రీతిలో తీయడానికి దర్శకుడు ప్రయత్నించారు. హర్రర్ సినిమాకు అవసరమైనట్లుగా, గందరగోళం, అయోమయం, బాధిత వ్యక్తుల దుస్థితి మొదలైన వాటితో దర్శకుడు భయాన్ని సృష్టించాడు. 'రాత్రి' తెలుగు, హిందీల్లో ఏకకాలంలో తీసిన సినిమా. బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన ఈ సినిమాకు మణి శర్మ సంగీతం అందించాడు.
ఆ ఇంట్లో (2009) - ఈ సినిమాకి నటుడు చిన్నా దర్శకత్వం వహించారు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాగానే వసూళ్లను రాబట్టింది. కానీ.. ఈ చిత్రం తర్వాత చిన్నా ఏ ఇతర చిత్రానికి కూడా దర్శకత్వం వహించలేదు. యు9 ఎంటర్‌టైనర్స్ పతాకంపై నరెద్దుల శ్రీనివాసరెడ్డి, వి.రాజు చౌదరి, పి.మనోజ్ కుమార్ రెడ్డి, ఎ.జితేంద్రరెడ్డిలు నిర్మించిన ఈ చిత్రానికి కథ, మాటలు, చిత్రానువాదంతో పాటు దర్శకత్వ శాఖకు కూడా చిన్నాయే బాధ్యతలు వహించాడు. వినోద్ కుమార్, చిన్నా, ఆషాసైని ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కోటి సంగీతాన్ని అందించాడు.
మంత్ర (2007) - ఓషో తులసీ రామ్ దర్శకత్వంలో ఛార్మీ ప్రధాన పాత్రలో నటించిన "మంత్ర" చిత్రం కూడా సూపర్ హిట్ హారర్ చిత్రంగా నిలిచింది. ఇదే చిత్రానికి గాను ఛార్మీ కౌర్ (Actrss Charmi) 2007లో ఉత్తమ నటిగా నంది అవార్డు కూడా అందుకున్నారు. ఇదే చిత్రానికి 2015లో సీక్వెల్ కూడా తీయడం జరిగింది.
దెయ్యం (1996) - రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జె.డి. చక్రవర్తి (JD Chakravarthy), మహేశ్వరి ప్రేమికులుగా నటించారు. ఈ సినిమా హీరోయిన్ మహేశ్వరి తన అక్కా, బావలతో కలిసి ఉంటూ ఉంటుంది. ఓ రోజు వారు ఇల్లు బదిలి అవుతారు. ఆ ఇల్లు ఎక్కడో సిటీకు దూరంగా ఉండే బంగళా. కానీ అది ఒకప్పుడు శ్మశానం ఉన్న ప్రదేశం అని, ఆ బంగ్లా దెయ్యాలకు, భూతాలకు నెలవైందని వారికి తెలియదు.
అప్పుడప్పుడు వారికి కొన్ని విచిత్రమైన పరిస్థితులు ఎదురువతూ ఉంటాయి. హఠాత్తుగా ఓ రోజు వారి 5 ఏళ్ల కొడుకు చనిపోతాడు. ఆ తర్వాత అనూహ్య రీతిలో ఒక్కొక్కరు మృత్యువాత పడి అందరు చనిపోతారు. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే రాం గోపాల్ వర్మ చాలా సన్నివేశాలు సున్నితంగా తీసారు. కాకపొతే చివరి అంకంలో మాత్రం అందరిని దెయ్యాలుగా చూపించడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది.
అవును (2012) - రవిబాబు దర్శకత్వంలో వచ్చిన "అవును" చిత్రం హారర్ చిత్రాలలోనే ఒక స్పెషల్ చిత్రమని చెప్పుకోవచ్చు. కెప్టెన్ రాజు అనే ఓ ఆగంతకుడి ఆత్మ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ బ్యానరుపై రవిబాబు నిర్మించిన ఈ చిత్రానికి సురేష్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకుంది. ఇదే చిత్రానికి తర్వాత సీక్వెల్ కూడా వచ్చింది.
రాజు గారి గది (2015) - ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "రాజు గారి గది". పూర్తిస్థాయి హారర్ కామెడి చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఓంకార్ సోదరుడు ఆశ్విన్ బాబు కథానాయకుడిగా నటించారు. ఈ చిత్రం బాగానే సక్సైయింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా 2017లో "రాజు గారి గది 2" చిత్రాన్ని తీశారు ఓంకార్. ఈ చిత్రంలో నాగార్జున, సమంత నటించారు.
భాగమతి (2018) - ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ అనుష్క (heroine Anushka).. చంచల పాత్రలో నటించింది. ఆమె ఓ ఐఏఎస్ అధికారి. ఓ మంత్రి వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తుంది. సామాజిక కార్యకర్త శక్తితో ప్రేమలో పడుతుంది. రైతుల సంక్షేమం కోసం మంత్రి ఈశ్వర ప్రసాద్ చేపట్టిన ప్రాణధార ప్రాజెక్ట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తుంది. కానీ ఓ కారణంగా ప్రియుడు శక్తిని కాల్చి జైలుకెళ్తుంది. జైలులో రిమాండ్‌లో ఉన్న చంచలను, ఓ ఆపరేషన్ కోసం భాగమతి బంగ్లాకు తరలిస్తారు. ఈ క్రమంలో ఓ లక్ష్యం కోసం ఆమె ఏకంగా మంత్రికి ఎదురుతిరుగుతుంది.
భాగమతి బంగళా అంటే ఆ చుట్టుపక్కల ఉండేవారికి భయం. రాణీ భాగమతి దేవి దెయ్యమై తిరుగుతుందని అందరూ నమ్ముతుంటారు. లోపలికి వెళ్లిన చంచల కూడా, తన చుట్టూ అనుకోని ఘటనలు జరగడంతో భయానికి లోనవుతుంది. లోపల దెయ్యం ఉందని చంచల చెప్పినా ఎవరూ నమ్మరు.
నిజంగానే బంగళాలో దెయ్యం ఉందా? చంచలను భయపెట్టి, చిత్ర హింసలకు గురి చేసేదెవరు? భాగమతి బంగ్లాలో చంచలకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనే ప్రశ్నలకు సమాధానమే భాగమతి చిత్ర కథ.
Follow Us