Kalyan Ram Birthday Special: నటుడిగానూ, నిర్మాతగానూ రాణిస్తూ.. తాత బాటలో నడుస్తున్న మనవడు ‘కళ్యాణ్ రామ్’

కళ్యాణ్ రామ్ (Kalyan Ram) నటుడిగానే కాకుండా, వ్యాపారవేత్తగా కూడా సుపరిచితులు. అద్వైత్ క్రియేటివ్ స్టూడియోస్ పేరిట ఓ కంపెనీ ప్రారంభించారు.

నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyanram) ... స్వర్గీయ ఎన్టీఆర్ మనుమడు. తొలుత కెరీర్‌లో అనుకోని అపజయాలు పొందినా, ఆ తర్వాత స్వయంకృషితో ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థిరమైన స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అటు కథానాయకుడిగానూ, ఇటు నిర్మాతగానూ రాణిస్తూ పరిశ్రమలో నిలదొక్కుకుంటున్నాడు. బయట హీరోలను పెట్టి కూడా సినిమాలు తీస్తున్నాడు. ఇప్పడు తన కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రమైన 'బింబిసార' లో అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తున్నాడు. 

నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyanram) జన్మదినం సందర్భంగా, ఆయన జీవితానికి సంబంధించిన టాప్ 10 ఆసక్తికరమైన విషయాలు మీకోసం 

చైల్డ్ ఆర్టిస్టుగా

కళ్యాణ్ రామ్ చైల్డ్ ఆర్టిస్టుగా 'బాలగోపాలుడు' చిత్రంలో నటించాడు. ఈ చిత్రంలో తాను తన బాబాయ్ నందమూరి బాలకృష్ణతో కలిసి యాక్ట్ చేశాడు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి.

హరికృష్ణ తనయుడిగా సుపరిచితుడు

నందమూరి హరికృష్ణ మొదటి భార్య లక్ష్మికి ముగ్గురు బిడ్డలు. వారే జానకిరామ్, కళ్యాణ్ రామ్ (Kalyan Ram), సుహాసిని. జానకిరామ్ ఓ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. హరికృష్ణ రెండవ భార్య కుమారుడైన జూనియర్ ఎన్టీఆర్.. కళ్యాణ్ రామ్‌కు సోదరుడవుతాడు. 

తొలి చిత్రం ప్రత్యేకత ఏమిటంటే..

కళ్యాణ్ రామ్ (Kalyan Ram) నటించిన తొలి చిత్రం పేరు 'తొలిచూపులోనే'. ఉషాకిరణ్ మూవీస్ సంస్థ నిర్మించిన ఈ సినిమా ప్రొడ్యూసర్‌గా ఈనాడు సంస్థ అధినేత రామోజీరావుకి 75 వ సినిమా కావడం గమనార్హం. కాశీ విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అనుకున్నంత గొప్ప ఫలితాన్ని ఇవ్వలేదు. 

 

తండ్రి ప్రోద్బలంతో మాస్టర్స్ డిగ్రీ..

కళ్యాణ్ రామ్ ఇంజనీరింగ్ పూర్తి చేశాక, వెంటనే సినీ పరిశ్రమలోకి రావాలని భావించారట. కానీ ఆయన తండ్రి హరికృష్ణ తప్పకుండా మాస్టర్స్ డిగ్రీ చేయాలని పట్టుబట్టారట. తమ వంశంలో మాస్టర్స్ చేసినవారు ఎవరూ లేరని, కళ్యాణ్ రామ్ తన కోరికను తీర్చాలని కోరారట. దీంతో కళ్యాణ్ రామ్ చికాగోలోని ఇలినాయిస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి మాస్టర్స్ డిగ్రీ చేశారట. 

తన చిత్రాలకు తానే నిర్మాత

కళ్యాణ్ రామ్ తాను నటించిన అనేక సినిమాలకు తానే నిర్మాతగా వ్యవహరించారు. తన తాత గారి పేరిట ప్రారంభించిన ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ బ్యానరులో కళ్యాణ్ అనేక చిత్రాలను నిర్మించారు. అతనొక్కడే, హరేరామ్, జయీభవ, కత్తి, ఓం, పటాస్, ఇజం మొదలైన సినిమాలను ఆయనే ప్రొడ్యూస్ చేశారు. 

పటాస్‌కు, టెంపర్‌కు పోలికలు

కళ్యాణ్ రామ్ (Kalyan Ram) నటించిన 'పటాస్' సినిమాకు, జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'టెంపర్' సినిమాకు చాలా దగ్గర పోలికలు ఉంటాయి. ఈ రెండు సినిమాకు సంబంధించిన బేసిక్ ప్లాట్ ఒకే విధంగా ఉంటుంది. 

 

ఇతర హీరోల సినిమాలకూ నిర్మాతగా..

కళ్యాణ్ రామ్  (Kalyan Ram) తన తాతగారి పేరిట ప్రారంభించిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కేవలం తన సినిమాలే కాకుండా ఇతర హీరోల సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేయడం గమనార్హం. రవితేజతో నిర్మించిన 'కిక్ 2' చిత్రంతో పాటు, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించిన 'జై లవకుశ' కూడా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీదే తెరకెక్కించారు. 

గ్రాఫిక్ డిజైనింగ్ సంస్థకు అధినేతగా

కళ్యాణ్ రామ్  (Kalyan Ram) నటుడిగానే కాకుండా, వ్యాపారవేత్తగా కూడా సుపరిచితులు. అద్వైత్ క్రియేటివ్ స్టూడియోస్ పేరిట ఆయన ఓ కంపెనీ ప్రారంభించారు. సినిమాలకు గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ లాంటి సాంకేతిక సహకారాన్ని అందించడం ఈ కంపెనీ పని. లెజెండ్, నాన్నకు ప్రేమతో లాంటి సినిమాలకు ఈ సంస్థే వీడియో ఎఫెక్ట్స్‌ను అందించింది. 

తన తండ్రి పాత్రను తానే పోషిస్తూ..

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కథానాయకుడు' ,'మహానాయకుడు' చిత్రాలలో కళ్యాణ్ రామ్ తన తండ్రి హరికృష్ణ పాత్రను పోషించడం విశేషం. ఈ రెండు చిత్రాలు స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవితకథ ఆధారంగా తెరకెక్కినవి కావడం గమనార్హం.

భారీ బడ్జెట్‌తో బింబిసార

కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్ సినిమాగా 'బింబిసార' తెరకెక్కుతోంది. దాదాపు రూ.40 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. 

ఇవండీ.. నందమూరి కళ్యాణ్‌రామ్ గురించిన విశేషాలు. నటుడిగానే కాకుండా, వ్యాపారవేత్తగానూ రాణిస్తూ, టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కళ్యాణ్ రామ్ కైవసం చేసుకున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. 

Read More: 'ఇక్కడ రాక్షసుడైనా భగవంతుడైనా ఈ బింబిసారుడు ఒక్కడే'.. అదరగొడుతున్న ట్రైలర్!

 

You May Also Like These