ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు కుమారుడుగా వెంకటేష్ (Venkatesh) తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మొదటి సినిమాతో నంది అవార్డును సాధించి వెంకటేష్ నటన పట్ల ఉన్న గౌరవాన్ని నిరూపించుకున్నారు. విజయవంతమైన చిత్రాలతో విక్టరీ వెంకటేష్‌గా మారారు. ఆ తర్వాత వెంకీగా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్నారు. వెంకటేష్ 70 సినిమాలలో నటించారు. తన నటనతో ఏడు నంది అవార్డులను సాధించారు.
Venkatesh: వెంకటేష్ సినిమాల్లో కొత్త హీరోయిన్లకు అవకాశం ఉండేది. ఫరా, టబు, దివ్యభారతి, గౌతమి, ప్రేమ, ఆర్తీ అగర్వాల్, ప్రీతి జింతా, కత్రినా కైఫ్, అంజలా జవేరి వంటి హీరోయిన్లు వెంకటేష్ సినిమాలతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.
వెంకటేష్ - సౌందర్యలది హిట్ పెయిర్. వీరిద్దరి కాంబోలో ఏడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. మీనాతో వెంకీ నాలుగు సినిమాలు చేశారు. ఆర్తీ అగర్వాల్, వెంకటేష్ కాంబోలో మూడు సినిమాలు విడుదల అయ్యాయి. వెంకటేష్ నటించిన సినిమాలు దాదాపు హిట్‌గా నిలిచాయి.
1. కలియుగ పాండవులు (Kaliyuga Pandavulu)
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు కుమారుడుగా వెంకటేస్ కలియుగ పాండవులు సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. 1986లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ సినిమా విడుదలైంది. ఈ చిత్రంలో వెంకటేష్‌కు జోడిగా ఖుష్బూ నటించారు. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి. రామానాయుడు నిర్మించారు. కె. చక్రవర్తి సంగీతం అందించారు.
కథ
విజయ్ (వెంకటేష్), భారతి ( ఖుష్బూ)లు ప్రేమించుకుంటారు. విజయ్ తండ్రి భారతి పేదింటి అమ్మాయి కారణంగా నిందలు వేస్తాడు. తండ్రి అహంకారాన్ని దించేందుకు విజయ్ తన స్నేహితులతో కలియుగ పాండవులుగా మారతారు. పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న చీడ పురుగలపై విరుచుకుపడతారు.
అవార్డులు - మొదటి సినిమాతోనే వెంకటేష్ ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు.
2. స్వర్ణకమలం (Swarnakamalam)
కళా తపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో స్వర్ణకమలం 1988లో విడుదలైంది. వెంకటేష్, భానుప్రియ అద్భుతంగా నటించారు. ఈ సినిమాను కేఎస్ రామారావు సమర్పణలో భాను ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై సీవీహెచ్ అప్పారావు నిర్మించారు. ఈ చిత్రానికి లోక్ సింగ్ ఛాయాగ్రాహకుడిగా, జి. జి. కృష్ణారావు ఎడిటరుగా పనిచేశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పాటలకు ఇళయరాజా అందించిన సంగీతం అప్పటికీ.. ఇప్పటికీ అద్భుతమే.
కథ
నాట్యం నేపథ్యంలో స్వర్ణకమలం సినిమాను తెరెక్కించారు. మీనాక్షి (భానుప్రియ), సావిత్రి (దేవీ లలిత) కూచిపూడి నాట్యంలో నిష్ణాతులైన శేషేంద్ర శర్మ కూతుళ్లు. సావిత్రికి కర్ణాటక సంగీతం లో, మీనాక్షికి కూచిపూడి నాట్యంలో శిక్షణ ఇస్తాడు. నాట్యం కడుపునింపుతుందా.. ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించాలనుకుంటుంది మీనాక్షి. ఇంటి పక్కన ఇంట్లోకి చంద్రశేఖర్ (వెంకటేష్) అనే చిత్రకారుడు అద్దెకు దిగుతాడు. మీనాక్షి నాట్యాన్ని అభిమానిస్తాడు. మీనాక్షికి ఆమె తండ్రి విలువతో పాటు నాట్యంతో ఏదైనా సాధించవచ్చన అర్థం అయ్యేలా చేస్తాడు.
అవార్డులు - స్వర్ణకమలం చిత్రానికి మూడు నంది పురస్కారాలు లభించాయి. ఉత్తమ చిత్రంగా బంగారు నంది అవార్డు, ఉత్తమ నటిగా భానుప్రియ, ప్రత్యేక జ్యూరీ పురస్కారం వెంకటేష్‌కు లభించాయి. దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు, సినిమా ఎక్స్‌ప్రెస్ పురస్కారాలను అందుకుంది.
3. ప్రేమ (Prema)
ప్రేమ సినిమాను 1989లో సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.రామానాయుడు నిర్మించారు. వెంకటేష్, రేవతి హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించారు.
కథ
పృథ్వి (వెంకటేష్) ఓ అనాథ. గాయకుడు కావాలనుకుంటాడు. మ్యాగీ (రేవతి) పరిచయం ప్రేమగా మారుతుంది. మ్యాగీ అనారోగ్యంతో హాస్పటిల్‌లో ఉన్న సమయంలో పృథ్వికి గాయకుడిగా తానేంటో నిరూపించుకునే అవకాశం వస్తుంది. ప్రేమతో ప్రియురాలిని, పాటతో ప్రేక్షకుల మనసుని గెలుచుకుంటాడు పృథ్వి.
అవార్డులు - ప్రేమ సినిమాలో నటించిన వెంకటేష్ ఉత్తమ నటుడిగా నంది పురస్కారం, ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్నారు.
4. ధర్మ చక్రం (Dharma Chakram)
ప్రేమ చిత్ర దర్శకుడుతో వెంకటేష్ తీసిన మరో సినిమా ధర్మచక్రం. ఈ సినిమాలో రమ్యకృష్ణ, ప్రేమ, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రల్లో నటించారు. 1996లో విడుదలైన ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.రామానాయుడు నిర్మించారు. కన్నడంలో కథానాయికగా నటించిన ప్రేమకు ఇదే తొలి తెలుగు సినిమా.
ఎం.ఎం. శ్రీలేఖ సంగీతం అందించారు. కెనడాలో షూటింగ్ జరిపిన తొలి చిత్రం ఇదే.
కథ
రాకేష్ (వెంకటేష్) ఓ న్యాయవాది. రాకేష్ తండ్రి ఓ రాజకీయ నాయకుడు. మధ్య తరగతి అమ్మాయి సురేఖ ( ప్రేమ)ను రాకేష్ ప్రేమిస్తాడు. రాకేశ్ తండ్రి సురేఖను వేశ్యగా చిత్రీకరించి ఆమె చావుకు కారణం అవుతాడు. రాకేష్ తండ్రిపై కోపంతో ఇంటి నుంచి వెళ్లిపోతాడు. సంధ్య(రమ్యకృష్ణ) రిపోర్టర్. రాకేష్‌ను సంధ్య ప్రేమిస్తుంది.ఓ న్యాయవాదిగా ధర్మం కోసం రాకేష్ చేసే పోరాటంపై ఈ చిత్రం సాగుతుంది.
అవార్డులు - వెంకటేష్ ఉత్తమ నటుడిగా నంది పురస్కారం, ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్నారు.
5. గణేష్ (Ganesh)
గణేష్ 1998లో తిరుపతి స్వామి దర్శకత్వంలో రిలీజ్ అయింది. ఈ చిత్రంలో వెంకటేష్, రంభ, మధుబాలలు నటించారు. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకటేష్ సోదరుడు డి. సురేష్ బాబు గణేష్ చిత్రాన్ని నిర్మించారు. గణేష్ అనేజర్నలిస్టుగా ఓ మెడికల్ మాఫియా గట్టు రట్టు చేసే కథలో వెంకటేష్ జీవించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.
అవార్డులు - ఉత్తమ నటుడిగా వెంకటేష్ నంది అవార్డు అందుకున్నారు.
6. రాజా (Raja)
Venkatesh: వెంకటేష్, సౌందర్య హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా రాజా. ఈ సినిమాను 1999 లో ముప్పలనేని శివ దర్శకత్వంలో విడుదల చేశారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఆర్.బి.చౌదరి నిర్మించిన రాజా అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. తమిళ్ సినిమా ఉన్నిడతిల్ ఎన్నై కొడుతేన్‌ను తెలుగులో రాజాగా తెరకెక్కించారు. ఫ్యామిలీ, కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రంగా తెరకెక్కించారు. దొంగగా ఉన్న వ్యక్తి మంచి మనిషిగా ఎలా మారతాడనే కథతో ఈ సినిమాను రూపొందించారు. ఎస్‌కే రాజ్‌కుమార్ స్వరపరిచిన పాటలు ప్రేక్షకులను మెప్పించాయి.
7. కలిసుందాం రా (Kalisundam Raa)
కుబుంబ కథా చిత్రంగా కలిసుందాం.. రా సినిమా తెరెకెక్కింది. ఉదయ్ శంకర్ దర్శకత్వంలో 2000లో విడుదలైన ఈ చిత్రంలో వెంకటేష్‌కు జోడిగా సిమ్రాన్ నటించారు. కుటుంబం కలిసి ఉండాలని కోరుకునే యువకుడి పాత్రలో వెంకటేష్ నటించారు. విశ్వనాథ్ కలిసుందాం.. రా చిత్రంలో నటించారు. ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం అందించారు. దగ్గుబాటి సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు.
అవార్డులు- ఉత్తమ జాతీయ చిత్రంగా కలిసుందాం.. రా అవార్డు సాధించింది. ఉత్తమ నటుడిగా వెంకటేష్ నంది బహుమతి అందుకున్నారు.
8. నువ్వు నాకు నచ్చావ్ (Nuvvu Naaku Nachav)
నువ్వు నాకు నచ్చావ్ సినిమా తర్వాత వెంకీ పేరుతో పాపులర్ అయ్యారు వెంకటేష్. ఈ సినిమా వెంకటేష్‌కు బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చింది. 93 కేంద్రాలలో 50 రోజులు, 57 కేంద్రాలలో 100 రోజులు, 3 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ నటించిన ప్రేమ కావ్యం నువ్వు నాకు నచ్చావ్. ఈ సినిమా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో 2001లో రిలీజ్ అయింది. ఈ చిత్రాన్ని స్రవంతి రవికిషోర్ శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ సమర్పణలో నిర్మించాడు. కోటి సంగీతం అందించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కథను అందించారు.
తండ్రి స్నేహానికి విలువనిచ్చే కొడుకు పాత్రలో వెంకటేష్ నటించారు. ఈ సినిమాకు బ్రహ్మానందం, వెంకటేష్‌ల కామెడీ పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచింది. వెంకటేష్ సలహా మేరకు మిస్టర్ బీన్ స్ఫూర్తితో . బ్రహ్మానందం పాత్రను చేర్చారు.
9.ఆడవారి మాటలకు అర్థాలే వేరులే (Adavari Matalaku Ardhale Verule)
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమా వెంకటేష్ కెరీయర్‌లో మరో బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. 200 కేంద్రాలలో 50 రోజులు ఆడింది. 21 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. దాదాపు 30 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. 2007లో శ్రీ రాఘవ దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమాలో వెంకటేష్, త్రిష జంటగా నటించారు. ఈ చిత్రాన్ని శ్రీ సాయిదేవ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎన్.వి.ప్రసాద్, శానం నాగ అశోక్‌కుమార్‌లు నిర్మించారు. యువన్ శంకర్ రాజా సంగీతానికి మంచి గుర్తింపు వచ్చింది.
కథ
మధ్య తరగతి యువకుడు గణేష్ (వెంకటేష్) జీవితానికి సంబంధించిన కథ. ఉద్యోగం లేకుండా నిరుద్యోగిగా తిరుగుతూ అందరికీ చులకనవుతూ తండ్రి (కోట శ్రీనివాసరావు) తో తిట్టించుకుంటూ ఉంటాడు. గణేష్ కీర్తి (త్రిష కృష్ణన్)ని ప్రేమిస్తాడు. ఆమె సాప్టువేర్ కంపెనీలో పని చేస్తుందని తెలుసుకొని ఆ కంపెనేలో ఉద్యోగంలో చేరుతాడు. తన స్నేహితుడితో ఎంగేజ్‌మెంట్ అయిందని తెలుసుకుని గణేష్ బాధపడుతుంటాడు. విశ్వనాథ్ కీర్తి తాతయ్య పాత్రలో నటించారు. కట్టుబాట్లు, ఆచారాలు ఉన్న కుటుంబ సభ్యుల మధ్య గణేష్ ఎలా కీర్తిని పెళ్లి చేసుకుంటాడనే కథే ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమా.
అవార్డులు - వెంకటేష్ ఉత్తమ నటుడిగా నంది పురస్కారం అందుకున్నారు.
10. ఎఫ్2 (F2)
Venkatesh: వెంకటేష్ సీరియస్ పాత్రలతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తన సినిమాల్లో కొంచెం కొంచెం కామెడీని మిక్స్ చేసుకుంటూ వచ్చారు. కామెడీ చేయడంలో వెంకటేష్ స్టైలే వేరు. F2 – ఫన్ అండ్ ఫ్రస్టేషన్ చిత్రంలో ఫుల్ కామెడీ రోల్‌లో వెంకటేష్ నటించి మెప్పించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా 2019లో విడుదలైంది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. వెంకటేష్ ఎమ్మెల్యే పీఏ పాత్రలో నటించారు. కామెడీతో పెళ్లి బంధం విలువ ఏంటో వెండితెరపై చూపించారు అనిల్ రావిపూడి. వెంకటేష్, తమన్నా, వరుణ్ తేజ్, మెహ్రీన్ పిర్జాదా, గద్దె రాజేంద్ర ప్రసాద్‌లు కామెడీతో అదరగొట్టారు.
Read More: ప్రేమించుకుందాం రా.. 25 ఏళ్ల సెలబ్రేషన్స్‌లో వెంకీ మామ (Venkatesh)
Follow Us