Jayam Movie: టాలీవుడ్‌లో హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుంటాడు యూత్ స్టార్ నితిన్. నితిన్ కథానాయకుడిగా పరిచయమైన సినిమా 'జయం'. ఈ చిత్రం విడుదలై నేటికి సరిగ్గా 20 ఏళ్ళు. హీరోగా నితిన్‌కూ 20 ఏళ్ళు. జూన్ 14, 2002 తేదిన విడుదలైన జయం (Jayam) అప్పట్లో ఓ సంచలనం.
'చిత్రం, నువ్వు నేను' విజయాలతో అప్పటికే ఊపుమీదున్న దర్శకుడు తేజ. 'జయం' మూవీతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆయన గత రెండు చిత్రాలకు మించి 'జయం' అతిపెద్ద విజయం నమోదు చేసింది. సదా (Heroine Sadaa) కూడా ఈ చిత్రంతోనే వెండితెరకు కథానాయికగా పరిచయమైంది. దర్శకుడు ఆమెకు ఈ చిత్రం ద్వారా హీరోయిన్‌గా తొలి అవకాశం ఇచ్చారు. లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్‌గా జయం తెరకెక్కింది.
'తొలివలపు' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ (Hero Gopichand) ఆ సినిమా పరాజయం నేపథ్యంలో... రెండో చిత్రానికే విలన్ పాత్రలు చేయడం మొదలుపెట్టాడు. హీరోయిన్ సదా బావగా, రూత్ లెస్ విలన్‌గా గోపీచంద్ నటన అద్భుతం.
ఇక ఆర్పీ పట్నాయక్ పాటలు ఓ సంచలనం. 'రాను రాను అంటూనే చిన్నదో', 'ప్రియతమా తెలుసునా' వంటి సాంగ్స్ యువతను ఊపేశాయి. నెలల తరబడి థియేటర్స్‌లో సందడి చేసిన 'జయం' అనేక నయా రికార్డ్స్ ను నమోదు చేసింది. ఈ చిత్రంలో నటించిన నితిన్, సదా.. వీరిద్దరికీ కూడా ఉత్తమ తొలి చిత్ర నటులుగా ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కడం విశేషం.
అలాగే ఇదే చిత్రానికి నాలుగు నంది అవార్డులు కూడా రావడం గమనార్హం. ఉత్తమ విలన్‌గా గోపీచంద్, ఉత్తమ హాస్యనటుడిగా సుమన్ శెట్టి, ఉత్తమ బాలనటిగా శ్వేత.. అలాగే ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా సునీత నంది పురస్కారాలను పొందారు. సునీత ఈ చిత్రంలో సదా పాత్రకు డబ్బింగ్ చెప్పారు.
ఇదే చిత్రం తరువాత తమిళంలో కూడా రీమేక్ చేయబడింది. ఎం.రాజా దర్శకత్వంలో ఎడిటర్ మోహన్ కుమారుడు రవి ఈ చిత్రం ద్వారానే కోలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ఆయనే 'జయం' రవిగా సుపరిచితులయ్యారు. ఇక తమిళంలో కూడా విలన్ పాత్రను గోపీచందే పోషించారు. అలాగే తెలుగు సినిమాకి సంగీతం అందించిన ఆర్పీ పట్నాయక్‌నే.. తమిళ చిత్రానికి కూడా తీసుకున్నారు దర్శకుడు రాజా.
ఏదేమైనా, తెలుగు, తమిళ భాషలలో కూడా .. 'జయం' సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. ముఖ్యంగా, నితిన్‌కు తెలుగులో ఈ సినిమా తర్వాత వరుసగా ఆఫర్లు వచ్చాయి.
కాగా 'జయం' సినిమా ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా నితిన్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ‘ఇరవై సంవత్సరా క్రితం ఇదే రోజు నా మొదటి చిత్రం 'జయం'తో సినీ ప్రయాణాన్ని ప్రారంభించాను. నాలోని నటుడిని గుర్తించి, నాకు మొదటి బ్రేక్ ఇచ్చిన తేజ గారికి హృదయపూర్వక ధన్వవాదాలు.
ఇప్పటివరకు నేను చేసిన ప్రతి సినిమా దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, సిబ్బంది అందరికి ధన్యవాదాలు. మీరు లేకుండా నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉండేవాడ్ని కాదు.
నా ప్రయాణంలో మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. 'లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్'.. నన్ను ఇంతగా ఆదరిస్తున్న నా అభిమానులకు ధన్యవాదాలు’ అంటూ ఎమోషనల్ నోట్‌ను (Emotional Post) ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
ఇక, నితిన్ సినిమాల విషయానికి వస్తే... ప్రస్తుతం 'మాచర్ల నియోజకవర్గం'లో అనే చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ఈ సినిమాతో ఎం.ఎస్. రాజశేఖర్ రెడ్డి (ఎడిటర్ ఎస్.ఆర్. శేఖర్) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఇందులో కేథరిన్, కృతి శెట్టి హీరోయిన్లు. ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రేష్ట్ మూవీస్ పతాకాలపై ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత వక్కంతం వంశీతో ఓ సినిమా చేయనున్నాడు నితిన్.
Read More: Vikram (విక్రమ్) : లోకనాయకుడి సినిమా రైట్స్ సొంతం చేసుకున్న.. నితిన్ నిర్మాణ సంస్థ !
Follow Us