Karthikeya 2 Movie: 'కార్తికేయ 2' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సరదా సన్నివేశం.. అభిమానికి నిఖిల్ బహుమతి!

Published on Jun 25, 2022 10:06 PM IST

Karthikeya 2 Movie Trailer Launch Event: యంగ్‌​ హీరో నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన తాజా చిత్రం ‘కార్తికేయ 2’. కార్తికేయ సినిమాకు సీక్వెల్‌గా ఈ మూవీని రూపొందించారు. జులై 22న ఈ సినిమాను వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయనున్నారు మూవీ మేకర్స్. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అతి ముఖ్యమైన ధన్వంతరి పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటిస్తున్నారు. శాంతనుగా ఆదిత్య మీనన్.. సదానందగా శ్రీనివాస్ రెడ్డి.. సులేమాన్‌గా వైవా హర్ష కనిపించనున్నారు. కాగా, ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. 

ఇదిలా ఉంటే.. ఈ కార్యక్రమంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నిఖిల్‌ (Nikhil Siddarth) కెరీర్‌ ప్రారంభమైన నాటి నుంచి ఆయన నటించిన ప్రతి చిత్రాన్ని తాను చూస్తున్నానని, ఆయనంటే తనకెంతో ఇష్టమని చెప్పిన మహేశ్ అనే అభిమానికి హీరో అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. తనపై అమితమైన ప్రేమను చూపిస్తోన్న ఆ అభిమానిని స్టేజ్‌ పైకి పిలిచి.. తన కళ్లద్దాలను అతనికి గిఫ్ట్‌గా ఇచ్చారు. 

దీనికి సంబంధించిన వీడియోని ఈవెంట్‌ అనంతరం మహేశ్‌ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేయగా దానిపై నిఖిల్‌ స్పందిస్తూ.. "బ్రో.. ఆ కళ్లద్దాలను జాగ్రత్తగా చూసుకోండి. మీరు నాపై చూపించిన ప్రేమకు నేనిచ్చిన గిఫ్ట్‌ అది" అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. 

అనంతరం, స్టేజీపైనే ఉన్న (Actor Sreenivas Reddy) నటుడు శ్రీనివాస రెడ్డి.. తాను అనుపమ అభిమాని అని, ఏడో తరగతిలో ఉండగా ఆమె నటించిన 'ప్రేమమ్' చూసినట్లు చెప్పి నవ్వులు పూయించారు. దీంతో అనుపమ లేచి ఆయనకు హగ్ ఇచ్చినట్లుగా సంజ్ఞ చేయడం అలరిస్తోంది.