సెలబ్రిటీల వ్యక్తిగత విశేషాలు, వివరాలు తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. ఎవరిని పెళ్లి చేసుకున్నారు. ఎప్పుడు, ఎలా వాళ్ల పెళ్లి జరిగింది. వాళ్లది ప్రేమ వివాహమా.. లేక పెద్దలు కుదిర్చిన పెళ్లా.. అనే విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. తమ అభిమాన హీరో లేదా నటుడి యొక్క పెళ్లి వివరాలపై ఆసక్తి సాధారణంగానే ఉంటుంది కొందరికి. ఈ క్రమంలో రెండో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ (Tollywood) సెలబ్రిటీలపై ఒక లుక్కేద్దాం..
సీనియర్ ఎన్టీఆర్ – లక్ష్మీపార్వతి
విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ ఎన్టీఆర్ 20 ఏళ్ల వయస్సులోనే తన మేనమామ కుమార్తె బసవతారకమ్మను పెళ్లి చేసుకున్నారు. 1923, మే 28వ తేదీన పుట్టిన ఎన్టీఆర్ 1942లో బసవతారకమ్మను వివాహమాడారు. 1985లో గైనిక్ కేన్సర్‌తో ఆమె మరణించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్.. 1993లో లక్ష్మీపార్వతిని పెళ్లాడారు. 1996లో ఎన్టీఆర్ తుదిశ్వాస విడిచారు.
కృష్ణ – విజయ నిర్మల
సూపర్‌స్టార్ కృష్ణ 1961వ సంవత్సరంలో ఇందిరా దేవిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు 1969లో తన కో స్టార్ విజయ నిర్మలను పెళ్లాడారు. 1943 మే 31నన బుర్రిపాలెం అనే చిన్న గ్రామంలో పుట్టిన కృష్ణకు అయిదుగురు సంతానం. 2019, జూన్ 27న విజయ నిర్మల మరణించారు.
కృష్ణంరాజు – శ్యామలా దేవి
రెబల్‌స్టార్ కృష్ణంరాజు కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. ముందుగా సీతా దేవిని వివాహం చేసుకున్నారు కృష్ణంరాజు. ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో శ్యామలాదేవిని 1996లో రెండో పెళ్లి చేసుకున్నారు. జనవరి 20వ తేదీ 1940లో నరసాపురం దగ్గరలోని మొగల్తూరులో పుట్టారు కృష్ణంరాజు.
నాగార్జున – అమల
టాలీవుడ్ కింగ్ నాగార్జున ముందుగా నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కుమార్తె దగ్గుబాటి లక్ష్మిని వివాహం చేసుకున్నారు. 1984లో పెళ్లి చేసుకున్న వీళ్లు పలు విభేదాల కారణంగా 1990లో విడిపోయారు. 1986, నవంబర్ 23వ తేదీన వీళ్లకు అక్కినేని నాగచైతన్య జన్మించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు సినిమాల్లో తనతో నటించిన హీరోయిన్ అమలను 1992లో వివాహం చేసుకున్నారు నాగార్జున. వీళ్లకి 1994 ఏప్రిల్ 8వ తేదీన అఖిల్ జన్మించారు.
పవన్ కల్యాణ్ – అన్నా లెజ్నెవా
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ముందుగా నందిని అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. 1997లో పెళ్లి చేసుకున్న వీరిద్దరూ 2008లో విడిపోయారు. ఆ తర్వాత పవన్ తన కో స్టార్ రేణు దేశాయ్‌ను 2009వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. 2012లో రేణు దేశాయ్‌కు కూడా విడాకులు ఇచ్చేసిన పవన్.. తీన్‌మార్ సినిమాలో తనతో నటించిన అన్నా లెజ్నెవాను 2013లో వివాహం చేసుకున్నారు.
హరికృష్ణ – షాలిని
నందమూరి తారక రామారావు కొడుకు నందమూరి హరికృష్ణ రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. ముందుగా 1973వ సంవత్సరంలో లక్ష్మిని వివాహమాడారు హరికృష్ణ. కొన్ని సంవత్సరాల తర్వాత అంటే 1980వ సంవత్సరంలో షాలినిని పెళ్లి చేసుకున్నారు. 1956 సెప్టెంబర్ 2వ తేదీన నిమ్మకూరులో జన్మించిన హరికృష్ణ.. 2018, ఆగస్టు 29వ తేదీన నార్కట్‌పల్లిలో జరిగిన కారు ప్రమాదంలో మరణించారు.
విశ్వనటుడు కమల్ హాసన్ కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. 1954 నవంబర్ 7వ తేదీన పుట్టిన కమల్.. 1978వ సంవత్సరంలో వాణి గణపతిని వివాహమాడారు. 1988వ సంవత్సరంలో వాణి గణపతి నుంచి విడిపోయారు కమల్. ఆ తర్వాత 1988లో సారికను రెండో పెళ్లి చేసుకున్నారు. ఇక 2004లో సారిక నుంచి కూడా విడిపోయారు కమల్‌హాసన్. సారిక నుంచి విడిపోయిన తర్వాత చాలాకాలం హీరోయిన్ గౌతమితో సహజీవనం చేసిన కమల్ ప్రస్తుతం పూజా కుమారితో రిలేషన్‌షిప్‌లో ఉన్నారని టాక్.
ప్రకాష్‌రాజ్ – పోనీ వర్మ
విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. 1965, మార్చి 26న బెంగళూరులో పుట్టిన ప్రకాష్‌రాజ్ 1994వ సంవత్సరంలో లలిత కుమారిని వివాహమాడారు. కొన్ని సమస్యల కారణంగా లలిత కుమారికి దూరమైన ప్రకాష్.. 2010లో పోనీ వర్మను పెళ్లి చేసుకున్నారు.
శరత్‌బాబు
టాలీవుడ్‌తోపాటు పలు భాషల్లో నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరైన శరత్‌బాబు కూడా ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్నారు. ముందుగా తన కంటే వయస్సులో పెద్దదైన రమాప్రభను 1974లో పెళ్లాడారు. ఆ తర్వాత ఆమెతో మనస్పర్ధలు రావడంతో 1988లో విడాకులు తీసుకున్నారు. అనంతరం స్నేహ నంబియర్‌ను 1990వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్న శరత్‌బాబు ఆమెకు కూడా 2011లో విడాకులు ఇచ్చేశారు. ఆ తర్వాత జర్నలిస్టు వివాహం చేసుకున్నారని టాక్.
Follow Us