శంషాబాద్ ఎయిర్ పోర్టులో మ‌హేష్ బాబు (Mahesh Babu) ఫ్యామిలీ.. వీడియో వైర‌ల్!

Published on May 05, 2022 04:55 PM IST

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ (Mahesh Babu) మహేష్ బాబు-కీర్తి సురేశ్ జంటగా రూపొందిన‌ సినిమా 'సర్కారువారి పాట' . మైత్రీ, 14 రీల్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. కాగా, ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించాడు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ తమన్ స్వరపరిచిన పాటలు ఇప్పటికే చాలా పాపులర్ అయ్యాయి. లవ్.. యాక్షన్.. కామెడీ ప్రధానంగా రూపొందిన‌ ఈ సినిమాను ఈ నెల 12వ తేదీన విడుదల కాబోతోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ (Pre Release Event) ఈవెంట్ కోసం మూవీ టీమ్ సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 7వ తేదీన ఈ చిత్ర‌ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులో నిర్వహించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ ఇందుకు వేదిక కానున్న‌ట్లు స‌మాచారం. ఆ రోజు సాయంత్రం నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది. 
 
కాగా, రీసెంట్ గా ఈ సినిమా నుంచి విడుద‌లైన‌ ట్రైలర్ (Trailer) కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫైట్ మాస్ట‌ర్స్ రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన పోరాట స‌న్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలవ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 'గోవా'లో చిత్రీకరించిన ఇంటర్వెల్ బ్యాంగ్ కి థియేటర్స్ లో ఖ‌చ్చితంగా అభిమానుల‌ విజిల్స్ పడతాయని చెబుతున్నారు. అయితే, హ్యాట్రిక్ హిట్ సినిమాల‌ తరువాత మహేశ్ చేస్తున్న ఈ సినిమా ఏ స్థాయిలో అంచనాలను అందుకుంటుందనేది చూడాలి.

ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల స‌ర్కారువారి పాట షూటింగ్ కంప్లీట్ కావ‌డంతో.. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఫ్యామిలీ పారిస్ కు కొన్ని రోజులు వెకేష‌న్ కు వెళ్లింది. ఇటీవ‌లే వెకేష‌న్ పూర్తికావ‌డంతో.. తాజాగా ఆయ‌న ఫ్యామిలీ మెంబ‌ర్స్ తిరిగి హైద‌రాబాద్ కు చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో మీడియా కంట‌ప‌డింది. ఆ వీడియోలో మ‌హేష్ బాబుతో పాటు ఆయ‌న భార్య న‌మ్ర‌తా శిరోద్క‌ర్, కుమారుడు గౌత‌మ్, కూతురు సితార ఉన్నారు. కాగా, ఈ వీడియో ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.